నాలుకలు!

అనిత

హాయ్ భావనా! ఎలా ఉన్నావ్?
7:23 PM

భావన

గ్రేట్ అనితా! వాట్సాప్?
7:23 PM

అనిత

ఈ వారం వెబ్ మేగజీన్ ‘ఆకాశం’లో కమలిని రాసిన ‘అడుసులోమడిసి’ కథ చదివావా? అద్భుతం అనుకో. నేనింకా ఆ హేంగ్ఓవర్ నుండి తేరుకోలేదు. ఈ ఏడాది వచ్చిన మంచి కథల లిస్టులో ఖచ్చితంగా ఉంటుంది. చదువు. తర్వాత ఫేస్బుక్ గ్రూప్‍లో వివరంగా మాట్లాడుకుందాం.
7:24 PM

+91 99999 99999 ~ఎడిటర్ శ్రీనివాస్

క్రిటిక్ పరశురామ్‍గారూ. నేను. ‘తెలుగు కథ’ వారపత్రిక ఎడిటర్ శ్రీనివాస్‍ని.
2:44 PM

క్రిటిక్ పరశురామ్

ఆ! సార్. చెప్పండి. కొత్త ఫోను. కాంటాక్ట్స్‌ అప్డేట్ చేసుకోలేదు ఇంకా. నెంబర్ వెంటనే గుర్తు పట్టలేదు.
2:44 PM

ఎడిటర్ శ్రీనివాస్

అడుసులో మడిసి కథ ఈమధ్య ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా? అందుకే కమలిని గారి కథాసంకలనం మొదటి కాపీ మనకే వచ్చేలా ఏర్పాటు చేశాను, మన పత్రికలోనే మొదటి రివ్యూ రావాలని. అది మీరే రాయాలి. వీలయినంత త్వరగా రాసి పంపించగలరు.
2:45 PM

క్రిటిక్ పరశురామ్

ఆ కథ, ఆ పుస్తకం అంతా ఉత్త హైప్. మీ పత్రిక స్థాయికి తగ్గది కాదు. ఎవరేం రాస్తారో రాయనీయండి. అవసరం అనుకుంటే అప్పుడు చూద్దాం.
2:45 PM

NRI మిత్రుడు

పరశురామ్‍ అన్నా. అన్నా! నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. ఈసారి ఇక్కడ షికాగోలో జరిగే తెలుగు మహాసభలకి నిన్ను పిలిపిస్తున్నా. వీసా పేపర్లు ఫెడెక్స్‌లో పంపుతున్నా. ఎట్లన్నా మరో రెండు రివ్యూలు రాయించన్నా?
2:13 AM

సాహిత్యశ్రీ

A2Z యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు గారికి:

నమస్తే సార్! సామీ అవార్డు ఎప్పుడో వచ్చినా, ఇన్నాళ్ళకి మీకు నా కథ ఎంచుకుందికి తీరుబాటు దొరికినందుకు ముందుగా కృతజ్ఞతలు. రాబోయే శనివారం అయితే కుదురుతుంది. ఆ తర్వాత మాత్రం చెప్పలేను. మీరు కొత్త వారిని బాగానే ప్రోత్సహిస్తున్నారే! మెచ్చుకోదగ్గ విషయం.

సాహిత్యశ్రీ
సామీ అవార్డుగ్రహీత
10:36 AM

కమలిని (అడుసులోమడిసి రచయిత్రి)

ఆంగ్లశ్రీ గారూ, మన కామన్ ఫ్రెండ్ అనిత మీ నంబరు ఇచ్చింది. మీరు ఏమీ అనుకోరన్న ధైర్యంతో నా పెర్సనల్ జియో నంబరు మెసేజి పెడుతున్నాను.

మీ ఆంగ్ల అనువాదాలు మీ బ్లాగులో, ఎఫ్.బీ.లో, చూస్తూనే ఉంటాను. అవి అస్సలు అనువాదాలనిపించవు. ఇంగ్లీషులోనే రాసేరేమో అనిపిస్తాయి. అది నా ఒక్కదాని అభిప్రాయం మాత్రమే కాదు. నాకు తెలిసినవారందరిదీ అదే మాట. మీ అనువాదాలు చదివినప్పుడల్లా నా రచన ఒక్కటైనా మీరు అనువాదం చేస్తే బాగుండునని తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఈ జన్మకి ఆ కోరిక తీరేనా!? అన్నట్టు, నా పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. తప్పకుండా చదువుతారు కదూ?

మీ
కమలిని
అడుసులోమడిసి ఫేమ్
జియో: xxxxx-xxxxx
9:09 PM

సాహిత్యశ్రీ

పరశురామ్ గారూ?
8:12 PM

క్రిటిక్ పరశురామ్

ఆ!ఎవరిదీ?
8:12 PM

సాహిత్యశ్రీ

నేనండీ సాహిత్యశ్రీ. మీ పుస్తకం సామీ అవార్డుకి షార్ట్ లిస్టు చేయించాను. విశ్వ విఖ్యాత విమర్శకులు మీరు. నాకు చాలా గర్వంగా ఉంది. మీకు ఆ శుభవార్త చెప్దామని.
8:12 PM

క్రిటిక్ పరశురామ్

ఔనా, థాంక్యూ. థాంక్యూ. ఆ పుస్తకానికి ఇంకా చాలా పేరు రావల్సివుంది. తెలుగులో అటువంటి విమర్శ మునుపెప్పుడూ రాలేదు. తెలుగువాడిగా పుట్టడం మన ఖర్మ. ఎనీవే, మీరైనా గుర్తించినందుకు సంతోషం.
8:13 PM

సాహిత్యశ్రీ

ఇంకో చిన్న విషయం సార్. ఈ A2Z యూట్యూబ్ చానెల్‍గాళ్ళు నా బుర్ర తినేస్తున్నారు. వచ్చే శనివారం నా కథ చదివించి ఏదో చర్చ పెడతామని. మీకు వీలవుతుందా?
8:13 PM

క్రిటిక్ పరశురామ్

తప్పకుండా. నవతరం సాహిత్యాన్ని, రచయితలనీ ప్రోత్సహించడమే విమర్శ కదా.
8:13 PM

సాహిత్యశ్రీ

అయితే మీరే ముఖ్యవక్త. మరొకరెందుకూ? ఎవరైనా వస్తే గిస్తే, వాళ్ళని కూడా మాట్లాడమందాం. ఓకేనా?”
8:15 PM

క్రిటిక్ పరశురామ్

ఓకే. అలాగే. కాగానే బైట ఎక్కడైనా కలుద్దాం. స్కాచ్ తాగి చాలా కాలమైంది. డామ్ కోవిడ్!
8:16 PM

సాహిత్యశ్రీ

A2Z చానెల్. శనివారం సాయంత్రం 5.30కి. మెసేజి పెడతాను. సరేనా? థాంక్యూ.”
8:16 PM

కమలిని (అడుసులోమడిసి రచయిత్రి)

హలో ప్రా.స.గారూ, బాగున్నారా? ప్రాంతీయ సలహా మండలి సభ్యులుగా నియమించబడినందుకు నా హృదయపూర్వక అభినందనలు. మీ ఎంపిక మా అందరికీ గర్వకారణం. మీ ప్రోత్సాహం లేకుంటే ఇంతదాన్ని కాలేకపోయేదాన్ని. మీ ప్రోత్సాహం ఎప్పుడూ కొనసాగాలని కోరుకుంటూ,
మీ
కమలిని
అడుసులోమడిసి ఫేమ్
జియో: xxxxx-xxxxx
9:12 PM

కమలిని (అడుసులోమడిసి రచయిత్రి)

హలో పరశురామ్ గారూ,

ఓ మైగాడ్! ఎఫ్.బీ.లో నా పుస్తకం మీద నా ఫ్రెండు రాసిన సమీక్షకి మీరు అభిమానంతో పెట్టిన అద్భుతమైన కామెంటుకి ముందుగా ధన్యవాదాలు. సామీ అవార్దుకి అర్హమైన పుస్తకం అన్న మీ స్పందన చదివిన తర్వాత మనసులో కలిగిన భావాలని చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. అఫ్‍కోర్స్. నే నింకా బుడిబుడి నడకల దాన్నే. అయినా మీ లాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పటికైనా నిజం కాకపోవు! మీ బ్లాగు నేను రెగ్యులర్‍గా చదువుతుంటాను. సబ్‌స్క్రైబర్‌ని కూడా. నన్ను గుర్తించినందుకు a bundle of thanks.

మీకు తెలిసిన మంచి ఇంగ్లీషు అనువాదకులకి నా రచనలు దయచేసి పంపరూ? ప్లీజ్!
మీ
కమలిని
అడుసులోమడిసి ఫేమ్
జియో: xxxxx-xxxxx
9:15 PM

సాహిత్యశ్రీ

హలో అనిత గారూ! ఎలా ఉన్నారూ?
6:55 PM

అనిత

వావ్! సాహిత్యశ్రీగారూ! వాటే ప్లెజంట్ సర్ప్రయిజ్! ఏవిటిలా ఇంతకాలం తర్వాత మెసేజ్!
6:55 PM

సాహిత్యశ్రీ

ఎవరో కమలిని అట. మీ ఫ్రెండునని చెప్పి మొన్న ఒకామె అరగంట కాల్చేసింది. ఈవిడకేనా నేను ముందుమాట రాసిందీ?
6:56 PM

అనిత

అవునండీ. కమలినికి నిజంగా మీరంటే ఆరాధన, గౌరవం.
6:56 PM

సాహిత్యశ్రీ

గుర్తే లేదు. ఎంతమందికో ముందుమాటలూ, వెనుకమాటలూ రాస్తుంటాం. ఎందర్నని గుర్తుపెట్టుకోవడం?
6:58 PM

అనిత

అవునండీ. మిమ్మల్ని ఇలా ఎందరో ప్రతిరోజూ అడుగుతుంటారు కదా. మీరు మరి అంత గొప్పవారు.
6:58 PM

సాహిత్యశ్రీ

హహహ. అదేమంత లేండి. మీ ఫ్రెండ్ పుస్తకం బాగుంది. చూద్దాం సామీకి నామినేట్ చేయగలనేమో. అన్నట్టూ, A2Z చానెల్ వాళ్ళు నన్ను మొహమాట పెట్టి రేపు శనివారం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. నాకిలాంటివి ఏవీ కిట్టవని మీకు తెలుసుగా. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే కీర్తి కిరీటాలు ఏముంటాయి చెప్పండి? సాహిత్యం రోకట్లో తల దూర్చాక ఇలాంటి పోట్లు భరించక తప్పదు కదా. మీకు వీలవుతుందా? మీ మిత్రురాల్ని కూడా నా తరఫున పిలవండి. ఈ తరం అభిప్రాయాలుకూడా తెలియాలిగా!
7:02 PM

అనిత

తప్పకుండా. కమలినికి చెప్తాను. తప్పకుండా అటెండ్ అవుతాం.
7:04 PM

సాహిత్యశ్రీ

అన్నట్టూ, మీ సంకలనం ఎప్పుడు తెస్తున్నారు?
7:04 PM

అనిత

అమ్మో! తెలీదండీ. మీకు చెప్పకుండా చేయను కదా. అయినా మీ ఆశీర్వాదం లేకుండా ఎలా?
7:04 PM

సాహిత్యశ్రీ

భలేవారే! ఇప్పటికే ఆలస్యం అయింది. ఓ పని చెయ్యండి. మీ రచనలన్నీ మన ‘ప్రా.స.కి ‘ పంపండి. పరశురామ్‍కు చెప్పి నేను ముందుమాట రాయిస్తాను.
7:05 PM

కమలిని (అడుసులోమడిసి రచయిత్రి)

A2Z యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు గారికి:

మీ చానెల్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తుంటా. భలే కథలు, ఎప్పటెప్పటివో నా చిన్నప్పటివి. ఎలా సేకరించి తెస్తారో ఇలాంటి అమూల్యమైన కథలు! చదివించి చర్చిస్తున్నారు. సాహిత్యశ్రీ గారి కథ గురించి ఏం చెప్పను? గురజాడ సంస్కరణా, శ్రీశ్రీ అభ్యుదయమూ, దిగంబర కవుల ధిక్కార స్వరం, ఆధునికాంతర పోకడలు, మేజికల్ రియలిజం, ఓహ్ ఒకటేమిటి, OMG! అన్నీ కలిసిన… అన్నీ ఉన్న … ఆయన నిజంగా సాహిత్యశ్రీ. ఈ రోజు కార్యక్రమానికి రాకపోయి ఉంటే ఎంత మిస్సయిదాన్ని? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ
కమలిని
అడుసులోమడిసి ఫేమ్
జియో: xxxxx-xxxxx
6:46 PM

అనిత

కంగ్రాచ్యులేషన్స్ కమలిని! దొంగమొహందానా. నువ్వు చెప్పకపోతే తెలీదనుకున్నావా?
8:23 AM

కమలిని (అడుసులోమడిసి రచయిత్రి)

లేదే. మెసేజ్ పెట్టబోయి, అలా కాదు ఫోన్ చేసి మాట్లాడదామనుకున్నాను. అందుకే ఆగాను.
8:24 AM

అనిత

మొత్తానికి సాధించేవ్. పరుశురామ్‍గాడినీ, సాహిత్యశ్రీగాడినీ, ప్రా.స.నీ, ఆంగ్లశ్రీనీ అందరినీ పార్టీకి పిలిచి, బచ్చాగాళ్లలా ఆడించావ్. జయహో!
జయహో!
8:24 AM

కమలిని (అడుసులోమడిసి రచయిత్రి)

ష్! ఇవన్నీ వాట్సాప్‍లో మాట్లాడుకునేవి కావు. ఫోన్ చేస్తున్నా, ఉండు.
8:24 AM

[స్ఫూర్తి: Sarah Bernhardt Comes To Town – from The Undiscovered Chekhov.]

[https://eemaata.com/em/issues/202202/27935.html పాఠకుల సూచన మేరకు మొదట్లో పేరులేని కొన్ని పాత్రలకు పేర్లను జతచేసి కథను సవరించాము. -సం. ఫిబ్రవరి, 11, 2022. ]

[పేరు పెట్టకుండా వదిలిపెట్టిన కొన్ని పాత్రలకి పేర్లు పెట్టి, ఫిబ్రవరి 22 సంచికలో ప్రచురించినందుకు ఈ మాట సంపాదకులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథకి చెహోవ్ కథ ప్రేరణ.]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: