Prof. Shiv K Kumar’s Foreword to Incidental Muses
The Painting
నాది పుట్టుక విజయనగరం దగ్గర చెల్లూరు అనే గ్రామం అయినా, డిగ్రీ వరకు చదువు మహారాజా హై స్కూలు, కళాశాల లోనూ. తర్వాత విశాఖ పట్నం ఆంధ్రా యూనివర్సిటీ లో స్నాతకోత్తర విద్య పూర్తి చేసాను. (M.Sc. Applied Mathematics (1970-72) and MA (English) 1982 – 84). ఆ రోజుల్లో పేద విద్యార్థులకీ, తెలివైన విద్యార్థినీ, విద్యార్థులకీ సింహాచలం దేవస్థానం విద్యార్థి భోజన సత్రంలో భోజన సదుపాయం ఉండేది. మా అక్కలిద్దరికీ సంస్కృతకళాశాలలో భాషాప్రవీణ చదువు వరకూ ఉచిత భోజన సదుపాయంలభిస్తే, నాకు 1963- 1969 వరకూ దొరికింది. అక్కడ నాతోపాటు భోజనం చేసిన సహాధ్యాయుల్లో చాలా మంది జీవితంలో పైకి వచ్చారు. డా. పప్పు వేణుగోపాల రావు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికన్ స్టడీస్, చెన్నై), డా. భట్టిప్రోలు శ్రీరామ్మూర్తి (ప్రిన్సిపాల్, గరివిడి కాలేజీ) వెంటనే గుర్తొస్తున్నారు. మా అక్క తమ్మా సీతాదేవి (1947- 1993) యూనివర్శిటీ స్థాయిలో బంగారు పతకం సంపాదించి తను చదివిన కాలేజీలోనే వ్యాకరణం బోధించేది.మరొక అక్క వారణాసి సుబ్బలక్ష్మి విశాఖపట్నం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో గ్రేడ్ 1 తెలుగు పండిట్ గా పనిచేసి పదవీ విరమణ చేసింది.
ముందుగా స్మరించాలంటే నేను 11 , 12 తరగతులలో మా లెఖ్ఖలు మాష్టారు శ్రీ గంటి వెంకట రమణయ్య పంతులు (GVR మాష్టారు) గారిని స్మరించుకుంటాను. తర్వాత, అదే సమయంలో మాకు ఇంగ్లీషు చెప్పిన శ్రీ AL ప్రసాద రావు మాష్టారు గారిని తలుచు కుంటాను. సాహిత్యం పట్ల అభిరుచికి ముందు మా నాన్నగారూ, అమ్మగారూ, తర్వాత నా ఇద్దరు అక్కలూ, డిగ్రీలో పాఠాలు చెప్పిన శ్రీ సాయినాథ శాస్త్రిగారూ కారణం. ఆంగ్లసాహిత్య వైపు నా దృష్టి మరలడానికి కొంతవరకు మాకు డిగ్రీలో King Lear బోధించిన బహుభాషాకోవిదుడూ, శ్రీ శ్రీ ఆరుద్ర వంటి హేమాహేమీలకు గురువైన శ్రీ రోణంకి అప్పల స్వామి మేష్టారి ఆ నాటకమే కారణం. అయితే 75 లో విజయవాడలో ఉద్యోగంలో చేరి ఒక్కడినీ ఉంటున్నప్పుడు సాహిత్యంపట్ల మమకారాన్ని ద్విగుణీ కృతం చేసిన గురుమిత్రులు శ్రీ Y. సుబ్రహ్మణ్య శర్మ గారిని ఎలా మరిచిపోగలను?
.
యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, టెక్సాస్ లో 2011 లో స్ప్రింగ్ సెమెస్టరులో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా జాయిన్ అయి Spring Semester పూర్తిచేసాను. కాని అనారోగ్య కారణాలవల్ల వెనక్కి తిరిగి వచ్చేశాను. మా మేనమామ RS కృష్ణమూర్తి గారూ, నేనూ కలిసి1997 లో “The Palette” అన్న పేరుతో తెలుగునుండి 19 మంచి కథలని ఇంగ్లీషులోకి అనువాదం చేసి ప్రచురించేము.
వర్డ్స్ వర్త్, కాలరిడ్జ్ కలిసి జంటగా తీసుకుకువచ్చిన Lyrical Ballads (1798) కి 1998లో 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సౌభాగ్య అన్న నా కవిమిత్రునితో కలిసి “నువ్వూ- నేనూ, గానమూ- గళమూ” అన్న తెలుగు కవితా సంకలనం ప్రచురించి ,అందులో కవితలు అన్నీ కుడివైపునే ఉండేలా ఒక కొత్త ప్రయోగం చేసేము. దానివల్ల, రెండవ కవి కవితలు ఎప్పుడు చదవాలన్నా పుస్తకాన్ని 180 డిగ్రీలు Verticalగా తిప్పి చదవాల్సిందే.
1999 లో The Incidental Muses అన్న నా ఆంగ్ల కవితా సంకలనాన్ని, 2007లో Tangs of Telugu అన్న పేరుతో తెలుగులో లబ్ద ప్రతిష్టులైన కవుల 50 కవితల అనువాదాలు ప్రచురించేను.
మా మేనమామకీ నాకూ 2000 సంవత్సరానికి “Katha – British Council South Asian Translation Award 2000 అల్లం శేషగిరి రావుగారి “మృగతృష్ణ” కథ అనువాదానికి లభించింది. తెలుగులోంచి 100 మంచికథల అనువాదం చెయ్యాలన్న ప్రాజెక్టులోని రెండవ పుస్తకం The Easel ను 2015 అక్టోబరు 18 వ తేదీన రచయిత, నటుడూ శ్రీ రావికొండలరావుగారు హైదరాబాదులో ఆవిష్కరించారు.
మా GMR సంస్థలో వరిష్ట అధికారి శ్రీ SVM శాస్త్రి గారితో కలిసి, ప్రముఖ రచయిత, పూర్వాశ్రమంలో IIM Ahmedabad లో ప్రొఫెసరుగా పనిచేసి అప్పటికి GMRV Foundation కి CEO గా ఉన్న Prof. V Raghunathan గారి Games Indians Play అన్న పుస్తకాన్ని ఇవండీ మనవాళ్ళ ఆటలు పేరుతో అనువాదం చేశాను. దాన్ని ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు.
తెలుగులోంచి సుమారు 80 మంది (లబ్దప్రతిష్ఠులనుండి కొత్తవారివరకూ) కవుల 199 కవితల్ని (మిగిలిన 200వ కవిత మారుపేరుతో Facebook లో వ్రాసిన కవి / కవయిత్రి, ప్రచురణసమయంలొ పేరుగాని, అడ్రసుగాని, email గాని, ఫోను నంబరుగాని ఏదో ఒకటి పాఠకులకి అందించాలన్న నిబంధనకి ఇష్టపడక బయటపడకపోవడంతో తొలగించవలసి వచ్చింది) Wakes on the Horizon పేరుతో ప్రచురించి, అమెరికాలోని శ్రీ వంగూరి ఫౌండేషను వారు సాహిత్యానికీ, కళలకీ చేస్తున్న కృషికి ఉడతాభక్తిగా సమర్పించినపుడు, దానిని ప్రముఖనటుడు, రచయిత దర్శకుడు శ్రీ తనికెళ్ళ భరణిగారు 2016 సెప్టెంబరులో అమెరికాలోనూ, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గారు 5వ ప్రపంచ తెలుగు మహాసభలలో నవంబరులో సింగపూరులోనూ ఆవిష్కరించారు.
GMR సంస్థ అధినేత శ్రీ గ్రంధి మల్లికార్జునరావుగారు, తమ సంస్థకి చాలా కాలం సలహాదారుగా ఉన్న శ్రీ మార్షల్ గొల్డ్ స్మిత్ వ్రాసిన What Got You Here Won’t Get You There పుస్తకాన్ని ఆయన అనుమతితో, దేశంలోని యువతరానికి స్ఫూర్తిదాయకంగా అందుబాటులో ఉండడానికి కొన్ని ముఖ్య భాషలలో అనువదించడానికి అనుమతి తీసుకున్నపుడు, తెలుగులో దాన్ని “మిమ్మల్ని ఇక్కడ దాకా చేర్చింది అక్కడకు చేర్చదు” అన్న పేరుతో అనువాదం చేసి 2017 మార్చిలో ప్రచురించడం జరిగింది.
2016 లో Shakespeare 400 వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా Word Wiz అన్న నాటిక వ్రాయడం జరిగింది. క్లుప్తంగా దాని ఇతివృత్తం అతని నాటకాలలోని ప్రముఖ పాత్రలే తమకి అజరామరమైన కీర్తిని తెచ్చిపెట్టినందుకు నేటి యువతరానికి తమ గూర్చి చెబుతూ నివాళి సమర్పించడం. అది ఇప్పటికీ ఇంకా అముద్రితం.
2017 డిశంబరుతో ఉద్యోగవిరమణ చేద్దామన్న తలంపుతో GMR సంస్థతో, కుటుంబ సభ్యులతో ఉన్న 12 ఏళ్ళ అనుబంధానికి చిహ్నంగా, Facebook లోని కవిసంగమం గ్రూపులో 2 సంవత్సరాలపాటు ప్రతి ఆదివారం నిర్వహించిన “కవిత్వంతో ఏడడుగులు” అన్న శీర్షికతో 100 ఉత్తమ ప్రపంచకవితలపై అనువాద, పరిచయాలతో కూడిన వ్యాసాలను, సంకలనంగా తీసుకువచ్చి 2018 జనవరిలో అంకితం ఇవ్వడం జరిగింది.
పైన చెప్పిన వంద కథల ప్రాజెక్టులో 3 వ పుస్తకం, The Canvas ను, మా మనుమరాళ్ళు చి. అస్మిత, చి. అన్వి Hyderabad Study Circle లో జరిపిన ఒక కార్యక్రమంలో 9 మార్చి 2019 న ఆవిష్కరించారు. దానికి Muse India ముఖ్య సంపాదకులు శ్రీ ఉప్పలూరి ఆత్రేయ శర్మ గారు అధ్యక్షత వహించగా, పుస్తకానికి ముఖచిత్రం వేసిన శ్రీమతి సమీర సమీక్షించారు.
నా సాహిత్య కృషిలో “లేఖిని” పోషించిన పాత్రకు కృతజ్ఞతగా, ఆ App సృష్టికర్త వీవెన్ గారికి, నేను ( నా మేనమామగారు RS కృష్ణమూర్తి) ఇంగ్లీషునుండి తెలుగులోకి అనువాదం చేసిన గొప్ప కథలను “కథాలేఖిని“ పేరుతో ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది.
మా మొదటి అనువాదకథల సంకలనం “The Palette” లో చాలా అచ్చుతప్పులు దొర్లాయి. అందుకని వాటన్నిటినీ స్వయంగా సవరించి రెండవ ముద్రణ Amazon లో చేర్చాను.
నా ఇంగ్లీషు కవితల రెండవ సంకలనం “The PenChants” Kindle లో దొరుకుతుంది.
కరోనా మహమ్మారి 2020 జనవరి నుండి ప్రపంచాన్ని గడగడ వణికించి, అందరినీ ఇళ్ళకే పరిమితం చేసిన సందర్భంలో ఎంపిక చేసిన కొన్ని తెలుగు కవితల అనువాదాల్ని Voices of the Surf పేరుతో 2021 లో తీసుకు వచ్చాను.
21.9.21 మా అమ్మ నౌడూరి లక్ష్మీ కాంతం జయంతి శతాబ్ది ఉత్సవాలు అందరి కుటుంబ సభ్యుల మధ్యన చేద్దామని ప్రణాళికలు వేసుకున్నాం గానీ కుదరలేదు. కానీ, ఆ సందర్భంలో మా 100 కథల అనువాద ప్రణాళికలో భాగమైన 4వ పుస్తకం The Painting ని ఆమె స్మృతి చిహ్నంగా ఆత్మీయ మిత్రులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు, ఆంగ్ల కవయిత్రి మంచి మిత్రురాలు Shernaz Wadia, ప్రముఖ కథకులు, తెలుగు సాహిత్య చరిత్ర గురించి అనర్గళంగా మాటాడగల మిత్రులు శ్రి చిర్రావూరి శ్యాం గారూ, కథ, నవల, చిత్రలేఖనం మొదలు అనేక విషయాలలో అందె వేసిన చెయ్యి శ్రీ గొర్తి బ్రహ్మానందం గారూ, ఆత్మీయ మిత్రులూ, మంచి విమర్శకులూ, నాకు మా మేనమామ కృష్ణమూర్తిలా ఎప్పుడూ ఇష్టమైన వారూ శ్రీ సాయి రాచకొండ గారూ ఆవిష్కరించారు.
Disclaimer: నా బ్లాగులో ఉంచిన అనువాదాలకి కవితలకి అక్కడక్కడ ఉంచిన చిత్రాలు వేటికీ నాకు అనుమతి లేదు. కేవలం వాటిని సాహిత్య ప్రయోజనం ఉద్దేశించి ఉపయోగించినవే తప్ప వేరు ఉద్దేశ్యం లేదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లైన నా దృష్టికి తీసుకువచ్చిన తక్షణం ఆ చిత్రాన్ని తొలగిస్తానని హామీ ఇస్తున్నాను.
స్పందించండి