“నాకు ఎవరైనా పని ఇప్పించరా?” అని నేను పొద్దున్నే వేడుకున్నాను.
నేను చక్కని రాళ్ళు పరచిన రహదారి మీద నడుస్తున్నాను.
చేతిలో కత్తితో మహరాజు రథం మీద వచ్చేడు.
చేయి చాపుతూ, “నా అధికారంతో నీకు పని ఇస్తునా, రా” అన్నాడు.
కాని అతని అధికారానికి నేను విలువ ఇయ్యలేదు.
అతని రథం మీద తిరిగి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. అందరూ తలుపులు వేసుకున్నారు.
నేను వంకరతిరిగిన సందుల్లోంచి నడుస్తున్నాను.
ఒక ముదుసలి బంగారు సంచితో ఎదురొచ్చాడు.
కాసేపు తటపటాయించి, “నా డబ్బుతో నీకు పనిస్తా, రా” అన్నాడు.
ఒక్కొక్క నాణేన్ని ఎగరేస్తూ చెప్పాడు. నేను వద్దన్నాను.
సాయంత్రం అయింది. ఉద్యానం కంచె చుట్టూ పూలు విరగబూసి ఉన్నాయి.
ఒక అందమైన పడుచు, “రా, నా నవ్వుతో నిన్ను కొంటాను” అంది.
ఆమె నవ్వు వాడి, కరిగి కన్నిరైపోయింది. ఆమె చీకటిలో కలిసిపోయింది.
సూర్యుడు ఇసకమీద మెరుస్తున్నాడు.
సముద్రపొడ్డున కెరటాలు వంపులు వంపులుగా ఎగసి
భళ్ళున విరుగుతున్నాయి.
ఒక బాలుడు గవ్వలతో ఆడుకుంటున్నాడు.
అతను తలేత్తి చూశాడు. నన్నెరుగును కాబోలు.
“నేను నీకు ఏమీ ఇవ్వలేను నాతో గడిపినందుకు” అన్నాడు.
అంతే! అప్పటినుండి ఆ కుర్రాడితో కుదిరిన ఒప్పందంతో
నేను స్వేచ్ఛాజీవి నయ్యాను.
.
రవీంద్రనాధ్ టాగోర్
స్పందించండి