ఎన్ని లక్షల వసంతాలు గడిచిపోయి ఉంటాయి
నీలాంబరి పూలు అంత నీలంగా ఉంటాయనీ,
వాకకాయలు అంత తెల్లగా ఉంటాయని
నేను తెలుసుకునే లోపు.
ప్రాణం నాతో తెగతెంపులు చేసుకున్నాక
అల్లనల్లన వచ్చే ఎన్ని వేల వసంతాలు
నీలాంబరాలతో నీలిమంటలనీ
వాకపొదల్లో తెల్లమంటల్నీ పుట్టిస్తాయో.
ఓహ్! మీ అందంతో నన్ను దహించండి!
ఓ చెట్టూ చేమల్లారా! నన్ను గాయపరచండి,
లేకపోతే చివరికి మృత్యువు ప్రయత్నిస్తుంది ఈపాటి
సంతోషసమయాన్ని కూడా మిగల్చకుండా లాక్కుపోడానికి.
తూగాడే పువ్వుల్లారా!తళతళలాడే వృక్షాల్లారా!
సూర్యకాంతిలో మెరిసే వెలి, నీలిరంగులారా!
తీవ్రంగా గాయపరచండి; శాశ్వతనిద్రలోకూడా
ఆ గాయపు మచ్చ నన్ను వదిలిపెట్టకుండేలా.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి.
ప్రేమకవిత్వానికి పేరు రాయనక్కరలేని కవయిత్రి సారా టీజ్డేల్. ఎంత సుకుమార భావననైనా , అంత సుకుమారమైన పదాలలోనో, ప్రతీకలలోనో చెప్పడం ఆమె ప్రత్యేకత. బ్రతికున్న క్షణాలలోని అనుభూతుల్ని మృత్యువులో కూడా మోసుకెళతాననడం, ఆ తీయని బాధని కోరుకోవడం, కవిత్వం కాక మరేమిటి?
.

వ్యాఖ్యానించండి