బిల్బో హంసగీతి… జె. ఆర్. ఆర్. టోల్కియెన్, ఇంగ్లీషు రచయిత

పొద్దు ముగిసింది, కళ్ళు మసకబారుతున్నై

కానీ ఎదురుగా వెళ్ళవలసిన దూరం చాలా ఉంది.

మిత్రులారా! సెలవిక! పిలుపు వచ్చేసింది. 

రాతిగోడకి ఆవల నౌక సన్నద్ధంగా ఉంది. 

నురుగు తెల్లగా, కెరటాలు నల్లగా కనిపిస్తునై;

పడమటి కొండనుదాటి అదిగో త్రోవ సాగుతోంది.

నురుగు ఉప్పగా,  గాలి హాయిగా తగుల్తునాయి.

అదిగో సముద్రం ఎగిసిపడడం వినిపిస్తోంది.

.

మిత్రులారా, సెలవిక! తెరచాపలు తెరచాపలు పైకి లేచాయి.

తూరుపుగాలి వీస్తోంది, లంగర్లు అసహనంగా కదుల్తునాయి

ఎప్పుడూ ఊరిస్తూ చేతికిచిక్కని ఆకాశం క్రింద

నా నీడలు నాకంటే పొడవుగా ముందుసాగుతున్నాయి;

సూర్యుడికి వెనక ఇంకా అనేక ద్వీపాలున్నాయి

అంతా ముగిసిపోయే లోగా నేనక్కడ తేలుతాను

అక్కడ లోకాలు పడమటకి పడమరంగా ఉంటాయి

రాత్రి నిశ్శబ్దంగా ఉండి, నిద్ర అలసటతీరుస్తుంది.

.

ఆ ఒంటరి నక్షత్రం చూపించే మార్గం లో

రేవు కడపటి హద్దును దాటితే చాలు

ఆకాశం నిర్మలంగా అనంతంగా కనిపిస్తుంది

నక్షత్రాలు మిణుకుమంటున్న సముద్రంలా;

నా ప్రియమైన అంభోయానపాత్రమా! పడమటికి పద

నా మిత్రులూ, ఈ ప్రకృతీ వర్థిల్లుదురుగాక!

ఈ భూమధ్యానికి నా చిట్టచివరి నమస్కారం

అప్పుడే నా ఓడస్థంభం నెత్తిన చుక్క కనిపిస్తోంది.

.

జె. ఆర్. ఆర్. టోల్కియెన్

3 January 1892 – 2 September 1973

ఇంగ్లీషు రచయిత 

John Ronald Reuel Tolkien ఇంగ్లీషు కవీ, రచయితా, భాషాశాస్త్రవేత్తా, యూనివర్శిటీ ప్రొఫెసరు (1925-1959). 

స్వైరకల్పనా చతురతతో రాసిన The Hobbit, The Lord of the Rings, Silmarillion నవలలకి ప్రపంచఖ్యాతి లభించింది. ఎలిజబెత్ II మహారాణి అతన్ని Commander of the Order of British Empire (CBE)తో సత్కరించింది.

కొందరి జీవితాలు కథలుగా చెప్పుకుంటే, కొన్ని కవితలకీ. కథలకీ కూడా కథలుంటాయి.

తన దగ్గర చాలా కాలం ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన జోయ్ హిల్ తో ఎప్పుడూ టోల్కియెన్ సరదాగా జోక్ చేస్తూ ఉండే వాడట, ఎప్పుడైనా తనకు వచ్చిన ఉత్తరాలలని ఆమె పరిశీలించి తనకి అందిస్తున్నప్పుడు పొరపాటున ఒక వజ్రాల కంకణం / గాజు గాని జారి పడిపోతే, దాన్ని ఆమె స్వంతం చేసుకోవచ్చునని.

అతని జీవితం చరమాంకంలో అతని ఆఫీసుని మరొకచోటుకి తరలిస్తున్నప్పుడు టోల్కియెన్ రాసిన ఒక కవిత పుస్తకంలోంచి జారిపడింది. ఎనిమిదిపాదాలతో మూడు పద్యాలున్న ఆ చిన్న కవిత ఆమె చదివి ఎంతో ఇష్టపడింది. అందుకని దాన్ని టోల్కియెన్ ఆమెకి వాగ్దానం చేసినట్టుగానే బహూకరించాడు. అదే ఆమె వజ్రాల కడియం క్రింద లెఖ్ఖ. 

1973లో టోల్కియెన్ చనిపోయిన తర్వాత, ఆ కవితని ఆమె డొనాల్డ్ స్వాన్ అన్న సంగీత దర్శకుడికి సంగీతం సమకూర్చిపెట్టడానికి ఇచ్చింది. అంతకుముందు 1967లో టోల్కియెన్ తో కలిసి The Road Ever Goes On అన్న కవితల ఆల్బం కి డొనాల్డ్ పనిచేశాడు. అతనుకూడా దాన్ని చదివి, మనసుకి హత్తుకోగా దాన్నికి వెంటనే స్వరరచన చేసి 1978లో రెండవసారి The Road Ever Goes On విడుదలచేసినపుడు ఆ కవితని అందులో ఉంచాడు. ఈ కవిత టోల్కియెన్ కి ఇష్టమైన చిత్రకారుడు పాలీన్ బేయ్ న్స్ దానికి బొమ్మలుకూర్చి 1974లో ప్రచురించడమే కాక, BBC ప్రసారం చేసిన Lord of the Rings రేడియో కార్యక్రమంలో పొందుపరచబడింది.

ఆ కవితే ఈ కవిత.

అందుకే ఈ కవిత లార్డ్ ఆఫ్ ది రింగ్స్  ట్రయాలజీ లో ఆఖరుది  Return of the King లో కనిపించకుండా, చిట్టచివరన 9వ అధ్యాయంలో The Grey Heavens లో కనిపిస్తుందిట.

.

J. R. R. Tolkien, 1916
J. R. R. Tolkien, 1916 (Photo credit: Wikipedia)

.

Bilbo’s Last Song
.

Day is ended, dim my eyes,
but journey long before me lies.
Farewell, friends! I hear the call.
The ship’s beside the stony wall.
Foam is white and waves are grey;
beyond the sunset leads my way.
Foam is salt, the wind is free;
I hear the rising of the Sea.

Farewell, friends! The sails are set,
the wind is east, the moorings fret.
Shadows long before me lie,
beneath the ever-bending sky,
but islands lie behind the Sun
that I shall raise ere all is done;
lands there are to west of West,
where night is quiet and sleep is rest.

Guided by the Lonely Star,
beyond the utmost harbour-bar,
I’ll find the heavens fair and free,
and beaches of the Starlit Sea.
Ship, my ship! I seek the West,
and fields and mountains ever blest.
Farewell to Middle-earth at last.
I see the Star above my mast!

.

(From : Lord of the Rings )

J R R Tolkien

3 January 1892 – 2 September 1973

English Novelist

Poem and the other info courtesy:

http://wonderingminstrels.blogspot.in/2002/11/bilbo-last-song-j-r-r-tolkien.html