మా అమ్మని తేలు కుట్టిన ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది.
పది గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం
తేలుని బియ్యపుబస్తా క్రిందకి వెళ్ళేలా చేసింది.
చీకటిగదిలో ఒక్కసారి తోక జాడించి,
తోకకున్న విషం ఎక్కించి
మళ్ళీ వర్షంలోకి పారిపోయింది.
రైతులందరూ ఈగల్లా మూగిపోయేరు
వందసార్లు భగవన్నామ జపం చేసేరు
ఆ తేలు ఎక్కడుంటే అక్కడ ఆగిపోడానికి.
కొవ్వొత్తులూ, లాంతర్లూ
మన్ను మెత్తిన గోడలమీద
పేద్ద తేలులాంటి నీడలు కదులుతుండగా
దానికోసం వెతికేరు గాని, లాభం లేకపోయింది.
“ళబళబళబళబ” అంటూ నాలికతో చప్పుడుచేసేరు
దాన్ని భయపెట్టడానికి.
దాని ప్రతికదలికకీ, అమ్మరక్తంలో
విషం మీదకి ఎక్కుతుందని చెప్పేరు.
తేలు కదలకుండా చూడాలని అన్నారు.
అమ్మతో మీరు పూర్వజన్మలో చేసిన పాపాలు
ఈ రాత్రి దహించుకుపోవాలన్నారు.
ఇప్పుడు అనుభవించిన బాధ మళ్ళీ జన్మలో
ఆమె అనుభవించబోయే కష్టాల్ని తగ్గించాలన్నారు.
ఇక్కడ చేసిన పాపాలు, పుణ్యాలలో
కొట్టుకుపోతాయిగనక ఆమె అనుభవించిన బాధకి
కొంత పాపం కొట్టుకుపోతుందన్నారు.
విషం ఆమె రక్తాన్ని శుభ్రపరచాలనీ
ఆమె కోరికలూ, ఆశలూ ఆణిగిపోవాలనీ చెప్పి
అమ్మని మధ్యలో కూచోబెట్టి
అందరూ చుట్టూ కూచున్నారు.
అందరిముఖాల్లోనూ ఆమె బాధపట్ల సానుభూతి.
మరిన్ని కొవ్వొత్తులూ, మరిన్ని లాంతర్లూ,
మరింతమంది చుట్టుపక్కలవాళ్ళూ,
మరిన్ని పురుగులూ, ఆగకుండా మరింత వాన.
మా అమ్మ నొప్పితో కింకలు చుట్టుకుపోతూ
పాపం చాపమీద అటూ ఇటూ దొర్లుతోంది.
హేతువాదీ, ఏదీ ఓ పట్టాన నమ్మని మా నాన్న
చూర్ణం, మిశ్రమం, వేరు, పసరు, ఒకటేమిటి
ప్రయత్నించని మందు లేదు…
చివరకి, కుట్టిన వేలిమీద కొంచెం పేరఫిన్ వేసి
అగ్గిపుల్ల వెలిగించేడు కూడా.
ఆ మంటకి మా అమ్మ చర్మం బొబ్బలెక్కడం చూసేను
విషబాధ నివారణకి మంత్రగాడు వచ్చి
ఏవో పూజలుచేసి మంత్రాలు చదవడం చూసేను.
అలా ఇరవై గంటలు గడిచిన తర్వాత
ఎలాగయితేనేం విషం ప్రభావం తగ్గింది.
మా అమ్మ తర్వాత ఒక్కటే మాట అంది:
భగవంతుడు చల్లగా చూడబట్టి
ఆ తేలేదో నన్ను కుట్టింది
నా పిల్లల్ని కుట్టకుండా.
.
(ఈ కవితలోని సౌందర్యమంతా ఆఖరి మాటలోనే ఉంది. అటువంటి తల్లులు ఎక్కడ చూసినా కనపడతారు. ఆ చివరి మాటలతో పద్యాన్ని ఎన్నోవేలమైళ్ల ఎత్తుకు తీసికెళ్ళిన కవి, దానికి ముందు మన మనసును ఎంతచక్కగా విషయంలోనే మగ్నంచేసి ఉంచుతూ ముగింపు ఏమిటయి ఉంటుద్దబ్బా అన్న ఆలోచనరానీకుండా కవిత నిర్వహించేడు. అందులోనే కవి రచనా చమత్కారం, ప్రతిభా దాగున్నాయి. గమనించండి.)
నిస్సిం ఎజకీల్ స్వాతంత్రానంతర భారతీయ ఆంగ్లసాహిత్యంలో పేర్కొనదగ్గ ముందుతరం కవులలో ఒకరు. ఆయన కవీ, నాటక రచయితా, సంపాదకుడూ, కళావిమర్శకుడూ. Later-day Poems అన్న కవితా సంకలనానికి 1983లో ఆయనకి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. అదిగాక ఇంకా అతను చాలా కవితా సంకలనాలు వెలయించారు.
Nissim Ezekiel (Photo credit: Wikipedia)
నిస్సిం ఎజకీల్
(16 December 1924 – 9 January 2004)
.
English Original: Night of the Scorpion
.
I remember the night my mother Was-stung by a scorpion. Ten hours of steady rain had driven him to crawl beneath a sack of rice. Parting with his poison— flash of diabolic tail in the dark room— he risked the rain again. The peasants came like swarm of flies and buzzed the name of God a hundred times to paralyze the Evil One. With candles and with lanterns throwing giant scorpion shadows on the mud-baked walls they searched for him: he was not found. They clicked their tongues. With every movement that the scorpion made his poison moved in mother’s blood, they said. May he sit still, they said. May the sins of your previous birth be burned away tonight, they said. May your suffering decrease the misfortune of your next birth, they said. May the sum of evil balanced in this unreal world against the sum of the good become diminished by your pain, they said May the poison purify your flesh of desire, and your spirit of ambition, they said, and they sat around on the floor with my mother in the centre, the peace of understanding on each face. More candles, more lanterns, more neighbours, more insects, and the endless rain. My mother twisted through and through groaning on a mat. My father, sceptic, rationalist, trying every curse and blessing, powder, mixture, herb and hybrid. He even poured a little paraffin upon the bitten toe and put a match to it. I watched the flame feeding on my mother. I watched the holy man perform his rites to tame the poison with an incantation. After twenty hours it lost its sting.
My mother only said, Thank God the scorpion picked on me and spared my children. . Nissim Ezekiel,
(16 December 1924 – 9 January 2004)
Indian Jewish Poet, Playwright, Editor and art-critic. One of the leading writers of Indo-anglian Literature in post-independence era. For his collection of Poems “Latter-day Psalms” he received Central Sahitya Akademi award in 1983. The Bad Day (1952), Ten Poems, The Deadly man (1962), The Exact Name (1965) are some of his other collections of poetry. He also published “Three Plays” in 1969.
శర్మగారూ,
అమ్మ మీద కవిత్వం అంటే ఇది ఒక మచ్చుతునకగా చూపించ దగ్గ కవిత. ఆమె పాత్రని రొమాంటిసైజ్ చేస్తూ చాలా మంది రాస్తారు. కాని తల్లి నిజమైన మనోభావాలనీ, ఆమె అపురూపమైన మాతృత్వవాత్సల్యాన్ని చక్కగా ఆవిష్కరించింది ఈ కవిత. అందుకే “నిస్సిం ఎజకీల్” పేరు చెప్పగానే గుర్తొచ్చే కవిత. “మాతృదేవో భవ” అన్నది మన సంస్కారపరంపరలో జీర్ణించుకుపోయింది కూడా అందుకే.
అభివాదములతో
ముర్తి గారూ!నమస్తే.ఇదే కవితను నేను ఎక్కడో ఒక చిన్న కథ రూపంలో చదివాను.దాని మూలం Nissim Ezekiel కవిత అని ఇప్పుడు తెలిసింది సార్!నిజమే… మీరు అన్నట్లు ఈ కవిత తల్లిని గురించినది అయితే చివరి ఆ రెండు పంక్తులు కొసమెరుగు పెడతాయి.నాకు మరో రూపం కూడా కనిపించిందండీ!కవిత నిండా తొటి వారి సాహానుభూతి..తమకు తెలిసిన జ్ఞానంతో సాయపడాలన్న తపన.(అది వేదాంత ధోరణే అయినా వారికి తెలిసిన జ్ఞానం అదే గదా!..తప్పు పట్టవలసినది ఏమీ లేదు.కాని హేతువాది ఐన ఆమె భర్త నిశ్శబ్దంగా చేసిన చికిత్స నన్ను బాగా ఆకట్టుకుంది.మంచి కవిత ను అందించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు .సార్! సాహసించి ఒక చిన్న సూచన ఛేస్తున్నాను.ఈ కవితను ..ఇలాంటి మరి కొన్ని కవితలను.మీరు మిసిమి-చింతనాత్మక పత్రికకు ఎందుకు పంపించ కూడదూ! నా బోటి ఎందరో చూసే అవకాశం కలిగించవచ్చు కదా!
హనుమంత రావు గారూ,
మీ ప్రేమపూర్వకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు. నిజానికి ఈ బ్లాగు కేవలం కాలక్షేపం కోసం ప్రారంభించేను. అనుకోకుండా చాలామంది ఆదరించేరు, ఆదరిస్తున్నారు. నా బ్లాగు కమర్షియల్ కాదు కాబట్టి మూల రచయితలకి ధన్యవాదాలో, క్షమాపణలో చెప్పుకుని ప్రచురించెస్తున్నాను. పత్రికలకి పంపాలంటే ఖచ్చితంగా మూల రచయితల అనుమతి పత్రం అవసరం. కొన్ని సందర్భాలలో ఈ కాపీ హక్కులు ఎవరిదగ్గర ఉన్నాయో కూడా తెలీదు. తెలుసుకోడం నాలాంటి అనామకుడికి తలకి మించిన భారం. ఎవరైనా కాపీరైటుదారు తొలగించమంటే, ఇక్కడైతే వెంటనే తొలగించగలను కూడా. అందుకని అటువంటి ఆలోచనకూడా లేదు. మీ అవ్యాజమైన అభిమానానికి మరొక్కసారి కృతజ్ఞతలు
అభివాదములతో
భాస్కర్ గారూ,
నిజమే. అయితే కె. శివారెడ్డి గారు అద్భుతమైన కవితరాసేరు అమ్మ మీదే. అది వీలయితే చదవండి. “అమ్మతనం నాకెలా తెలుస్తుంది? నేనెన్నడూ అమ్మను కాలేను కదా ” అని ప్రారంభమవుతుంది.
అభివాదములతో
Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి