
.
నువ్వు వస్తానని రాలేదు
కాలం నిర్లిప్తంగా పరిగెత్తుకుంటూ పోయింది.
నన్ను మొద్దుబారిపోయేలా చేస్తూ.
అయినా, నువ్వు నా ఎదురుగా లేకపోవడంకంటే కూడ
ఎక్కువగా బాధించింది… నీ వ్యక్తిత్వంలో
మన విముఖతని సైతం త్రోసిరాజనగల
ఉదాత్తమైన కనికరభావన కనిపించకపోవడం.
ఆశల చిట్టచివరి ఘడియ గడిచిపోయి,
నువ్వురాకపోయిన తర్వాత నేనొంతో దుఃఖించాను.
.
నువ్వు నన్ను ప్రేమించటం లేదు.
ప్రేమ ఒక్కటే మనిషిపై విశ్వాసాన్ని కలుగజేస్తుంది.
నాకు నువ్వు ప్రేమించడం లేదనీ తెలుసు
నువ్వు రావనీ తెలుసు.
కానీ, దైవకార్యాలన్న పేరుపెట్టి పిలవకపోయినా,
మనిషి చేసే తత్సమానమైన ఆనేక పనులఖజానాలోకి,
ఒక స్త్రీ, తను ప్రేమించకపోయినా,
కాలం చించిపోగులు పెట్టిన మగవాడికి
ఊరటకల్పించడానికి అతనితో ఒక గంటో, ఘడియో
గడపడాన్నికూడ చేర్చడం సబబుగా ఉండదూ?
.

Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి