1819లో ఇంగ్లండు స్వరూపం … షెల్లీ, ఇంగ్లీషు కవి

.
[ఈ కవిత చదువుతుంటే, ఇందులో పేర్కొన్న ప్రతి రాజ్యాంగ వ్యవస్థలోని భాగానికీ… సమాంతరంగా ఉన్న నేటి మన రాజకీయ వ్యవస్థ అచ్చం అలాగే పనిచేస్తున్నాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. బలహీనమైన కేంద్రాన్ని బెదిరించి గడుపుకుంటున్నాయి చిన్న పార్టీలు. బ్రిటనులోపార్లమెంటు క్రమేపీ ప్రవేశపెట్టిన “Enclosure” చట్టాలద్వారా గ్రామాలలోని రైతులు భూమి హక్కులు కోల్పోయి, ముందు పాలెగాళ్ళుగాను తర్వాత రైతుకూలీలుగానూ మారినట్టు, ఈ రోజు భూసేకరణపేరుతో పంటభూములని కార్పొరేటు సంస్థలకు, తమ తాబేదార్లకూ అప్పనంగా అప్పచెబుతున్న ప్రభుత్వాలు, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి, రైతులు “Crop Holiday”కి దిగే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఇక ప్రజా ప్రతినిధుల, చిన్నా చితకా అధికారులదగ్గరనుండి ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచే అధికారం ఉన్నవారిదాకా అవినీతి రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతోంది. సహ చట్టలవంటివి ఉన్నా వాటిని ఎలా నీరుగార్చాలో ప్రభుత్వాలకీ, నియమింపబడిన అధికారులకీ బాగా తెలుసు. న్యాయవ్యవస్థ కలుగజేసుకోగలిగిన సందర్భాలూ, పరిమితులూ స్వల్పం. మతం ప్రజల నైతిక ప్రవర్తనని ప్రభావితం చెయ్యలేక పోవడంతో, మతం, నైతిక వర్తనా దేనికదే, గాలికూడా చొరలేని ఇరుకు గదులైపోయాయి.
కవిత ముగించిన తీరులోనే, మనం కూడా చెయ్యగలిగింది … ఏ అద్భుతమో జరిగి, ఈ దేశంకోసం, స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన ఏ మహానుభావుడైనా పునర్జన్మించి ఈ అల్లకల్లోలవాతావరణంలో దేశానికి ఒక మార్గదర్శనం చేస్తాడని ఆశగా ఎదురుచూడడమే.]
.
రాజు …
అంధుడూ, వివేకశూన్యుడూ, ఉన్మత్తుడూ,
కాటికికాళ్ళుజాచుకుని అందరూ అసహ్యించుకునే ముదుసలి;
రాజ వంశీయులు …
పసలేని జాతి కుక్కమూతిపింజలు,
ప్రజలు చీదరించుకునే మందులు,
మురుగునీటి మీది మురుగు;
పాలకులు…
చూడరూ, తెలీదు, తెలుసుకోలేరు.
అప్పటికే నీరసించిపోయిన దేశపు రక్తాన్ని తాగితాగి
ఆ మైకంలో కళ్ళుమూసుకుపోయి పట్టురాలి పడిపోయేదాకా వేలాడే జలగలు;
ప్రజలు…
ఆకలితో అలమటించి, బీడుబారిన తమ పొలాల్లో హత్యచేయబడ్డవాళ్ళు
సైన్యం …
రెండంచులకత్తిలా ఒకపక్క స్వేచ్ఛని హత్యచేస్తూ, ఇంకొకపక్క దోచుకుంటుంది
చట్టం …
ఆశావహం, ఉత్తమం అయినప్పటికీ వక్రభాష్యాలకుగురై నిరుపయోగం
మతం …
క్రీస్తూ లేక, దేముడూ లేక పుస్తకంలో బందీ అయిపోయింది.
పార్లమెంటు…
కాలం రద్దుచెయ్యని ఒక చట్టం.
.
ఇక ఈ సమాధుల్లోంచి అద్భుతమైన ఏ ప్రేతాత్మో పునరుజ్జీవించి
ఈ కారుచీకటిలో వెలుగు చూపించుగాక!
.

@అనువాదమే బాగా నచ్చింది మూలం కంటే. ముందు మాట మరికొంచెం ఉత్సుకతను రేపింది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
శర్మగారూ,
ఇంతకు ముందెప్పుడో చెప్పినట్లు, చారిత్రక విషయాలు ఆధారంగా చేసుకుని రాసిన రచనలకి తత్కాల నేపథ్యం కొంత అవసరమని తోచింది. అది విషయాన్ని ఇంకా బాగా అవగాహన చేసుకుని ఆశ్వాదించడానికి ఉపకరిస్తుంది. రక్తం ఉరకలువేసే వయసులో సమకాలీన రాజకీయ పరిస్థితి బాగులేదనిపించిందంటే, షెల్లీ సరియైన దారిలో ఉన్నట్టే. బహుశా బెర్నార్డ్ షా అందుకే అన్నాడేమో: 20 ఏళ్ళకి నువ్వు కమ్యూనిస్టువి కాకపోతే నీకు హృదయం లేదు. 30 ఏళ్లకి నువ్వు కేపిటలిస్టువి కాకపోతే నీకు బుధ్ధిలేదు… అని.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
సుజాత గారు మీ బ్లాగు గురించి రాసిన పోస్ట్ చూసారాండీ? Here is the link..
http://sangharshana.blogspot.com/2012/02/blog-post.html
మెచ్చుకోండిమెచ్చుకోండి
Madhuravani garu,
Oh! Thank you so much.
with best regards
మెచ్చుకోండిమెచ్చుకోండి