హైడ్రోఫోబియా… చెఖోవ్

హైడ్రోఫోబియా… చెఖోవ్

దృఢంగాను, బలంగాను ఉండే మహాకాయుడు నిలోవ్ బలపరాక్రమాలకి ఆ వ్యవసాయక్షేత్రం అంతటా పెట్టింది పేరు. ఒకసారి ఎగ్జామినింగ్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న కుప్రియానోవ్, నిలోవ్, వేటకి వెళ్ళి తిరిగివస్తూ, వృద్ధుడు మాక్జిమ్ మిల్లులోకి అడుగుపెట్టేరు. నిజానికి నిలోవ్ మొఖాసా అక్కడికి అట్టే దూరం లేదు. కానీ, ఇద్దరూ ఎంతగా అలసిపోయేరంటే, ఇక ఒక్క అడుగుకూడా ముందుకి వెయ్యడానికి వాళ్ళకి మనసొప్పలేదు. ఆ మిల్లు దగ్గరే చాలాసేపు బడలిక తీర్చుకుందామనుకున్నారు. అది మంచి నిర్ణయమే. ఎందుకంటే, మాగ్జిమ్ మిల్లులో టీ, పంచదార పుష్కలంగా దొరుకుతాయి. వేటగాళ్ళిద్దరి దగ్గరా వోడ్కా, కోన్యాక్, ఇతర తినుబండారాలూ సమృద్ధిగా ఉన్నాయి.

ఆకలీ దప్పికా తీర్చుకున్నాక అందరూ కబుర్లలో పడ్డారు.

“అయితే తాతా, ఏమిటి సంగతులు?” అని మాక్జిమ్‌ని అడిగేడు నిలోవ్.

“సంగతులా?” అంటూ పళ్ళు ఇకిలిస్తూ నవ్వేడు మాక్జిమ్. “అసలు సంగతి ఏమిటంటే, నేను దొరగార్ని తమ తుపాకీని నాకు ఎరువు ఇవ్వమని అడుగుదామనుకుంటున్నాను” అన్నాడు.

“నీకెందుకూ తుపాకీ?”

“తుపాకీ నాకెందుకా? హుఁ! నిజమే! బహుశా నాకు దాని అవసరం పడకపోవచ్చు. ఏదో గొప్పలకి పోయాను గానీ, నిజం చెప్పాల్సి వస్తే, గురిచూసి కొట్టాలంటే నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు. ఈ మధ్య ఒక పిచ్చి తోడేలు ఎక్కడనుండి వచ్చిందో దేముడి కెరుక, వచ్చింది. రెండు రోజులుగా ఈ చుట్టుపక్కలే తిరుగుతోంది. గ్రామంలో ఒక గుర్రప్పిల్లని, రెండు కుక్కల్నీ చంపింది. ఇవాళ తెల్లవారుజామున, బయట కూర్చుందామని వెళ్ళి చూద్దునుకదా, దాని సిగ దరగ! అది ఎదురుగా చెట్టు కింద కూచుని పంజాతో మూతి గోక్కుంటోంది. ఆకాడికీ గట్టిగా ఫో! అంటూ అరిచేను. దయ్యం ఆవహించినట్టు అది నావైపే అలా చూస్తూ కూర్చుంది. ఓ చిన్న రాయి తీసి దానిమీదకి విసిరేను. ఒకసారి గుర్రుమని, కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తుంటే పక్కనే ఉన్న ఆస్పెన్ చెట్లలోకి పరిగెత్తింది. క్షణంపాటు నేను కొయ్యబారిపోయేను.”

“ఏమిటిదంతా?” మేజిస్ట్రేటు చికాకుగా గొణిగేడు. “ఓ పిచ్చి తోడేలు జిల్లాలో బలదూర్‌గా తిరగడమేమిటి, మనం నిమ్మకి నీరెత్తినట్టు నింపాదిగా కబుర్లు చెప్పుకోవడమేమిటి?”

“అయితే ఏమిటిట?” అన్నాడు నిలోవ్. “మనదగ్గర తుపాకులున్నాయి.”

“తోడేలును చంపడానికి నాటు తుపాకులు పనికిరావు.”

“దాన్ని గురిచూసి కొట్టడమెందుకూ? తుపాకీ మడమ చాలదూ దాని నడ్డి విరగ్గొట్టడానికి?”

అని చెప్పి నిలోవ్ తుపాకీ మడమతో తోడేలుని చంపడానికి మించిన సులభమైన పని మరొకటి లేనట్టు చాలా వివరంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, అంతకు ముందు ఒకసారి ఒక బలిష్ఠమైన పిచ్చికుక్క అకస్మాత్తుగా తనమీద ఎలా దాడి చేసిందో, దాన్ని తన చేతి కర్రతో ఎలా అవలీలగా ఎదుర్కొని హతమార్చాడో చెప్పుకొచ్చాడు.

నిలోవ్ విశాలమైన వక్షస్థలాన్ని, బలిష్ఠమైన బాహువుల్నీ చూసి, నిట్టూరుస్తూ మేజిస్ట్రేటు ఇలా అన్నాడు: “అలా అనడం నీకు కాబట్టి చెల్లింది. దేముడు నిన్ను అనుగ్రహించి పదిమందికుండే శక్తి నీ ఒక్కడికే ఇచ్చేడు. ఆ మాటకొస్తే, నువ్వు ఆ కుక్కని చంపడానికి నీ చిటికినవేలు చాలు. కర్రకూడా దండగ. కానీ మాలాంటి మమూలు మనిషి కర్ర ఎత్తి ఎక్కడకొట్టాలో గురి చూసేలోపు, మమ్మల్ని అది నాలుగైదుసార్లు కరిచేస్తుంది. ఆ తర్వాత చచ్చే చావు. హైడ్రోఫోబియాని మించిన భయంకరమైన నరకయాతన మరొకటి ఉండదు. మొదటిసారి ఆ వ్యాధికి గురయినవాడిని చూసినప్పుడు మనసు మనసులో లేక, పిచ్చెత్తినవాడిలా అటూ ఇటూ తిరిగేను. కుక్కలన్నా, కుక్కల్ని పెంచుకునేవాళ్ళన్నా చెప్పలేనంత అసహ్యం వేసింది. అన్నిటికన్నా భయంకరమైనది ఆ రోగం అకస్మాత్తుగా ముంచుకు రావడం. అప్పటి వరకు ఆరోగ్యంగా, తుళ్ళుతూ కేరుతూ, ఏమీ ఎరగని మనిషిని, ధన్‌మని ఆకాశం నుండి ఎక్కడినుండో ఊడిపడినట్టు వచ్చి ఒక పిచ్చికుక్క కరిచేస్తుంది. జీవితం మీద అన్ని ఆశలూ అడుగంటిపోయి, ‘ఇక తన పని అయిపోయిం’దన్న మానసిక వ్యధ అతన్నొక్కసారి కమ్ముకుంటుంది. ఇక చూడాలి, వ్యాధి ఎప్పుడు సంక్రమిస్తుందో అన్న భయంతో ఎదురుచూసే ఆ బాధ వర్ణనాతీతం. ఆ భయం ఆ వ్యక్తిని అనుక్షణం వెన్నాడుతూనే ఉంటుంది. అన్నిటికంటే బాధాకరమైనది హైడ్రోఫోబియాకి చికిత్స లేకపోవడం. ఒకసారి ఆ వ్యాధి తగిలిందంటే, ఇక ఆ మనిషి జీవితం ముగిసిపోయినట్టే. నాకు తెలిసినంతవరకు, ఏ వైద్యంలోనూ దానికి మందు లేదు.”

“కాని దొరా, మా వూళ్ళో దాన్ని నయం చేస్తారు” అన్నాడు మాక్జిమ్.

“అర్థంలేని మాట!” పెద్దగా నిట్టూర్చేడు నిలోవ్. “మైరాన్ గురించి చెప్పుకునేదంతా ఉత్త పుకారు. క్రిందటి వేసవిలో స్త్యోప్కాని కుక్క కరిస్తే ఏమయింది? ఏ మైరానూ రక్షించలేదే! అతని చేత అదీ ఇదీ అనకుండా అన్నీ తాగించేరు. అయినా సరే అతను వ్యాధిన పడక తప్పలేదు. లేదు, తాతా, దానికి సరియైన మందు లేదు. నన్నేగనక పిచ్చికుక్క కరిస్తే, ఆత్మహత్య చేసుకుంటాను.”

హైడ్రోఫోబియా గురించి చెప్పుకున్న ఈ భయంకరమైన కథల ప్రభావం వాళ్ళ మనసులమీద పడింది. క్రమంగా అందరూ మౌనంలోకి జారుకున్నారు. వేటగాళ్ళిద్దరూ ఏ మాటామంతీ లేకుండా నిశ్శబ్దంగా టీ చప్పరించారు. ఏదో సామెత చెప్పినట్టు, ‘పైకి గడ్డిపరకంత విలువ చెయ్యక, పట్టించుకోనక్కరలేనివిగా కనిపించి, అకస్మాత్తుగా జరిగే చిన్న చిన్న సంఘటనల మీద, ప్రమాదాల మీదా మనిషి జీవితం, సుఖసంతోషాలూ ఎంతగా ఆధారపడి ఉన్నాయో’ అని అసంకల్పితంగా అందరూ ఆలోచించసాగేరు. మనసులు మొద్దుబారి, నిస్సత్తువ అందరినీ ఆవహించింది.

టీ తాగడం పూర్తయిన తర్వాత, నిలోవ్ ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుని, ఒక్కసారిగా నిలబడ్డాడు. అతనికి ఊపిరి ఆడుతున్నట్టు లేదు. బయట చల్లగాలిలోకి వెళ్ళాలనిపించింది. తలుపులు తీసి బయటకు వచ్చాడు. గోధుమ నిలవ ఉంచే గాదెలు దాటి, ప్రహరీ తలుపు తెరుచుకుని ఆనకట్టవైపు నడిచాడు.

అప్పటికి సూర్యాస్తమయం అయి చాలాసేపు అయింది. చీకటి చిక్కగా కమ్ముకుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నది అలలమీంచి మీంచి కమ్మని ప్రశాంతత, నిండైన నిద్రా తేలివస్తున్నాయేమో అన్నట్టు ఉంది. ఆనకట్ట వెన్నెల స్నానం చేస్తోంది. ఎక్కడా నీడ అన్న ఊసు లేదు. అలల మధ్య ఎక్కడో విరిగిన గాజుసీసా కొన తారకలా మెరుస్తోంది. మాక్జిమ్ గాలిమర రెండు చక్రాలూ దట్టమైన తోట నీడల్లో సగం కనుమరుగై, కోపంగాను, విచారంగానూ కనిపిస్తున్నాయి.

నిలోవ్ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, నది మీదకి దృష్టి సారించాడు. ఎక్కడా అలల కదలిక లేదు. నీరూ, ఒడ్డూ జంటగా నిద్రపోతున్నట్టున్నాయి. చివరకి చేప పిల్లల అలికిడికూడా లేదు. అకస్మాత్తుగా నల్లని బంతిలా ఏదో నీడ అవతలిగట్టు మీద దొర్లినట్టు అనిపించింది నిలోవ్‌కి. కళ్ళు చికిలించి చూశాడు. నీడ మాయమయింది. కానీ అంతలోనే మరోసారి కనిపించింది. ఈసారి ఆనకట్టమీద అటూ ఇటూ వంకరటింకరగా నడుస్తూ.

“తోడేలు!” ఒక్కసారిగా నిలోవ్ మనసులో ఒక ఆలోచన మెరిసింది.

వెనక్కి మిల్లులోకి వెళ్ళిపోదామన్న ఆలోచన ఇంకా తట్టనే లేదు, ఆనకట్ట మీదనుండి నల్లని బంతిలాంటిది దొర్లుకుంటూ వచ్చేస్తోంది. అతనివైపు తిన్నగా రాకున్నా, అటూ ఇటూ దొర్లుకుంటూ ఇటువైపే వస్తోంది.

‘ఇప్పుడు గాని పరిగెత్తేనా, నిశ్చయంగా అది వెనకనుండి నామీదకి దూకుతుంది’ అనుకున్నాడు నిలోవ్. నెత్తిమీద అప్పుడే చెమటలు పట్టసాగేయి. ‘హారి దేముడా! చేతిలో కర్రయినా లేదే! సరే! ఏదైతే అవనీ. దానికి ఎదురుగా నిలబడే పోరాడతాను. దానికి ఊపిరాడకుండా చేస్తాను!’ అని నిశ్చయించుకున్నాడు.

నిలోవ్ దాని అడుగులు జాగ్రత్తగా గమనిస్తూ, దాని ఆకారాన్ని అంచనా వెయ్యసాగేడు. తోడేలు నది ఒడ్డునుండి పరిగెత్తడం ప్రారంభించింది. అది అంతలోనే నిలోవ్ దరిదాపుకి వచ్చేసింది. ‘బహుశా అది నన్ను దాటి ముందుకి పోతుంది,’ అని ఊహించాడు నిలోవ్, దృష్టి దానిమీంచి మరల్చకుండా.

సరిగ్గా అదే సమయంలో, ఆ తోడేళు మనిషిని ఏమాత్రం గమనించకుండా, బొంగురు గొంతుతో బిగ్గరగా, బాధాకరంగా అరిచింది. దాని మూతి మనిషివైపు జాచి ఒక్క క్షణం ఆగింది. దాడి చెయ్యడమా? మానడమా? అన్న మీమాంసలో పడ్డట్టుంది.

‘దాని నెత్తి మీద ఒక గుద్దు గుద్దుదునా, దిమ్మ తిరిగిపోయేట్టు…’ అని మనసులో అనుకున్నాడు నిలోవ్.

అంతే!

నిలోవ్ ఎంత విభ్రాంతికి లోనయ్యేడంటే, దాడి తను ముందు ప్రారంభించేడో, తోడేలు ముందు ప్రారంభించిందో తెలియలేదు. అతనికి గుర్తున్నదల్లా – అతి కీలకమైన, అతి భయంకరమైన ఆ క్షణంలో, చిత్రంగా, తన శక్తినంతటినీ కుడిచేతిలో కేంద్రీకరించాలన్న స్పృహ రావడమూ, దాని మెడని తన చేతిలోకి బలంగా ఇరికించుకోవడమూ. ఆ తర్వాత, ఏదో కలలో జరుగుతున్నట్టు, ఒక ఆశ్చర్యకరమూ, నమ్మశక్యం కాని విషయం జరిగింది. తోడేలు కుయ్యోమని అరుస్తూనే దాని మెడని అతని చేతుల్లోంచి ఎంత బలంగా విదిలించుకో గలిగిందంటే, దాని చల్లని తడిచర్మం నిలోవ్ పట్టులోంచి క్రమంగా జారిపోవొచ్చింది. దాని తలను విదిలించుకుందికి తోడేలు దాని రెండు వెనక కాళ్ళనీ గట్టిగా బిగబట్టింది. వెంటనే నిలోవ్ తన ఎడం చేతితో, జంతువు ముందరి కుడికాలూ-శరీరమూ కలిసే చోటుని దొరకబుచ్చుకుని, దాని మెడ విడిచిపెట్టి, దాని ముందరి ఎడంకాలిని తన కుడిచేత్తో అందుకుని, తోడేలుని అమాంతం నేలమీంచి పైకి లేవనెత్తాడు. ఇదంతా లిప్తపాటులో జరిగిపోయింది. తోడేలు తన చేతుల్ని కరవకుండా, అది దాని తల తిప్పలేకుండా ఉండటానికి వీలుగా, తన రెండు బొటనవేళ్ళనీ దాని మెడకి రెండువైపులా ముళ్ళలా దిగ్గొట్టేడు. తోడేలు తన రెండు పాదాల్నీ నిలోవ్ భుజాలకి తన్నిపెట్టి, వాటి దన్నుతో, శక్తినంతటినీ ఉపయోగించి విదుల్చుకుందికి ప్రయత్నించింది. అది నిలోవ్ చేతుల్ని గాని, మోచేతుల్ని గాని కరవగలిగే స్థితిలో లేదు. గొంతులో దిగబడిన రెండు బొటనవేళ్ళూ ఒత్తిడితో దాన్ని పట్టి ఉంచి, దాని కోరలతో మనిషి ముఖాన్నీ, భుజాల్నీ చేరలేకుండా విపరీతంగా బాధిస్తున్నాయి.

‘లాభం లేదు,’ అనుకున్నాడు నిలోవ్ దాని మూతి నుండి తన తలని సాధ్యమైనంత దూరం తప్పిస్తూ. ‘ఛీ! దాని చొల్లు నా పెదాలకి అంటుకుంది. నా పని అయిపోయింది. అద్భుతం ఏదో జరిగి దీన్నుండి తప్పించుకున్నప్పటికీ,’ అనుకున్నాడు హైడ్రోఫోబియా గుర్తుకు వచ్చి.

“మాక్జిమ్! సాయం! సాయం!” అని కేక వేసేడు ఒక్కసారి.

తలలు రెండూ ఒకే ఎత్తులో ఉన్న నిలోవ్, తోడేలూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. తోడేలు కోరలు ‘ఠప్’ మని ఒకదానికొకటి కొట్టుకుని, బాధతో అది గుర్ గుర్‌మని అరిచింది. దాని వెనుక కాళ్ళు ఆధారం కోసం వెతుక్కుంటూ, నిలోవ్ ముణుకుల్ని అందుకున్నాయి. మృగం కళ్ళలోంచి చంద్రుడు మిలమిలా మెరుస్తున్నాడు; అందులో కోపం ఎక్కడా తొంగి చూడటంలేదు. అవి కన్నీళ్ళతో నిండి జాలిగా దయనీయంగా కనిపిస్తున్నాయి.

[పాపం! ఆ అశక్తమైన జంతువు ఏమని అనుకుంటూ ఉండి ఉంటుంది? నిలోవ్ శక్తి అంతా అతని చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. అతను వేరేమీ ఆలోచించడం లేదు. అతని బలం సరిపోవడం లేదనిపిస్తోంది. అతని ప్రయత్నం అంతా తనపట్టు సడలిపోకుండా నిలదొక్కుకుందికే. ఆ కొద్దిసేపూ సాటి జీవి పడే ఆవేదనలేవీ కళ్ళకి కనిపించడం లేదు. వర్తమానం ఎంత గంభీరంగా ఉందంటే, గతం గురించిగాని, భవిష్యత్తు గురించిగాని ఆలోచించగలిగే స్థితిలో అతనిప్పుడు లేడు.]

“మాక్జిమ్! సాయం!” అని నిలోవ్ మరొకసారి అరిచేడు.

మిల్లులో ఉన్నవాళ్ళకి అతని మాటలు వినిపించలేదు. అరవడంవల్ల తన శక్తి క్షీణిస్తుందని నిలోవ్‌కి తట్టింది. సాయంకోసం అరవడం మానుకున్నాడు. ‘నేను వెనక్కి అడుగులు వేస్తాను. గేటు దగ్గరికి చేరగానే మరొకసారి కేకవేసి చూస్తాను,’ అని మనసులో అనుకున్నాడు.

అతను వెనక్కి అడుగులు వెయ్యడం ప్రారంభించేడు. ఎక్కువ దూరం వెళ్ళనే లేదు. తన కుడిచేతి పట్టు సడలిపోతున్నట్టు తోచింది. అది ఉబ్బిపోతున్నట్టు కూడా అనిపించింది. అంతలోనే తనకు తెలియకుండానే, హృదయవిదారకమైన తన అరుపు తనకే వినిపించింది. కుడిభుజంలో ఏదో పదునుగా దిగబడిన బాధ, చేతులమీదా గుండెలమీదా ఏదో వెచ్చని తడీ తగిలాయి. అతనికి మాక్జిమ్ గొంతు వినిపించడమూ, మాజిస్ట్రేటు ముఖంలో భీతీ మాత్రమే లీలగా గుర్తున్నాయి.

క్రూరమృగం చచ్చిపోయిందని ఇద్దరూ హామీ ఇచ్చి తన రెండు వేళ్ళనీ వాళ్ళు బలవంతంగా వేరుచెయ్యడానికి ప్రయత్నించిన తర్వాతే అతను పట్టు సడలించాడు. అప్పటి వరకు సహించిన పరిస్థితి తలుచుకుని, తొడలమీదా, కుడి కాలి బూటుమీదా కారిన రక్తాన్ని చూసుకుని, దాదాపు స్పృహ కోల్పోతున్న స్థితిలో అతను మిల్లులో ప్రవేశించాడు.

వేడినీళ్ళు కాచుకునే పాత్రా, దాని వెలుగూ, పక్కనున్న సీసాలూ మళ్ళీ అతన్ని మామూలు మనిషిని చేసి, అతను అనుభవించిన భీతావహసంఘటనను మరొక్కసారి గుర్తుచేశాయి. మనిషి పాలిపోయి, గుడ్లు బయటకి వచ్చి, తల తడిసిపోయి, అతను బస్తాలమీద అలా వాలిపోయాడు. చేతులు నిస్సత్తువుగా వేలాడేసేడు. మాజిస్ట్రేటు, మాక్జిమ్ అతని బట్టలు తొలగించి, గాయాన్ని శుభ్రం చెయ్యడంలో నిమగ్నమయ్యారు.

గాయం చాలా లోతుగా ఉంది. తోడేలు భుజం మీది చర్మాన్నేగాక, లోపలి కండల్ని కూడా పెకలించింది.

“దాన్ని నువ్వెందుకు నదిలోకి విసిరెయ్యలేదు?” అని అడిగాడు మాజిస్ట్రేటు.

గాయం తీవ్రతకి ఆశ్చర్యంతో పాటు, రక్తస్రావం ఇంకా ఆగనందుకు అతనికి చిరాకుగా కూడా ఉంది.

“దాన్ని నువ్వెందుకు నదిలోకి విసిరెయ్యలేదు?” మాజిస్ట్రేటు మళ్ళీ అడిగేడు.

“భగవంతుడా! నాకు నిజంగా బుద్ధిలేదు. ఆ విషయం తట్టనే లేదు!”

మాజిస్ట్రేటు నిలోవ్‌ని ఓదార్చి, భయపడవలసినది ఏమీ లేదని ఊరడించడానికి ప్రయత్నించేడు. కానీ, అంతకు ముందే హైడ్రోఫోబియా గురించి, దాని భయంకర పరిణామాల గురించీ అందరూ చర్చించుకుని ఉండడం వల్ల, ‘ఆ విషయం ఎత్తకుండా ఉండడమే ఉత్తమం’ అని నిశ్చయించుకున్నాడు. గాయానికి ఎలాగోలా కట్టుగట్టి, అతన్ని ఇంటికి చేర్చడానికి గుర్రాల్ని తేవడానికి మాక్జిమ్‌ని పురమాయించేడు. కాని అంతవరకు నిలోవ్ ఆగలేక, నడుచుకుంటూనే ఇంటికి వెళ్ళిపోయాడు.

నిద్రలేమితో మనిషి కృశించిపోయి, పాలిపోయిన ముఖంతో, చిందరవందర జుత్తుతో, మరునాడు ఉదయాన్నే నిలోవ్ బండి కట్టించుకుని మాక్జిమ్ మిల్లుకి వచ్చేశాడు.

“తాతా! నన్ను మైరాన్ దగ్గరకి తీసుకు వెళ్ళు! త్వరగా! అదిగో, నా బండి సిద్ధంగా ఉంది. ఎక్కి కూచో!” అన్నాడు మాక్జిమ్ వంక చూస్తూ.

రాత్రంతా మాక్జిమ్‌కీ నిద్రలేకపోవడంతో, మనిషి నీరసంగా ఉన్నాడు. నాలుగైదుసార్లు అటూ ఇటూ పరికించి చూసి, కొంచెం బిడియపడుతూ ఇలా అన్నాడు. “దొరా! మీరు మైరాన్ దగ్గరకి పోనక్కరలేదు. మీరు మన్నిస్తే, ఆ వైద్యం నాకు కూడా తెలుసు,” అంటూ గుసగుసలాడుతున్నట్టు చెప్పేడు.

“ఇంకేం! మరీ మంచిది. ఆలస్యం ఎందుకు? త్వరగా మొదలుపెట్టు!” అన్నాడు నిలోవ్ అసహనంగా కాళ్ళు నేలకేసి తాడిస్తూ. ఆ వృద్ధుడు నిలోవ్‌ని తూరుపు ముఖంగా కూర్చోపెట్టి, ఏవో గొణిగి, ‘వసనాభి’ వాసన వేస్తున్న వేడి కషాయాన్ని త్రాగమని మగ్గు చేతికి అందించాడు.

“అయినా స్త్యోప్కా బ్రతక లేదు…” సణిగేడు నిలోవ్. “ఈ పల్లెటూరివాళ్ళకి నాటువైద్యం తెలుసని మాటవరసకి అంగీకరిద్దామనుకో! అలాంటప్పుడు స్త్యోప్కా ఎందుకు చచ్చిపోయాడు? ఏదేమైనా నన్ను మైరాన్ దగ్గరికే తీసుకుపో!” అన్నాడు మళ్ళీ.

ఆ తర్వాత నిలోవ్‌కి జరిగిందంతా చెప్పాలంటే నిజంగా అదో పెద్ద కథ అవుతుంది. ప్రాయశ్చిత్తం జరగని ప్రేతాత్మ గురించి చెబుతారే, అలా, అతను నిరాశతో, అలుపులేకుండా తిరగని చోటంటూ లేదు. ఎంత తాత్కాలిక ఉపశాంతినిచ్చినా, చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఒకసారి మైరాన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, అతని వైద్యం మీద ఉన్న ఆపాటి నమ్మకం కూడా హరించుకుపోయింది. అతను డాక్టర్ ఓవ్చినికోవ్‌ని చూడాటానికి ఆసుపత్రికి పరిగెత్తాడు. అతను బెలడోనా మాత్రలిచ్చి కంటినిండా నిద్రపొమ్మని సలహా ఇచ్చాడు. వెంటనే నీటుగా తయారై అంతబాధనీ లక్ష్యం చెయ్యకుండా, డాక్టర్ల సలహా తీసుకుందికి నిలోవ్ పట్నం పరిగెత్తాడు.

చాలా రోజులు గడిచాక, ఓ సాయంత్రం, తిరిగి ఓవ్చినికోవ్ ఆఫీసుకి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు.

చొక్కాచేతి అంచుతో, పాలిపోయి వడలిపోయిన ముఖం మీది చెమట తుడుచుకుంటూ, ఊపిరి తీసుకుందికి ఉక్కిరిబిక్కిరి అవుతూ, “డాక్టర్! డాక్టర్ గ్రిగరీ ఇవానిచ్! మీరు నన్ను ఇక ఏం చేస్తారో మీ యిష్టం. ఇలా తిరగడం ఇక నా వల్ల కాదు. అయితే మందైనా ఇవ్వండి లేదా విషమైనా ఇవ్వండి. అంతేగాని, నన్ను ఎటూగాకుండా విడిచిపెట్టవద్దు. దేముడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నాకు మతిస్థిమితం లేదు!” అన్నాడు.

“మీరు ముందు కళ్ళమొయ్యా నిద్రపోవాలి,” అన్నాడు ఓవ్చినికోవ్.

“ఆహ్! నిద్రపోవడం ఒకటి తక్కువయింది ఇప్పుడు నాకు! మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాను. నన్నేం చెయ్యమంటారు? మీరు నా వైద్యులు. మీరు నాకు సహకరించాలి. నేను నరకయాతన అనుభవిస్తున్నాను. హైడ్రోఫోబియా వస్తుందన్న భయం నన్ను ప్రతిక్షణం వెంటాడుతోంది. నాకు నిద్ర పట్టదు! అన్నం సహించదు! నా వ్యవహారాలు చూసుకోలేను! నా జేబులో ఎప్పుడూ తుపాకీ పెట్టుకుని తిరుగుతున్నాను. ఏ క్షణంలోనైనా దానితో ఆత్మహత్య చేసుకుందికి సిద్ధంగా ఉన్నాను. గ్రిగరీ ఇవానిచ్! దయచేసి నాకు సహకరించండి. నేనిప్పుడు ఏం చెయ్యాలి? నాకో ఆలోచన తడుతోంది: నిపుణుడిని ఎవరినైనా సంప్రదిస్తునా?”

“ఎందుకూ ఆలస్యం? తప్పకుండా సంప్రదించండి!”

“నా మాట వినిపించుకొండి! నాకు నయం చేసినవారికి యాభైవేల బహుమానం ప్రకటిస్తూ కరపత్రాలు ముద్రిస్తే ఎలావుంటుంది? మీ సలహా ఏమిటి? కానీ కరపత్రాలు అచ్చు వేసేలోగా, నాకు పదిసార్లు హైడ్రోఫోబియా రావచ్చు. నా సర్వస్వాన్ని మీకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నయం చెయ్యండి. మీకు యాభైవేలు ఇస్తాను! కానీ, ముందు ఏదో ఒకటి చెయ్యండి. ఇలా ఏమీ పట్టనట్టు నిర్లిప్తంగా కూర్చోడం చూస్తుంటే వెగటు పుడుతోంది. ఇవాళా రేపూ నాకు ఒక ఈగ కనిపించినా భరించలేకున్నానన్న సంగతి తలకి ఎక్కించుకోండి! నాతోపాటు నా కుటుంబం కూడా నరకయాతన అనుభవిస్తోంది!”

నిలోవ్ ఎక్కిళ్ళు వచ్చేలా ఏడవడం ప్రారంభించడంతో, అతని భుజాలు కూడా వణకడం ప్రారంభించాయి.

ఓవ్చినికోవ్ చెప్పడం ప్రారంభించేడు. “ఇటు చూడండి! నాకు మీ దుఃఖానికి కారణం బోధపడటంలేదు. అసలు మీరెందుకు ఏడుస్తున్నారు? వస్తుందో లేదో తెలియని ప్రమాదం గురించి అతిగా ఊహించుకోవడం ఎందుకు? మీకు ఆ రోగం రావడానికి ఉన్న అవకాశాలు అతి స్వల్పం. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం, ఒక పిచ్చికుక్క వందమందిని కరిస్తే, హైడ్రోఫోబియా వచ్చే అవకాశం ఉన్నది ముప్ఫై మందికి మాత్రమే. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆ తోడేలు మిమ్మల్ని బట్టమీంచి కరిచింది. కనుక విషం ఆ బట్టకే అంటుకుని ఉండాలి. పోనీ, ఆ విషం మీ గాయంలోకి వెళ్ళిందని అనుకున్నా, మీరు చాలా రక్తం పోగొట్టుకున్నారు గనుక, ఆ రక్తంతోపాటు అదీ బయటకి పోయి ఉండాలి. నాకు మీకు హైడ్రోఫోబియా వస్తుందేమోనన్న చింత ఏమాత్రం లేదు. కాని, మీరు చేస్తున్న అశ్రద్ధ చూస్తుంటే అది కరిచిన చోట పుండు పెద్దదై ఇంకే రోగమో వస్తుందన్న భయం మాత్రం కలుగుతోంది.”

“నిజంగా? నన్ను ఏదో ఊరడించడానికి అలా అంటున్నారా లేక నిజంగా అంటున్నారా?”

“ప్రమాణం చేసి చెబుతున్నా! నామాట నమ్మండి! ఇదిగో, చూడండి. మీ అంతట మీరే చదివి చూడండి. మీకే అర్థం అవుతుంది.” అని చెప్పి ఓవ్చినికోవ్ తన పుస్తకాల గూట్లోంచి ఒక పుస్తకాన్ని తీసి, హైడ్రోఫోబియా గురించి వ్రాసిన కొన్ని భయంకర విషయాలున్న పేజీలు తప్పించి, నిలోవ్‌కి కొన్ని పేరాలు వినిపించేడు.

“మీరు నిష్కారణంగా బాధపడుతున్నారు” అన్నాడు చదవడం పూర్తిచేసి. “దానికి, నిజంగా ఆ తోడేలు పిచ్చిదా కాదా అన్న విషయం మీకుగాని, నాకు గాని ఎవరికీ ఏమాత్రం తెలియదన్న విషయం జోడించి చూడండి,” అన్నాడు ముగిస్తూ.

“ఊఁ నిజమేస్మీ!” ఒప్పుకున్నాడు నిలోవ్. ఇన్నాళ్ళకి అతని ముఖం మీద చిరునవ్వు మొలిచింది. “ఇప్పుడు నాకు అర్థం అయింది. ఈ భయం అంతా అర్థం లేనిదని.”

“అందులో ఎంతమాత్రం సందేహం లేదు.”

“మీకు నా ధన్యవాదాలు” అన్నాడు నిలోవ్ ఆనందంగా చేతులు నలుపుకుంటూ, చిరునవ్వు నవ్వుతూ. “మీ దగ్గరనుండి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ఎంతో బాగుంది. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కుదిరింది. నాకిప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. నిజానికి ఆనందం ఉరకలు వేస్తోంది. భగవంతుడా! ఎంత చల్లని మాట వినిపించేవు! ప్రమాణం చేసి చెబుతున్నా! నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను!”

నిలోవ్ ఓవ్చినికోవ్‌ని కాగలించుకుని, మూడుసార్లు ముద్దుపెట్టుకున్నాడు. ఆనందం ఉరకలు వేసినపుడు కుర్రవాడు ఎలా హద్దులు మీరి ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించేడు. దృఢమైన శరీరం, స్వతహాగా మంచితనం ఉన్నవాళ్ళకి అలాంటి లక్షణం ఉంటుంది. టేబిలు క్రిందనుండి ఒక గుర్రపు నాడాని తీసి, దాన్ని తిన్నగా చెయ్యడానికి ప్రయత్నించేడు. కానీ మితిమీరిన ఆనందం కలిగించే అలసటవల్లా, భుజంలో తలెత్తిన నొప్పివల్లా ఆ పని చెయ్యలేకపోయాడు. తన ఎడం చేతిని డాక్టరు నడుము చుట్టూ వేసి, తన ఎడమ భుజం మీదకి లేవనెత్తి, వాళ్ళున్న చోటునుండి భోజనాల గదిలోకి మోసుకుపోవడానికే పరిమితమయ్యాడు. అతను డాక్టరు దగ్గరనుండి శలవు తీసుకునే సమయానికి ఎంత ఉల్లాసంగా ఉన్నాడంటే, అతని నల్లని గడ్డం మీదకి పెల్లుబికిన కన్నీటి చుక్కలు కూడా అతనితోపాటు ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టు కనిపిస్తున్నాయి. మెట్లు దిగుతూ, మరొకసారి గలగలా నవ్వి చెయ్యి ఆన్చుకునే కమ్మీని ఎంత గట్టిగా కుదిపాడంటే, వసారాలో కొంత మేర ఊడి చేతిలోకి వచ్చేసింది. అతనికి వీడ్కోలు పలకడానికి అంతదాకా వచ్చిన ఓవ్చినికోవ్‌కి, నిలోవ్ పదఘట్టనకి మొత్తం వసారా అంతా దద్దరిల్లుతున్నట్టు తోచింది

‘ఏమి బలంరా బాబూ!’ అని ఆశ్చర్యపోయాడు ఓవ్చినికోవ్, అతని విశాలమైన భుజాల్ని వెనుకనుండి గమనిస్తూ. ‘ఏమి భారీ విగ్రహం!’ అని విస్తుపోయాడు.

తన బగ్గీలోకి కూర్చుని, నిలోవ్ ఆనకట్టమీద తోడేలుని తను ఒక్కడూ ఎలా ఎదుర్కొన్నాడో- ఏ చిన్న విషయం విడిచిపెట్టకుండా మళ్ళీ మొదటినుండి హావభావాలు ప్రదర్శిస్తూ చెప్పడం ప్రారంభించేడు తన సారథికి.

“ఆట మజాయే అది!” అన్నాడు కథనానికి ముగింపు పలుకుతూ. “నేను ముసలివాణ్ణి అయ్యాక నెమరువేసుకోవలసిన విషయాల్లో ఇదొకటి. త్రిష్కా! గుర్రాల్ని దౌడు తీయించు!” అని ఆజ్ఞాపించేడు.

[“మీకు నా ధన్యవాదాలు” అన్నాడు నిలోవ్ ఆనందంగా చేతులు నలుపుకుంటూ, చిరునవ్వు నవ్వుతూ. “మీరు చేసిన సేవకి ప్రతిఫలంగా ఇదిగో ఈ ఐదు వందలూ ఉంచండి. అదిగో. అదే వద్దనేది. అలా బెట్టుచెయ్యడం మంచిది కాదు. నా కిప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే, నా దగ్గర డబ్బు లేదు గాని, ఉంటే, వెయ్యయినా ఇచ్చి ఉండే వాడిని. పదండి. ఇద్దరం కలిసి డ్రిక్ తీసుకుందాం!”

నిలోవ్ ఆ రాత్రి డాక్టరుతో డిన్నరు చేసి హాయిగా ఇంటికి చేరుకున్నాడు. కానీ, మర్నాటి ఉదయం నుండీ డాక్టర్ల దగ్గరికి, నాటువైద్యులదగ్గరికీ ఎప్పటిలా పరిగెత్తడం ప్రారంభించేడు. మిగతా రెండు సమస్యలకీ ఇప్పుడు ‘ఒంటరితనం అంటే భయం’ తోడైంది. అతను డాక్టరు ఇంటికి దగ్గరగా ఇల్లు తీసుకుని రాత్రీ పగలూ సతాయించడం ప్రారంభించాడు.

గడియారంలోని ముళ్ళు మనం గ్రహించలేనంత నెమ్మదిగా నడుస్తుంటాయి. కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, నిముషాల ముల్లు కదలికని పసిగట్టవచ్చు. అలాగే, డాక్టరు కూడా, నిలోవ్ మీద బలవంతంగా తన దృష్టి పెట్టవలసి రావడంతో, ఒక విషయాన్ని గ్రహించగలిగేడు: ఎంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయినా, ఎలా బరువు కోల్పోతాడో, ఎలా వయసు మీరుతాడో; ఎంత వివేకవంతుడనుకున్న వ్యక్తి కూడా, మార్మికవాదానికి ఎలా బలి అవుతాడో!

నిలోవ్‌కి హైడ్రో ఫోబియా రాలేదు. ఒక నెల- రెండు నెలలు- మూడు నెలలు గడిచాయి. అతను క్రమంగా పూర్వపు మనిషి కాగలిగేడు. ఒక ఏడాది గడిచింది. వయసుకంటే ముందుగా తల నెరిసిపోవడం, శరీరం ముడుతలు తేరిపోవడం గుర్తుచేసి ఉండకపోతే, ఈపాటికి అతను తోడేలుతో జరిగిన సంఘటనని మరిచిపోయి ఉండేవాడు కూడా.

మనిషికి జ్ఞాపకశక్తి చాలా చిన్నది. కొన్నాళ్ళకి మాక్జిమ్‌ని ఒక పిచ్చికుక్క కరిచింది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డాక్టరు నిలోవ్‌ని చూడడానికి వెళ్ళేడు.

“మేము మాక్జిమ్‌ని పాస్టరు దగ్గరికి పంపిస్తున్నాము. మేము చందాలు వసూలు చెయ్యడానికి నిశ్చయించుకున్నాము. నువ్వేమైనా సహకరించగలవా?” అని అడిగేడు అతన్ని.

“సంతోషంగా!” అని చెప్పి, తన గదిలోకి వెళ్ళిన నిలోవ్, ఐదు రూబుళ్ళు చేతిలో పెట్టాడు.]

***

ఈ అనువాదాన్ని తమ ఆగష్టు 22 సంచికలో ప్రచురించినందుకు ఈమాట సంపాదకులకు కృతజ్ఞతలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: