పోడు మీద ముళ్లపొదలు పచ్చగా కనిపిస్తున్నై
చెరువుగట్ల నీలిపూలు ఆనందంతో లాస్యంచేస్తున్నై
సిందూర వృక్షాలు పూతకొచ్చాయి, వాటి మొదళ్ళలో
ముళ్ళగోరింటలు త్వరలోనే మాలలు అల్లనున్నాయి,
మే నెల ఎండలో కనిపించే పూమాలలు.
చిక్కబడిన వసంతఋతువు తొలి చుట్టం
పిచ్చుక కూడ చివరకి అడుగుపెట్టింది.
సరిగ్గా సూర్యాస్తమయవేళ, పిట్టలు కూసే వేళ
అది తుర్రుమంటూ పరిగెత్తుకు రావడం చూసేను
ఎప్పటిలాగే దానికి స్వాగతం పలికేను.
ఓ వేసవి చుట్టమా! రా! రా!
నా రెల్లుగడ్డి ఇంటిచూరుకు నీ మట్టిగూడు అల్లుకో
ఇక ప్రతిరోజూ తెల తేలవారే వేళ
నా పర్ణశాల చూరుక్రింద నువ్వుపాడే
సంగీతాన్ని నన్ను చెవులారా విననీ!
.
ఛార్లెట్ స్మిత్
(4 May 1749 – 28 October 1806)
ఇంగ్లీషు కవయిత్రి.
.

స్పందించండి