మనందరికీ తెలిసినదే
నాలుగు చెలకలైనా వరిపొలం లేని రైతుకి
ఎంతశ్రమో నలుగురు పిల్లల్ని పెంచి బడికి పంపించాలంటే.
తనకంటూ ఇల్లులేని, నగరంలోని గృహస్థు
ఇల్లు సంపాదించుకుందికి జీవితమంతా
ఎన్ని కష్టనష్టాలు పడతాడో కూడా తెలుసు.
పిల్లల్ని పెంచిన వారందరికీ తెలుసు
నలుగురు పిల్లల్ని పెంచాలంటే
అందరిలాగే బడికి పంపించాలంటే
వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలంటే
ఒళ్ళు తెగకోసుకోవడం లాంటిదని.
ఓ పిల్ల పెళ్ళిచెయ్యాలంటే,
ఒక ఇంటిస్తంబం మాయమౌతుంది,
కుర్రాణ్ణి కాలేజీకి పంపాలంటే
ఒక పొలం అమ్మెయ్యాల్సొస్తుంది.
రోజుకి ఎనిమిది గంటలు పనిచేసినా చాలదు.
కొందరు లోపలా బయట కూడ పనిచేస్తారు,
అయినా, చివరకి లెక్కలన్నీ తేలే సరికి అది ఎక్కడికీ చాలదు.
మనకి తెలుసు ఎదిగే పిల్లల ఆకలి ఎలా ఉంటుందో.
అలా అని పేదరికం అంటే కేవలం చింకి బట్టలేనా?
మనందరం గోతిలో ముత్యాల్లా కప్పబడి ఉండాలా?
అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉందనుకుంటూ
ఈ రోజు ఆకలిని ఏ చెలమలో నీరో తాగి మాన్పగలమా?
ఆ ఆకుపచ్చని పర్వతం తన పాదాల చెంత తోటలని పెంచినట్టు
మన పాదాల క్రింద పిల్లల్ని పెంచలేం.
అది ఒంటరిగా విరియనూ గలదు, వాడనూ గలదు.
నాలుగు ఋతువులూ వెచ్చి వెళ్లిపోతాయి.
కానీ పిల్లలు తమంత తాము పెరగలేరు; వాళ్లంత వాళ్ళు తినలేరు.
భర్తలు భార్యలకు కావలసింది తెచ్చిపెట్టాలి.
భార్యలు తమ భర్తలకి అండగా నిలబడాలి.
వాళ్లకి ఆ ఆకుపచ్చని పర్వతంలా ఎంతటి రసాత్మక హృదయం ఉన్నా,
మనుషులు పనిలోనే పుడతారు, పనిలోనే బ్రతుకుతారు, పనిలోనే చస్తారు.
ఊరవేసిన చేపలని తింటేనే పేగులు సంతృప్తి చెందేది.
వాళ్ళకి తిండిలేకపోతే కడుపు మలమల మాడుతుంది.
తిండి తినగలిగితేనే కాలకృత్యాలు తీర్చుకోగలరు.
ఆదర్శవాదిలా, కేవలం గాలి భోంచేస్తూ, తేనె తాగుతూ
ఒంటరిగా ఎవరు బ్రతకగలరు?
తినడానికి బార్లీ జావ, ఉలవచారూ మాత్రమే ఉన్నవాడికి
అన్నం కనిపిస్తే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది.
వాళ్ళు అన్నం ముందు సాష్టాంగపడతారు.
“ఈ ప్రపంచం అంతా ఒక్క చామంతిని వికసింపజేయడానికి
కృషిచేస్తునట్టుంది,” అని మీరు భావగీతా లాలపిస్తున్నప్పుడు
ఈ నేలమీద, ఎవరికీ కనిపించని ఓ మూల
ఒక పిడికెడు అన్నంకోసం ఒక గొంతు ఆకలితో అరుస్తోందని మీకు తెలుసా?
ఎలా చూసినా, పేదరికం అంటే చిరుగు బట్టలు వేసికోవడం మాత్రం కానే కాదు.
అదేదో ఒక సారి తొడుక్కుని తర్వాత తీసేసే పాత చొక్కాలాటిది కాదు.
జీవితం భీకరమైన తరంగాలమీద చిక్కుకున్నప్పుడు,
మధ్యాహ్నం వేళ తీరికగా ఆకుపచ్చ పర్వతాన్ని చూడడం ఆనందం ఇవ్వదు.
పేదరికం ఒక శత్రువు. మనల్ని నిలువునా నమిలేసే క్రిమి.
అది మన సహజమైన వ్యక్తిత్వాన్ని కూడా నంజుకు తింటుంది.
ఆ విషం మన దుస్తుల్నే కాదు, మన చర్మాన్నికూడా చివుకబెడుతుంది.
అది మానవాళి కంతటికీ శత్రువు. మనం తరిమెయ్యవలసిన భూతం.
పేదరికంలో సుఖానికి అర్రులు జాచేవాడు
అతనికి తెలియకుండానే కదుపులో ఈ క్రిమిని పెంచుకుంటున్నాడు.
‘తావో యువాన్-మిన్ ‘ తాగే కప్పుని ఎరు వడుగుతూనో,
‘లీ బై ‘ తాగిన తర్వాత చేసే అల్లరి పనుల్ని అనుకరిస్తూనో
మీరు అంతా బాగుంది, అంతా బాగుందని అరవ్వొచ్చు.
కానీ, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు.
గుప్పెడు మెతుకుల అన్నం కోసం, చారునీళ్ళ కోసం
అలమటించే ఆ నోటిని అవమానపరచ వొద్దు
ఒక పద్యం కోసం పేదరికాన్ని తాకట్టు పెడతానంటూ.
ఓ మోసకారి కవీ! జోలపాటలు పాడే కవి
ఎప్పుడూ ప్రజల్ని ఎప్పుడూ నిద్రపుచ్చుతూనే ఉంటాడని తెలుసుకో!
.
మూన్ బ్యూంగ్ రాన్
Born 1935
దక్షిణ కొరియా కవి.
This poem seems an excellent, uncompromising rejoinder to the poem “Gazing at Mudeung Mountain by Seo Jung-ju. In fact, some of the lines are quoted exactly to contradict what poverty is not about and what a poor man is supposed to do.
*

స్పందించండి