ఈ కవిత చదువుతుంటే, పాపయ్య శాస్త్రి గారి పద్యం “ఏది మరొక్కమారు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా
ఊదగదోయి, ఊదగదవోయి….” గుర్తుకు వస్తుంది. ‘పునరుక్తి’ దోషంకాదంటూ చక్కని ఉపమానంతో సమర్థిస్తుంది కవయిత్రి
ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ఈ కవితలో. హృదయగతమైన సుకుమార భావనలు దేశకాలావధులకి అతీతమైనవని
అనడానికి మరొక్క ఋజువు.
.
ఏదీ, మరొకసారి చెప్పు, మళ్ళీ ఇంకొకసారి చెప్పు
నన్ను ప్రేమిస్తున్నానని! పదేపదిసార్లు పలికిన ఈ మాటలు
నువ్వన్నట్టు అవి నాకు కోకిలపాటలా వినిపించినా,
ఒక్కటి గుర్తుంచుకో! ఈ కొండమీదకైనా, ఆ మైదానంలోకైనా
లోయలోకైనా, అడవిలోకైనా ఆ కోకిలపాటే లేకుంటే,
ఆకుపచ్చని రంగును పరుచుకుంటూ నవ వసంతం అడుగుపెట్టదు!
ప్రియతమా! కారుచీకటిలో సందేహాకులమైన
ఆత్మఘోష వినిపించినపుడు కలిగిన మనోవేదనకి
“నన్ను మరోసారి ప్రేమిస్తున్నానని చెప్పు” అని ఏడుస్తాను!
ప్రతిఒక్కటీ ఆకాశంలో పొరలుతున్నా, చుక్కలంటే భయమేరికి?
ప్రతిఒక్కటీ ఋతువుల్ని అభిషేకిస్తున్నప్పుడు పూలంటే భయమేటికి?
ఏదీ నన్ను ప్రేమిస్తున్నానని, నను ప్రేమిస్తున్నానని, ప్రేమిస్తున్నానని
గంటమ్రోగించినట్టు పదే పదే చెప్పు! కానీ, ప్రియా మరొక్కమాట,
నను ప్రేమించడమంటే మనసారా మౌనంలోకూడా ప్రేమించడం!
.
ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్
(6 March 1806 – 29 June 1861)
ఇంగ్లీషు కవయిత్రి
Photo Courtesy:
https://www.poets.org/poetsorg/poet/elizabeth-barrett-browning.
స్పందించండి