మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన ప్రముఖ యువకవులలో ఛార్ల్స్ సోర్లీ ఒకడు. Wilfred Owen (1893-1918), Isaac Rosenberg (1890 – 1918) కూడా పిన్న వయసులోనే పోయారు. యుద్ధోన్మాదం పట్ల విముఖతే కాక, చనిపోయిన వారిగురించి అరిగిపోయినమాటలలో చెప్పే ఊకదంపుడు మాటలపట్లకూడా అతనికున్న విముఖత, మృత్యువుపట్ల వయసుకి మించిన పరిణతితో కనిపించే నిర్లిప్తతా ఈ కవితలో కనిపిస్తాయి.
***
కొన్ని లక్షలమంది నోరులేనిమనుషులు
మీ కలల్లో కుప్పలుతెప్పలుగా నిర్జీవంగా కనిపిస్తే
మీ జ్ఞాపకంలో ఉన్నవి, నలుగురూ చెప్పినట్టే
నాలుగు మంచిమాటలు చెప్పకండి. మీరూ అలా చెప్పవలసిన పని లేదు.
వాళ్ళని ప్రస్తుతించకండి. వాళ్ళకి వినిపించదు. ప్రతి మృతుణ్ణీ
మీరు తిడుతున్నారో, శపిస్తున్నారో వాళ్ళకెలా తెలుస్తుంది?
కన్నీరూ కార్చొద్దు. మూసుకుపోయిన వారి కనులు మీ కన్నీళ్ళు చూడలేవు.
వాళ్లకి బిరుదులూ గౌరవాలూ వద్దు. చావడం చాలా సులభం.
“వాళ్ళు చనిపోయారు” అని మాత్రమే అనండి. కావలస్తే ఈమాట జోడించండి:
“వీరికంటే మెరుగైనవాళ్ళు చాలామంది ఇంతకుముందు మరణించేరు,” అని.
తర్వాత, అక్కడున్న అనేకానేక ముఖాల్ని పరిశీలించి అందులో ఒకటి
మునుపెన్నడో మీరు ప్రేమించిన ముఖంలా ఉన్నట్టు అనిపిస్తే
అది అబద్ధం. ఎవరికీ మీకుతెలిసిన ముఖం ఉండమన్నా ఉండదు.
ఉత్కృష్టమైన మృత్యువు ఎప్పుడో అందరినీ శాశ్వతంగా స్వంతం చేసుకుంటుంది.
.
ఛార్ల్స్ సోర్లీ
(10 May 1895 – 13 Oct 2015)
స్కాటిష్ కవి
Charles Hamilton Sorley
(10 May 1895 – 13 Oct 2015)
Photo Courtesy: Wikipedia
స్పందించండి