ఎడ్వర్డ్ థామస్ స్మృతిలో … రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
నీ కవితలు గుండెమీదపెట్టుకుని నిద్రలోకి జారుకున్నాను అలా పేజీలు తెరిచి ఉంచి, అర్థాంతరంగా విడిచిపెట్టి, సమాధిమీది చిత్రంలోని పావురాయి రెక్కల్లా నిద్రలోనైనా అవి మనిద్దరినీ కలుపుతాయేమోనని.
నేను జీవించి ఉండగా తప్పిపోయిన అవకాశం మరి రాదు కొంచెం ఆలస్యమైనప్పటికీ నిన్ను నేను కలుసుకుంటాను ముందుగా నువు సైనికుడివి, తర్వాత కవివి, తర్వాత రెండూను, నీ జాతిలో సైనిక-కవిగా మరణించింది నువ్వే.
నా ఉద్దేశ్యమూ, నీ ఉద్దేశ్యమూ కూడా మనిద్దరిమధ్యా ఏ దాపరికాలూ ఉండకూడదన్నది; సోదరా, ఇదొకటి మిగిలిపోయింది— మరొక విషయం, ఆ తర్వాత అడక్కూడనిదొకటుంది విజయం సాధించి కోల్పోయినదెంత, గెలిచినదెంత?
ఆ వైమీ(Vimy) పర్వతశ్రేణి మీద ఫిరంగిగుండు విరజిమ్మే అగ్నిని హత్తుకుందికి వెళ్ళావు నువ్వు; నువ్వు రాలిపోయిన ఆ రోజు నాకంటే నీకే యుద్ధం ముగిసినట్టనిపించింది, ఇప్పుడు దానికి భిన్నంగా నీకంటే, నాకే ముగిసినట్టనిపిస్తోంది.
అయినా, శత్రువు రైన్ నది దాటి యుద్ధాన్ని ప్రమాదకరంగా ఈవలకి పొడిగించాడని ఎరిగిన నేను ఆ విషయం నీకు ఒకవేళ చెప్పకూడదనుకున్నా, కనీసం, నా మాటలతో నిన్ను సంతోషపెట్టవద్దూ? . రాబర్ట్ ఫ్రాస్ట్ (March 26, 1874 – January 29, 1963) అమెరికను కవి .
స్పందించండి