ఓహ్! నా గురించి ఏ జ్ఞాపకాలూ మిగలకుండా
నన్ను నేను అన్ని సంకెళ్ళనుండీ విముక్తం చేసుకోవడం
డిశంబరునెలలోని చెట్టులా
నా హృదయాన్ని మోడులా చేసుకోవడం
ఆకులన్నీ రాల్చిన తర్వాత చెట్టులా
ప్రశాంతంగా నిశ్చింతగా నిలబడగలగడం
రాత్రి కురవబోయే వర్షానికి గాని
వేకువ సంధ్యారాగానికిగాని నిరీక్షించే పనిలేకపోవడం
అయినా ఇంకా, ఓహ్ అంత నిశ్చలంగా ఉండడం…
విసరుగాలులు వచ్చిపోతుంటే
కురవబోయే మంచు వర్షానికి భీతిగాని
లేదా బరువుగా పేరుకునే మంచు గురించి భయం గాని
లేకుండా నిశ్చలంగా ఏమీ పట్టించుకోకుండా ఉండడం ;
ఎవరైనా పక్కనించి పోతారని గాని
తెల్లని ఆకాశపు కాగితంపై సన్నని నల్ల గీతని
చూస్తారన్న చింతగాని లేకుండా ఉండడం… (ఎంతకష్టం! )