నాలుగేళ్ళు నిండబోతున్న పిల్ల దినచర్య నుండి… హనన్ అష్రవి, పాలసీనా కవయిత్రి
కొన్ని కవితలూ, దానికి జతచేసిన బొమ్మలూ, ఒక్కోసారి ఎన్నాళ్ళయినా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కవితల్లో ఇది ఒకటి. ఈ కవితలో ఉన్నదల్లా కేవలం 4 ఏళ్ళవయసుండే పిల్లలలో కనిపించే అమాయకత్వం. ఈ కవితకి పెట్టిన బొమ్మ చూస్తేనే మనసు చలించిపోతే, ఈ కవిత చదివిన తర్వాత మనసు ఒకసారి నిస్తేజానికి గురైంది. ఇంత చిన్న మాటల్లోనే, కవయిత్రి యుద్ధం ఎంతటి వినాశకరమో, దానివల్ల ఎంతో అందమైన భవిష్యత్తుని అనుభవించవలసిన అమాయకులైన పిల్లలు, జార్జి బుష్ జూనియర్ మాటల్లో చెప్పాలంటే, నైసర్గిక హాని (Collateral Damage) పేరుతో ఎంత నష్టపోతున్నారో హృదయం ద్రవించేలా విశదపరుస్తుంది.

.
రేపు కట్లు విప్పుతారు.
ఆ మిగిలిన ఒక్కకంటితో చూసినపుడు
రేపటినుండీ, నాకు సగమే కమలాఫలం,
సగమే ఆపిలుపండూ,
చివరకి మా అమ్మ ముఖంకూడా
సగమే నాకు కనిపిస్తాయా?
నాకు తుపాకీ గుండు కనిపించలేదు
కానీ దానివల్ల కలిగినబాధతో
నా తల పగిలిపోవడం తెలుసు.
వణుకుతున్న చేతులూ, కళ్ళలో ఆ చూపూ
పెద్ద తుపాకీతో ఒక సైనికుడు …
అతని రూపం ఎంతప్రయత్నించినా
కళ్ళముందునుండి చెరిగిపోవడం లేదు.
కళ్ళు గట్టిగా మూసుకున్నా
ఎందుకలా అంత స్పష్టంగా కనిపిస్తున్నాడో
నాకు అర్థం కావటం లేదు.
మనందరికీ బుర్రల్లో
అదనంగా
మరొక జత కళ్ళు ఉన్నాయేమో!
మనం ఎప్పుడైనా పోగొట్టుకుంటే
వాటిని పూరించడానికి.
మళ్ళీ నెల, నా పుట్టిన రోజుకి
నాకొక సరికొత్త గాజు కన్ను వచ్చెస్తుంది.
వస్తువులన్నీ గుండ్రంగానూ
మధ్యలో ఉబ్బెత్తుగానూ కనిపిస్తాయేమో,
నేను చాలా సార్లు గోళీకాయలతో చూసేను
ప్రపంచమంతా,
ప్రపంచం చాలా చిత్రంగా కనిపించింది.
పాపం, ఒక తొమ్మిది నెలల పిల్లకి కూడా
కన్నుపోయిందని చెప్పగా విన్నాను.
పసి పిల్లల కళ్ళలోకి తోంగిచూసే
ఈ సైనికుడే, కొంపదీసి ఆ పిల్ల
కళ్ళలోకి గురిచూసి కొట్టలేదు కదా!
నేనైతే పెద్దదాన్ని, అప్పుడే నాలుగేళ్ళు నిండిపోయాయి
చాలా జీవితం చూసేను,
కానీ ఆ పిల్ల మరీ పసికందు
లోకం అంటే ఏమిటో బొత్తిగా తెలీదు.
.
హనన్ దావూద్ ఖలీల్ అష్రవి
(Born 8 Oct 1946)
పాలస్తీనా కవయిత్రి
.

.
From the Diary of an Almost-Four-Year –Old
.
Tomorrow, the bandages
will come off. I wonder
will I see half an orange,
half an apple, half my
mother’s face
with my one remaining eye?
.
For complete poem visit the below mentioned link:
.
.
Hanan Daoud Khalil Ashrawi
(Born October 8, 1946)
Palestinian Poet.
Hanan Mikha’il Ashrawi is a prominent Palestinian academic, poet, politician, and human rights activist. She became known worldwide for her efforts in Palestinian-Israeli negotiation toward peace.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి