[మిక్లోష్ రాద్నోతి రెండవ ప్రపంచయుద్ధకాలంలో హిట్లరు చేసిన మారణహోమంలో బలైపోయిన హంగేరియన్ కవి.
ఈ కవిత చదువుతుంటే మీకు రెండు విధాలుగా కన్నీళ్ళు రాకమానవు. ఒకటి అంత మంచి భవిష్యత్తు ఉన్న కవి అలా అన్యాయంగా చనిపోయినందుకు; రెండు, ఈ కవితలో అతను ఉపయోగించిన దృశ్యరూపకమైన ఉపమాలంకారాలకి. ముఖ్యంగా, నిదురిస్తున్న తోటలో, తిరోగమిస్తున్న గ్రీష్మం తీరికగా స్నానంచెయ్యడం, ఆకుల మధ్యలో పళ్ళు దిగంబరంగా ఉయ్యాలలూగడం, ఈ రెండింటికంటే అందంగా, “పగలు మెల్ల మెల్లగా నీడలు గీసుకుంటూ పోవడం”. అది ఒక చిత్రకారుడి ప్రతిభకి దీటైన ఊహ.
ఇది చదివిన తర్వాత నాకు జాషువా గారి శ్మశానవాటిలో, ” ఈ లోకంబున వృద్ధిగాదగిన యేయేవిద్య లల్లాడెనో” అన్న పంక్తులు గుర్తు వచ్చేయి.]
***
నీకు నిజంగా పిచ్చే. క్రింద పడిపోతావు, అయినా లేచి నడుస్తావు
నీ మోకాళ్ళూ, ముణుకులూ కదలడం ప్రారంభిస్తాయి
నీకు ఏదో రెక్కలున్నట్టు నడక ప్రారంభిస్తావు.
కందకం నిన్ను ఆహ్వానిస్తోంది. భయపడి నిలబడి
ఎందుకని ఎవరైనా అడిగితే, వెనక్కి తిరిగి నువ్వు చెప్పొచ్చు
ఒక మహిళ, ఒక సహజమైన మృత్యువు…
ఇంతకంటే మెరుగైనది… నీకోసం ఎదురుచూస్తున్నాయని.
కానీ, అది నీ వెర్రి.
చాలా కాలం వరకు ఊర్లో కాలిన ఇళ్ళమీదనుండి మాత్రమే పొగలొచ్చేవి
గోడలు వెనక్కి వాలిపోయేవి, పళ్ళచెట్లు విరిగిపడేవి,
ఆగ్రహించిన రాత్రి మరింత చిక్కగా భయంకరంగా ఉంటుండేది.
ఆహ్! ఇప్పుడు వెళ్ళడానికి ఒక ఇల్లు ఉంది కాబట్టి
నాకు విలువైనదంతా నాలోనే కాకుండా బయట ఉందని
నమ్మగలిగితే ఎంత బాగుణ్ణు!
అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుణ్ణు!
….
ఎప్పటిలాగే, తేనెటీగలు చల్లగా ఉన్న చావడి మీద
ప్రశాంతంగా ఝంకారం చేస్తున్నాయి,
వేడి తేనెలో ఊరబెట్టిన పళ్ళు చల్లారిపోతున్నాయి
నిదురిస్తున్న తోటలో, తిరోగమిస్తున్న గ్రీష్మం తీరికగా స్నానంచేస్తోంది.
ఆకుల మధ్యలో పళ్ళు దిగంబరంగా ఉయ్యాలలూగుతున్నాయి,
తుప్పుపడుతున్న కంచె ముందర
అందమైన జుత్తుగల ఫానీ నాకోసం నిరీక్షిస్తుంటుంది.
పగలు మెల్ల మెల్లగా నీడలు గీసుకుంటూ పోతుంటుంది…
ఇవన్నీ జరిగే అవకాశం ఉంది.
చంద్రుడు ఈ రోజు ఎంత గుండ్రంగా ఉన్నాడో!
మిత్రమా, నన్ను దాటి పోబోకు.
గట్టిగా అరూ! నేను లేచి మళ్ళీ నుంచుంటాను!
మిక్లోష్ రాద్నోతి
(5 May 1909 – 9 November 1944)
హంగేరియన్ కవి
.
.
స్పందించండి