వెనుతిరుగు వెనుతిరుగు నీ పరుగులో ఒకసారి కాలమా!
వెనుదిరిగి ఒక్క రాత్రికి నన్ను పసిబిడ్డగా మార్చవా!
ప్రతిధ్వనులెరుగని తీరంనుండి ఒకసారి మరలిరావా అమ్మా!
మునపటిలాగే ఒకసారి నన్ను నీ గుండెలకు హత్తుకోవా;
నా నుదిటినుండి వంతల ముడుతలు ముద్దాడి పోవా;
అక్కడక్కడ నెరిసి నిలబడుతున్న నా జుత్తు సవరించవా
ఎప్పటిలానే నే నిదరోతున్నపుడు ప్రేమగా కాపుకాయవా;-
అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు! నను నిద్రపుచ్చు
వెనుదిరుగు వెనుదిరుగు ఓ కాలకెరటమా!
ఈ కష్టాలకీ కన్నిళ్ళకీ నేను అలసిపోయాను,-
ప్రతిఫలం లేని శ్రమ, వృధాగా పోయే కన్నీరూ,
ఇవన్నీ తీసుకుని నా బాల్యాన్ని తిరిగి నాకిచ్చెయ్!
ఈ నుసినుసిగారాలుతూ నశించడానికి విసుగేస్తోంది
నా ఆత్మ సంపదని వృధాగా విసిరి విసిరి అడలిపోయాను,
పరులు చేనుకోసుకుందికి నాట్లు వేసి వేసి డస్సిపోయాను,
అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు!నను నిద్రపుచ్చు
ఇక్కడి డొల్లతనం, నీచత్వం, కాపట్యాలకి
అమ్మా, ఓ అమ్మా, నా మనసు నీకై పలవరిస్తున్నది,
నిన్ను నేను ఎడబాసిన దగ్గరనుండి ఎన్ని ఏళ్ళో
గడ్డి, చిగిర్చి, పచ్చగా ఎదిగి, వాడి పోయింది,
అయినప్పటికీ అంతులేని ఆర్తితో,గాఢమైన కోరికతో
ఈ రాత్రి నా దగ్గరకు నువ్వు మరొకసారి రావాలని తపిస్తున్నాను.
సుదీర్ఘ, అగాధ నిశ్శబ్దం లోంచి ఒకసారి వచ్చి
అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు!నను నిద్రపుచ్చు
గడిచిపోయిన రోజుల్లో, నా మనసుమీద,
నీ ప్రేమ కురిసినంతగా మరేప్రేమా కురవలేదు,
నీ అంత నిస్వార్థంగా, నమ్మకంగా, ఓపికగా
ఏ అనుబంధమూ ముడిపడలేదు, కొనసాగలేదు,
లోకానికి బెదిరిన మనసునుండీ, చెదిరిన గుండెనుండీ
నీలాగ ఎవ్వరూ బాధను మంత్రించినట్టు తొలగించలేరు.
బరువెక్కిన నా కనురెప్పలపై నిద్ర తూగుతూ వాలుతోంది
అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు!నను నిద్రపుచ్చు
రా, లేత బంగరు చాయతో మెరిసే నీ గోధుమరంగు జుత్తు
మునుపటిలాగే నీ భుజాలమీద ఒత్తుగా అల్లుకోనీ;
మసకబారుతున్న నా కళ్లనుండి వెలుగుని దూరంగా తరుముతూ
ఈ రాత్రి అది నా ముఖం మీద అలా అలవోకగా వాలనీ
దాని పసిడివెలుగుల క్రీనీడల ఆనందపు జాడలలో
నా చిన్ననాటి కలలు మరొకసారి నన్ను ముప్పిరిగొననీ.
హాయిగొలిపే ఆ తీయని కలలడొలికలలో
అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు!నను నిద్రపుచ్చు
అమ్మా, నా బంగారు తల్లీ! క్రిందటిసారి
నీ జోలపాట విని ఎన్నేళ్ళుగడిచేయో లెక్కలేదు!
ఏదీ మరొకసారి పాట అందుకో. నా మనసుకి
మాతృత్వపు హరిమ ఒక కలగా గుర్తొస్తుంది.
నీ గుండెకి నన్ను గట్టిగా పొదువుకుని
నీ ముఖం మీద వెలుగులు జీరాడుతుంటే
ఇక ఎన్నడూ రోదించ, మేల్కోనవసరం లేకుండా
అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు!నను నిద్రపుచ్చు
.
ఎలిజబెత్ ఏకర్స్ ఏలన్
(October 9, 1832 – August 7, 1911)
అమెరికను
![]()
స్పందించండి