నెల్లాళ్లక్రిందటే దివినుండి దిగివచ్చిన పాపాయి ఎన్ని పౌండ్లు తూగుతుందబ్బా? ఎంతబరువుంటుందో కిరీటంలాటి వంకీ నుండి అవిశ్రాంతమైన గులాబిరంగు బొటనవేలివరకు?
తాతగారు చేతిరుమాలు ఊయలలా ముడివేసి లోలకంలా ఊగుతున్నదాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు, జారిపోతున్న కళ్ళజోడుమీంచి జాగ్రత్తగా పరికించి “ఎనిమిది పౌన్లే” అంటూ ముల్లును చూసి చెప్పేరు.
మెల్లిగా ఆ మాట ప్రతినోటికీ పాకిరింది చిట్టితల్లిని చూసి తండ్రి ఆనందంతో నవ్వేడు చక్కనైన మాతృమూర్తి పాటలు పాడుతుంటే నాయనమ్మ చిన్నదాని ముంగురులు సవరిస్తోంది.
అపురూపమైన చిన్నారి మీదకి వాలి, ఒద్దికగా ఒక ముద్దు పెట్టుకుంది మనసులో ఏవో చదువుకుంటూ, లాలిస్తూ పాపాయితో మంద్రస్వరంలో ఇలా అంది: “తాతగారు సరిగ్గా నిన్ను తూచలేదు కదమ్మా?”
ఎవరూ పాపాయి చిరునవ్వు తూకం వెయ్యలేరు, ఆ శిసువుతోపాటే వచ్చిన ప్రేమనీ కొలవలేరు; ఎవ్వరూ ఆ చిన్నారి ప్రేమ పాశాలని కొలవలేరు ఆ తల్లి జీవితాన్ని కట్టిపడేసే బంధాలవి
ఏ సూచికలూ ఖచ్చితంగా అంచనా వెయ్యలేవు ఆ చిన్నారి తీసుకునే ప్రశాంతమైన ఊపిరి విలువెంతో- నెమ్మదిగా, విరామం లేకుండా లయాన్వితంగా ఓపికగా, నిష్టగా, కడదాకా కొట్టుకుంటుంది.
ఆ పాపాయి ఆత్మని ఎవరూకొలవలేరు, ఇక్కడ ఈ భూమి మీద దాన్ని కొలవగల సాధనాలు లేవు; దేవునుకే ఎరుక సృష్టిలో దాని అనంతమైన విలువ ఎంతో.
ఏ దేవత వెండివన్నెల రెక్కలసాయంలేకుండా వచ్చిన ఆ ఆత్మను ఒడిసిపట్టేది ఎనిమిది పౌన్లేనా? మానవదేహపు దేవళంలో కొలువై వెలుగొందుతోంది ఇంత చిన్ని, సున్నితమైన శరీరంలో
ఓ కన్న తల్లీ! మనసారా నవ్వుకో, హాయిగా ఆనందంగా ఉండు, కానీ ఒకవిషయం మరువకు ఆ చిన్నారి కళ్ళలోంచి ఒక ఆత్మ తొంగి చూస్తోంది తను వచ్చిన స్వర్లోకపు ఇంటి స్పృహ పోలేదింకా. . ఎథ్ లెండా ఏలియట్ బీర్స్, (ఎథెల్ లిన్)
స్పందించండి