కొన్ని కవితలు చూడడానికి సీదా సాదాగా ఉంటాయి గాని వాటి భావ విస్తృతి చాలా అధికంగా ఉంటుంది. క్రిమి సంహారక మందులు వేసి పిచ్చుకలలాంటి పిట్టలకి ఆహారం దొరక్కుండా వాటిని అంతం చేస్తే, మందుల ప్రభావానికి తట్టుకుని నిలబడ్డ క్రిములు ఇప్పుడు పంటలకు పెద్ద నష్టం కలిగిస్తున్నాయి. వర్థమాన దేశాలూ, జనాభా అధికంగా ఉన్న దేశాల్లో, Walmart, HEB, Ikea వంటి పెద్ద పెద్ద మాల్స్ వస్తే, వాటిని మధ్యతరగతి ప్రజలు వాళ్లిచ్చే కూపన్ల ఆశలకు ప్రోత్సహించడం ప్రారంభించి, తోపుడుబళ్ళ వ్యాపారం చేసే చిల్లర వర్తకులని నిర్లక్ష్యం చెస్తే, కొన్నాళ్ళకి చిల్లరవర్తకాలు అంతరించిపోయి, అన్నీ మాల్స్ లో కొనుక్కోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు ఆ మాల్ వాడు గుత్తాధిపత్యం చెలాయించి, మధ్యతరగతి నడ్డి విరుస్తాడు. ఒక్క సారి ఆలోచించండి మొదట్లో కేవలం కంపోష్టువంటి సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేసి, తక్కువ దిగుబడి వచ్చినా, ఎక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వరివంగడాలు ఉన్న దేశంలో 50 ఏళ్ల క్రితం రసాయనిక ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలూ వచ్చి కొంత కాలం రాజ్యం చేసేక, రైతులు కూలిలుగా మారి, గ్రామాలలోని వృత్తులు మూలబడి అందరూ కర్మాగారాలకి కూలీలుగా మారేక, ఇప్పుడు మన పాతపద్ధతులే మంచివని, ఆరోగ్యానికి మెరుగని కొత్త సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చిల్లరరైతులుపోయి, కార్పొరేటు రైతులు అవతరిస్తున్నారు. కొన్ని తరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మధ్యతరగతి చిల్లర వర్తకుల విషయంలో కూడా ఇలాంటి పొరపాటే చేస్తే, 50 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం అవొచ్చు.
నా కళ్ళతో చూశాను
తీయగా పాడే పిట్టల్ని
మనుషులు తినడానికి
అంగళ్లలో అమ్మడం.
ఈ తాగుబోతు వీధిలోని
అంగళ్లలో అమ్మడం
నా ఊహల్లో కనిపించింది
గోధుమగింజలో పురుగు,
అప్పుడు అంగళ్లో ప్రజలకు
తినడానికి ఏదీ లేదు అమ్మకానికి
ఈ తాగుబోతు వీధి అంగళ్లలో
అమ్మకానికి ఏవీ లేవు.
.
రాల్ఫ్ హాడ్జ్ సన్
9 September 1871 – 3 November 1962
ఇంగ్లీషు కవి
.
వ్యాఖ్యానించండి