(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం)
ఎండ గురించి ఇక భయపడ పనిలేదు
శీతకాలపు చలిగురించి కూడా;
నువ్వు ఈ జీవితపు కర్తవ్యం నిర్వహించి
ఇంటికి తిరిగిపోయావు, ప్రతిఫలం అందుకుని;
అందగాళ్ళైనా, అందగత్తెలైనా
చిమ్నీలు తుడిచే పిల్లల్లా మట్టిపాలు కావలసిందే.
గొప్పవాళ్ళ ఆగ్రహానికి భయపడ పనిలేదు,
నిరంకుశుల శిక్షల పరిథి దాటిపోయావు;
ఇక తిండికీ బట్టకీ చింతించే పనిలేదు;
గడ్డిపరకైనా, మహావృక్షమైనా నీకు ఒక్కటే;
అందరూ చివరకి మట్టిలో కలవవలసిందే.
మెరుపులకి భయపడే పని లేదు,
అందరూ భయపడే పిడుగుపాటు అయినా;
అపవాదులకీ,తొందరపాటు విమర్శలకి కూడా;
నువ్వు సుఖదుఃఖాలను అధిగమించేవు;
యువప్రేమికులూ, అసలందరు ప్రేమికులూ
నిన్ను చేరవలసిందే చివరకు మట్టిలోకి.
ఏ మాంత్రికుడూ నీకు హానిచెయ్యలేడు!
ఏ మంత్రవిద్యలూ నిన్ను ఆకర్షించలేవు!
ఏ భూతమైనా నీకు దూరంగా ఉండవలసిందే
ఏ అపాయమూ నీ దరిదాపులకి రాదు!
నీ చిరనిద్ర ప్రశాంతముగా ఉండు గాక;
నీ సమాధి పేరు వహించును గాక!
.
(From Cymbalene)
షేక్స్పియర్
26 April 1564 (baptised) – 23 April 1616

Leave a reply to అనామకం స్పందనను రద్దుచేయి