వేళ్ళు అరిగి అరిగి నీరసించి
కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి
స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో
పాపం ఒక స్త్రీ, కూచుని
ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ
ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ
పేదరికంతో, ఆకలితో, మురికిలో
విషాదము నిండిన గొతుతో
ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది..
పని ! పని ! పని!
ఉదయం దూరంగా ఎక్కడో కోడికూయడం మొదలు
పని! పని ! పని!
రాత్రి చూరులోంచి నక్షత్రాలు కనిపించేదాకా!
అబ్బ! బానిసగా బ్రతకడం
అందులో ఒక మోటు, గర్విష్ఠి దగ్గర
ఈ పనే సేవ అనుకున్నప్పుడు
ఏ ఆడదానికీ మోక్షం లేదు..
పని! పని! పని!
తల తిరిగేదాకా పని!
ఓని! పని! పని!
కళ్లు బరువెక్కి చూపు మందగించేదాకా!
కుట్టూ, బకరం, పట్టీ,
పట్టీ, బకరం, కుట్టూ
చివరకి గుండీలమీద నిద్రొచ్చి వాలిపోయేదాకా!
ఇక కలల్లోనే వాటికి కుట్టడం..
ఇష్టమైన అక్కచెల్లెళ్ళున్న సోదరులారా!
తల్లులూ, భార్యలూ ఉన్న పురుషులారా!
మీరు ధరిస్తున్నది వస్త్రాలు కావు
అక్షరాలా సాటి జీవుల ప్రాణాలు!
కుట్టు– కుట్టూ- కుట్టు
పేదరికంలో, ఆకలిలో, మురికిలో
రెండు దారాలతో ఏకకాలంలో
ఒక పక్క చొక్కా, మరో పక్క కఫన్.
నేను చావుగురించెందుకు మాటాడుతున్నాను
భయంకరమైన ఎముకల పోగు గురించి?
నాకిప్పుడు ఆ వికృతరూపమంటే భయం లేదు,
అదిప్పుడు నాలాగే ఉంటుంది
అది అచ్చం నా లాగే ఉంటుంది
ఇప్పుడు నే చేసే కటిక ఉపవాసాలవల్ల;
దేముడా! ఎంత చిత్రం, రొట్టె అంత ఖరీదైపోయి
రక్త మాంసాలు అంత వెలతక్కువవీ అయిపోయాయా?
పని! పని! పని!
నా శ్రమకి అలుపన్నది లేదు;
దానికి కూలి ఏమిటి? గడ్డి పరుపు
ఒక రొట్టె ముక్క… నాలుగు గుడ్డపీలికలు.
అదిగో పాడుబడ్డ ఇంటి కప్పు- ఇదిగో వట్టి నేల
ఒక మేజా- విరిగిపోయిన కుర్చీ
ఖాళీ గోడ… అప్పుడప్పుడు కనీసం
నా నీడైనా దానిమీదపడుతోందని సంతోషిస్తాను.
పని! పని! పని!
పగలు లేచినదగ్గరనుండి రాత్రి అలసి
గంటకొట్టీదాకా పని! పని! పని!
ఖైదీలు నేరానికి శిక్షగా పనిచేసినట్టు!
కుట్టూ, బకరం, పట్టీ,
పట్టీ, బకరం, కుట్టూ
గుండె బలహీనమై, చేతికి స్పర్శపోయినట్టు
చివరకి మెదడుకూడా చచ్చుపడిపోయేదాకా!
పని! పని! పని!
కనీకనిపించని డిశంబరు వెలుతురులోనూ;
పని! పని! పని!
వాతావరణం వెచ్చగా వెలుతురు ఉన్నపుడూ;
ఇంటి చూరుల క్రింద
పొదగబోతున్న పిచ్చుకలు గూడుపెట్టి
వాటి మెరుస్తున్న మేనులు చూపిస్తూ
వసంతం రాగానే వెక్కిరిస్తూ పోతాయి.
ఓహ్! ఒక్క సారి ఆ మల్లెలానో,
సన్నజాజిలానో జీవిస్తే ఎంతబాగుంటుంది
నెత్తిమీద వినీలాకాశంతో
పాదాలకింద పచ్చని నేలతో
లేమి అంటే ఏమిటో బాధ తెలియక ముందు
ఒకపూట తిండికి ఎంతకష్టపడాలో తెలియక
ఒకప్పుడు నేను అనుభూతి చెందినప్పటిలా
ఒక ఘడియ సేపయితే మాత్రం ఏమి?
ఓహ్! క్షణికమైన ఒక గంట చాలు!
ఎంత చిన్నపాటి విశ్రాంతి దొరికినా చాలు!
ఆశకోసమో, ప్రేమకోసమో విరామం కాదు
కేవలం దుఖాన్ని వెళ్ళగక్కుకుందికి!
కాసేపు రోదించినా గుండెకొంత తేలికౌతుంది నాకు
కానీ కన్నీళ్ళతో తడిసిన ఆ పక్కమీదే
నా ఏడుపు ఆపుకోవాలి. ఎందుకంటే ప్రతి కన్నీటిచుక్కా
నా సూదినీ దారాన్నీ కనిపించకుండా అడ్డుపడుతుంది.
వేళ్ళు అరిగి అరిగి నీరసించి
కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి
స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో
పాపం ఒక స్త్రీ, కూచుని
ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ
ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ
పేదరికంతో, ఆకలితో, మురికిలో
విషాదము నిండిన గొతుతో
ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది.
ఈ పాట ధనికుల చెవుల సోకుతుందా?
.
థామస్ హుడ్
23 May 1799 – 3 May 1845
ఇంగ్లీషు కవి
![]()
ఇది ఊహాత్మక కథనం కాదు. Mrs Biddell అని లండనులో “Lambeth” అనే ఒక చిన్న సబర్బ్ లో దీనాతి దీన మైన పరిస్థితులలో మగ్గుతూ చొక్కాలు కుట్టుకుని జీవనం గడిపే స్త్రీ గురించి రాసిన కవిత ఇది. ఈ కవిత మొదటిసారి 1843లో “Punch” అనే పత్రిక క్రిస్మస్ సంచికలో మారుపేరుతో ప్రచురించబడింది. తక్షణమే బహుళప్రచారంలోకి రావడమే గాక, Mrs Biddell తోపాటు ఆమెలాంటి దుర్భరమైన జీవితం గడుపుతున్న అనేకమంది స్త్రీ కార్మికుల జీవితాలపై ప్రజల దృష్టి మళ్ళించేలా చెయ్యగలిగింది. ఆ రోజుల్లో ఇంగ్లండులో, మనదేశంలో బీడీ కార్మిక స్త్రీలలాగ, 2 పౌండ్లు డిపోజిట్ కడితే గాని స్త్రీలకు ఇంటిదగ్గర పేంట్లూ, చొక్కాలూ కుట్టే పని ఇచ్చేవారు కాదు. దానికి నామమాత్రం కూలి దొరుకుతుండేది. తన పిల్లలకి తిండి పెట్టలేని స్థితిలో తనుకుట్టే బట్టలనే కుదవబెట్టి తీర్చుకోలేని అప్పుతెచ్చుకుంది మగదక్షతలేని Mrs Biddell. అప్పుతీర్చలేకపోవడంతో చివరలి ఆమెను చట్టప్రకారం “Work house” కి తరలించారు. ఆమె గతి చివరకి ఏమయ్యిందో ఎవరికీ తెలీదు. అయితేనేమి, ఆమె జీవితం, వారానికి 7 రోజులూ కష్టపడుతున్నప్పటికీ తమ జీవితాలలో ఏ మార్పూ లేకుండా దుర్భరమైన పరిస్థితులలో నామమాత్రంగా బ్రతికే అనేకానేకమంది కార్మికుల జీవితాల ప్రక్షాళనకి ఒక వెలుగురేక అయింది.
అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతే కాదు, దుర్భరమైన పరిస్థితులలో బ్రతికే సాటి మనుషుల జీవితాలను చూసినపుడుకూడా కవిమనసు తాదాత్మ్యంతో ప్రతిస్పందించాలి.
.
వ్యాఖ్యానించండి