… నేను ఒంటరిగా సముద్రపొడ్డున నిలబడి ఆలోచిస్తున్నాను
దూసుకువస్తున్న కెరటాలు, అసంఖ్యాకమైన అణువులు
దేనిమట్టుకు అదే పిచ్చిపట్టినట్లు దానిపని అది చేసుకుంటూ
అంత వైరుధ్యంలోనూ కలిసి తెల్లని నురుగు సృష్టిస్తూ…
యుగాలు జగాలకి ముందు, ఏ కన్నూ దానిపై పడకమునుపు
ఇప్పటిలాగే, ఏళ్లతరబడి అలా ఒడ్డును బాదుతూనే ఉన్నాయి.
ఎందుకు? ఎవరికోసం? ప్రాణమన్న ఊసులేని
ఈ మృత గోళం మీద ఎవర్ని రంజింపడానికని?
పోనీ ప్రశాంతంగా ఉందా? అదీ లేదు.
రోదసిలోకి సూర్యుడు వృధాగా వదిలిన శక్తి అలా ఉండనీదు.
ఒక లవలేశమయినా చాలు, సముద్రం ఎగిసిపడడానికి.
సముద్రపులోలోపలి పొరల్లో, అణువులు చర్విత చర్వణంగా
రూపుదిద్దుకుంటున్నాయి కొత్తవి అందులోంచి తయారయేదాకా.
వాటికి అవే నకళ్ళు తయారుచేసుకుంటున్నాయి
ఒక కొత్త నాట్యహేలకి నాందీప్రస్తావన జరిగింది.
పరిమాణమూ, సంక్లిష్టతా పెంచుకుంటూ,
జీవరాశులు, అణు సమూహాలు, DNA, ప్రోటీన్లు
ముందటికంటే సంక్లిష్టమైన నాట్యభంగిమలు దాలుస్తూ
ఆ జలఊయలలోంచి, ఎండిపోయిన నేలమీదకి
ఇదిగో ఇప్పుడిక్కడ ఒకటి నిలబడింది:
స్పృహగల అణుసమూహం; కుతూహలం కలిగిన పదార్థం.
సముద్రపొడ్డున నిలబడి, అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడుతోంది.
విశ్వమంత పరమాణు సముదాయాన్ని,
నేను, ఈ విశ్వంలో ఒక పరమాణువుని.
.
రిఛర్డ్ ఫీన్మన్
May 11, 1918 – February 15, 1988
అమెరికను భౌతిక శాస్త్రవేత్త
.
Richard P Feynman
.
స్పందించండి