నేను కరక(1) చెట్టు పైకెక్కి
అక్కడ ఈకల్లా మెత్తగా ఉండే
ఆకుల గుబురుల్లో దాగేను.
నేనొక పాట కట్టేను అందులో ఏ పదాలూ లేనప్పటికీ
తెలియకుండా పాడసాగేను… చివరకి అది విషాదమైంది.
చెట్టుక్రింద గడ్డిలో పూలు విరగబూశాయి.
అవి ఏమంటాయో చూద్దామని
“నేను మీ తలలు కొరికి నా చిన్నారులకి
తినడానికి ఇస్తాను,” అన్నాను.
అవి నేను పక్షినంటే నమ్మలేదు;
అవి చాలా చక్కగా విచ్చుకునే ఉన్నాయి.
తెల్లని తూలికలతో కప్పిన నీలి గూడులా ఉంది ఆకాశం
సూర్యుడు దాన్ని వెచ్చగా ఉంచే తల్లి పక్షిలా ఉన్నాడు.
నా పాటలో మాటలు లేనప్పటికీ, చెప్పిన భావం అదే
మా తమ్ముడు ఒంటిచక్రపుబండి తిప్పుకుంటూ పొలంవైపు
పరిగెత్తుకుని వొచ్చాడు; నా దుస్తుల్ని రెక్కల్లా పరిచి నిశ్శబ్దంగా ఉన్నాను.
వాడు నా దగ్గరకు రాగానే, నేను “కుహూ కుహూ” అన్నాను.
వాడొక క్షణం సేపు బిత్తరపోయి చూశాడు;
తర్వాత, “ఫో! ఫో! నువ్వు పక్షివేం కాదు.
నాకు నీ కాళ్ళు కనపడుతునాయి.”
గడ్డిపూలు కాదంటే నేమి,
మా తమ్ముడు కాదంటే నేమి?
నాకు మాత్రం నేను పక్షినే అని అనిపించింది.
.
కేథరీన్ మేన్స్ ఫీల్డ్
(14 October 1888 – 9 January 1923)
న్యూజిలాండిష్ బ్రిటిష్ కవయిత్రి
(Note: 1 కరక (Karaka Tree ):
ఇది న్యూజిలాండుకి మాత్రమే పరిమితమై మెత్తని ఆకులతో బాగా పొడవుగా పెరిగే చెట్టు )

స్పందించండి