నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన ఆ క్షణం ఇంకా గుర్తే:
నా కళ్ళు అప్పుడే అలా ఎత్తి చూశాను, నువ్వు అక్కడ ఉన్నావు,
అపురూపమూ అరుదూ ఐన సౌందర్య రహస్యం
లిప్తకాలం కళ్ళముందు కదిలివెళిపోయిన అనుభూతి…
మూగ పరివేదనతో, నిరాశతో లోపలే ప్రార్థించుకున్నాను.
ప్రపంచమెప్పుడూ వృధా జీవిత ప్రయాసలనే గౌరవిస్తుంది.
ఊరడించే నీ పలుకులని చాలకాలం మనసులో భావించుకున్నాను,
నీ రూపం నా కలలని చాలకాలం వేధించింది.
కాలం గడిచిపోయింది. ఒక భయంకరమైన తుఫాను
నాకై నేను పదిలంగా చాచుకున్న స్మృతుల్ని చెదరగొట్టింది,
మనసుకి ఉపశాంతికూర్చగల నీ మాటల్నీ
సౌందర్యభరితమైన నీ దివ్యరూపాన్నీ మరిచిపోయాను.
దుఃఖభరమైన ఈ బలవంతపు ఒంటరి జీవితంలో
నాకోసం బ్రతికేవాళ్లుగాని, ఏడ్చేవాళ్లుగాని, నన్ను ప్రేమించేవాళ్లుగాని,
జీవితంపై ఉత్సాహాన్ని రగిలించగల ఆదర్శాలు గాని లేక
అలా ఆకాశం వంక నిరాశగా చూస్తున్నాను.
నన్ను పునర్జీవితుణ్ణి చేసిన క్షణం తటస్థించింది.
నేను కళ్ళెత్తి మళ్ళీ పైకి చూశాను. నువ్వు అక్కడ ఉన్నావు.
అపురూపమూ అరుదూ ఐన సౌందర్య రహస్యం
లిప్తకాలం కళ్ళముందు కదిలివెళిపోయిన అనుభూతి…
.
అలెగ్జాండర్ సెర్గెవిచ్ పుష్కిన్
6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837
రష్యను కవి.
.

- Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg
వ్యాఖ్యానించండి