గీతికలూ! పదండి ఇక్కడనుండి పోదాం; ఆమె ఇక వినదు.
మనం ఇక్కడ నుండి నిష్క్రమిద్దాం నిర్భయంగా;
మౌనంవహించండి, ఎందుకంటే మనకిష్టమైన విషయాలూ,
జ్ఞాపికలగురించి పాడే సమయం ముగిసిపోయింది.
మనం ఆమెని ప్రేమించినంతగా నన్నుగాని,మిమ్మల్ని గాని ఆమె ప్రేమించదు.
నిజం, మనం ఆమె చెవులకి గంధర్వగానం వినిపించినా
ఆమె వినేస్థితిలో లేదు.
లేవండి! లేచి ఇక్కడనుండి పోదాం; ఆమె కనీసం గుర్తించలేదు.
పెద్ద పెద్ద గాలులు పోయే సముద్ర తటివైపు పొదాం.
అక్కడ ఇసకా, నురుగూ ఎగురుతుంటై; మనకెవరు దిక్కు?
ఏ దిక్కూ లేదు? అన్ని విషయాలూ అలాగే ఉన్నాయి,
ప్రపంచమంతా ఒక కన్నీటిచుక్కలా, చేదుగా ఉంది.
ఈ విషయాలు ఎలా ఉన్నాయో చూపించడానికి మీరెంత కష్టపడ్డా
ఆమె గ్రహించ లేదు.
ఇక్కడనుండి ఇంటికి పోదాం; ఆమె ఏమీ ఏడవదు లెండి.
మనం ప్రేమనీ, ఎన్నో కలల్నీ, రోజుల్నీ ఇచ్చాం గుర్తుంచుకుందికి,
వాసనలేని జ్ఞాపకాల్నీ, మరోచోట మొలకెత్తలేని ప్రేమనీ ఇస్తూ
“నీ కిష్టమైతే, నీ కొడవలితో కోసుకో” మని చెప్పాం.
అంతా కోసుకోవడం అయింది; కొయ్యడానికి గడ్డి కూడా మిగలలేదు;
నాట్లు వేసిన మనమంతా, శాశ్వతనిద్రలోకి జారుకున్నా
ఆమె ఏమాత్రం శోకించదు.
ఇక్కడనుండి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుందాం; ఆమె ప్రేమించదు.
మనం ఇప్పుడు పాడినా ఆమె మన పాట వినిపించుకోదు,
ప్రేమ స్వభావాన్ని గుర్తించదు: ఎంతలోతుగా, బాధాకరంగా ఉంటుందో కదా
రండి. రండి. జరిగిందేదో జరిగింది. మనసు చిక్కబట్టుకోండి. ఇక చాలు!
ప్రేమ ఒక అపార గభీర నిష్ఫల నిరాశామయ పారావారం.
ఒక చక్కని పూవులో స్వర్గం సర్వస్వాన్నీ దర్శించినా
ఆమె ప్రేమించలేదు.
ఇక ఆశలు వదులుకుని మునిగిపోదాం. ఆమె లక్ష్యపెట్టదు.
నక్షత్రాలన్నీ ఈ సర్వంసహా ప్రకృతిని బంగారంగా మార్చినా,
ఒక చంద్ర-పుష్పం ఈ ఫేనకుసుమాలన్నిటినీ అందంగా చెయ్యడం
తను బయలుదేరడానికి ముందు చూసిన సముద్రం ఒక్కసారి పెల్లుబికి
ఆ కెరటాలన్నీ మనమీదనుండి ప్రవహించి, మనల్ని
ఆమె కేశపాతంలోంచి, పెదాలమీంచి ఊపిరాడకుండ తోసుకుపోయినా,
ఆమె పెద్దగా లక్ష్య పెట్టదు.
ఇక్కడనుండి పోదాం పదండి. పదండి. ఆమె చూడనైనా చూడదు.
అందరం కలిసి మరొకసారి పాడుదాం; ఆమె తప్పకుండా,
పాత రోజులూ, మాటలు గుర్తుతెచ్చుకుని ఆమెకూడా
మనవైపు ఒకసారి తిరుగుతుంది, నిట్టూరుస్తూ; కానీ, మనం
అప్పటికే ఇక్కడనుండి వెళ్లిపోయి ఉంటాం, అసలిక్కడికెన్నడూ రానట్టు.
కాదు, చూస్తున్నవాళ్లందరికీ నా మీద జాలి కలిగినప్పటికీ,
ఆమె మాత్రం గమనించనే గమనించదు.
.
A C స్విన్ బర్న్
5 ఏప్రిల్ 1837 – 10 ఏప్రిల్ 1909
ఇంగ్లీషు కవీ, నాటక కర్తా, నవలకారుడూ, విమర్శకుడూ.
.

స్పందించండి