మొన్న రాత్రి లెనాక్స్ అవెన్యూలో
పాలిపోయి, మసకబారిన పాత గాస్ దీపం ప్రక్కన.
స్వరాల్ని కుంచించి మత్తుగా కూనిరాగం తీస్తూ
ముందుకీ వెనక్కీ కమ్మని పాటతోపాటు ఊగుతూ
ఒక నీగ్రో పాట వాయించడం విన్నాను.
ఆ వేదనా గీతపు స్వరానికి …
అతను చాలా తీరుబడిగా ఊగేడు…
చాలా తీరుబడిగా తూగేడు…
ఆ దంతపు మెట్లమీద తన నల్లని చేతులతో
పాపం! ఆ పాత పియానో మాధుర్యంతో కేరేలా చేసేడు!
ఆహ్! ఎంత అందమైన గీతం!
ఆ పాడైన స్టూలుమీద ముందుకీ వెనక్కీ వివశంతో సోలుతూ
ఆ శిధిల శోక గీతాన్ని ఆలపించాడు ఒక సంగీతపు పిచ్చివాడిలా
ఎంత కమ్మని గీతం!
ఒక నల్లవాడి గుండెలోతుల్లోంచి వచ్చిన
అపురూప గీతం!
బాధాతప్త స్వరంలో హృదంతరాళంనుంచి వస్తున్న
ఆ నీగ్రో పాటనీ, పియానో మూలుగునీ విన్నాను…
“ఈ విశాల జగతిలో తోడులేరెవరూ
నాను నేనేతప్ప జోడులేరెవరూ.”
ధబ్ ధబ్ ధబ్ మని అతని పాదం నేలపై తాళం వేసింది
తర్వాత కొన్ని స్వరాలు ఆలపించి మళ్ళీ పాటని అందుకున్నాడు
“వేదన నన్నావహించింది
నా మనసుకిక శాంతి లేదు
వేదన నన్నావహించింది
నా మనసుకిక శాంతి లేదు
నాకిక సుఖం లేదు
నాకు మరణమే మెరుగనిపిస్తోంది.”
అర్థరాత్రి దాటేదాకా ఆ పాట పాడుతూనే ఉన్నాడు
నక్షత్రాలు సెలవుపుచ్చు కున్నాయి, వాటితోపాటే చంద్రుడూను.
పాట ఆపి గాయకుడు నిద్రకి ఉపక్రమించాడు
అతని తలలో ఇంకా ఆ పాటే మననం అవుతోంది.
అతను ప్రశాంతంగా… బండరాయిలా… శవంలా.. నిద్రపోయాడు.
.
లాంగ్స్టన్ హ్యూజ్
February 1, 1902 – May 22, 1967
అమెరికను కవి
-
Image courtesy: http://4.bp.blogspot.com

స్పందించండి