లౌకిక దృష్టితో నిండిన కనులు
పారలౌకికతలోని సుగుణాలు దర్శించలేవు;
పారలౌకికతగూర్చిన ఆలోచనలతో నిండిన కనులు
ఏకత్వంలోని సౌందర్యాన్ని చూడగల అవకాశం కోల్పోతాయి.
.
ఖ్వాజా ఆబ్దుల్లా ఆన్సారి.
(1006 – 1088)
ఆఫ్ఘనిస్థాన్, సూఫీ కవి
.
ఈ కవిత చిన్నదే అయినా మంచి సందేశం ఉంది.
భగవంతునిమీద తప్ప మిగతా అన్నివిషయాలనుండి మనసుని తప్పించడమే సూఫీ సిద్ద్ధాంతంలోని మూలభావన. ఈ ప్రపంచమే సత్యమనే భావన ఒకటి, ఈ ప్రపంచం అంతా మిధ్య నఏది ఒకటి రెండు భావాలు అప్పట్లో ప్రబలంగా ఉండేవని మనకు సులభంగా అర్థం అవుతుంది. ప్రపంచమే సత్యమనుకునే వారు, మరణానంతర జీవితంగురించిన కొన్ని సుగుణాలు చూడలేరు అనడంలో, అవి భావనలే అయినప్పటికీ, మంచికి బహుమానమూ, చెడుకి శిక్ష అన్న ప్రకృతిసిద్ధమైన న్యాయభావనని తోసిరాజంటారన్న ఆలోచన ఉంది. ఆ నమ్మకం లేకపోవడంవల్ల మనుషుల ప్రవర్తనలో, వైయక్తిక నైతిక భావనలో వచ్చే మార్పు సమాజానికి మంచిచెయ్యకపోవచ్చు. అలాగే, కేవలం పారలౌకిక భావనతో నిండినవారికి, ఈ రెండూ ఒక్కటే అన్న సత్యమూ, ప్రకృతే కైవల్యమూ అన్నభావన అవగతం కాదన్న ఎత్తిపొడుపూ ఉంది. సూఫీలు, అచ్చమైన మానవతా వాదులు. మార్మికత ఒక తొడుగు మాత్రమే.

వ్యాఖ్యానించండి