పక్షులు …విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి

అతడు:

 
నువ్వెక్కడ ఉంటున్నావు?  నీదే తోట?

సొగసైన దానా! ప్రియతమా!

ఏ సీమకైనా అందాన్నిచ్చేదానా! 

నీ సుందరమైన గూడు ఎక్కడ కట్టుకున్నావు?      
    

ఆమె:


అదుగో అక్కడ దూరంగా ఒంటరిచెట్టుందే,

అక్కడ నేనుంటున్నాను నీ కోసం జపిస్తూ;

పగళ్లు నా కన్నీరు త్రాగితే

రాత్రుళ్ళు నా వేదన గాలి మోసుకెళుతుంది.     

అతడు:


ఓ వసంత మాధురీ!

నేను నీకోసమే బ్రతుకుతూ శోకిస్తున్నాను

ప్రతి రోజూ తోట నా దుఃఖాన్ని నినదిస్తే

రాత్రి నా వేదనని దూరంగా వినిపిస్తుంది.     

ఆమె:


నువ్వు నిజంగా నన్ను కోరుకుంటున్నావా?

నేను నీకు నిజంగా అంత ఇష్టమా?

అయితే మన దుఃఖానికి భరతవాక్యం పలుకుదాం

ఓ ప్రియమైన చెలికాడా! నా స్నేహితుడా!
    
అతడు:


రా! పద! ఎత్తైన శిఖరమ్మీది నా పొదరింటికి

ఆనందపు రెక్కలమీద ఎగిరిపోదాం

పచ్చనాకుల గుబురుల్లో, సొబగైన పూలగుత్తుల మధ్య

నా గూటిలో హాయిగా సేద తీర్చుకో !    

.

విలియం బ్లేక్

(28 November 1757 – 12 August 1827)

ఇంగ్లీషు కవీ, చిత్రకారుడూ, ముద్రణా నిపుణుడూ.

విలియం బ్లేక్ పేద కుటుంబం నుండి వచ్చి, చాలా తంటాలుపడి చిత్రకళా, నగిషీపనీ నేర్చుకుని, అందులో అనుపమానమైన ప్రతిభా, పేరూ సంపాదించేడు. చాలా మంది కవుల కవిత్వానికి, ముఖ్యంగా  డాంటే Divine Comedy కి, థామస్ గ్రే An Elegy On The Country Churchyardకీ, రాబర్ట్ బ్లేర్ The Graveకీ గొప్ప ఇలస్ట్రేషన్స్ గీశాడు.

సరళమైన భాషలో మంచి కవిత్వం రాసేడు గానీ, విలియం బ్లేక్ జీవితకాలంలో కవిగా మాత్రం పెద్ద గుర్తింపుకు నోచుకోలేదు. అందరి కళాకారుల్లా అతను గొప్పభావుకుడూ, సున్నిత హృదయుడూ. అతని కవితల్లో The Tiger ఎక్కువ సంకలనాల్లో చోటుచేసుకుంది. అతని కవిత్వం తర్వాతి తరాల్లోనే బాగా ప్రచారానికీ, గుర్తింపుకీ నోచుకుంది.

ఈ కవితలో ఎడబాటైన రెండు పక్షులు తిరిగి కలుసుకున్నప్పుడు జరిగే సంభాషణని ఊహిస్తున్నాడు కవి.  వాటికి మానవప్రకృతి ఆపాదిస్తూ,  వాటికీ మనకీ పరస్పరానురాగం, ఆకర్షణ విషయాల్లో, స్పందనల్లోనూ, ఊహల్లోనూ అబేధాన్ని చూపిస్తున్నాడు.

.

The artist and poet William Blake, who lived i...
The artist and poet William Blake, who lived in Hercules Road — a portrait by Thomas Phillips (1807). (Photo credit: Wikipedia)

.

The Birds

He. Where thou dwellest, in what grove,
Tell me Fair One, tell me Love;
Where thou thy charming nest dost build,
O thou pride of every field!

She. Yonder stands a lonely tree,
There I live and mourn for thee;
Morning drinks my silent tear,
And evening winds my sorrow bear.

He. O thou summer’s harmony,
I have liv’d and mourn’d for thee;
Each day I mourn along the wood,
And night hath heard my sorrows loud.

She. Dost thou truly long for me?
And am I thus sweet to thee?
Sorrow now is at an end,
O my Lover and my Friend!

He. Come, on wings of joy we’ll fly
To where my bower hangs on high;
Come, and make thy calm retreat
Among green leaves and blossoms sweet.

.

William Blake

(28 November 1757 – 12 August 1827)

English Poet, Painter, Print Maker.