నా జవరాలు నాతో ఇలా అంది
“మా అమ్మ ఏమీ అనుకోదు
మా నాన్న నిన్ను చులకనచెయ్యడు
నీకు ఆస్తిపాస్తులేం లేవని.”
అంటూ నా పక్కనుండి తప్పుకుని పోతూ,
“మరెన్నాళో లేదు, ప్రియతమా,
మన పెళ్ళిరోజు. అందాకా,”
అని వీడ్కోలు చెప్పింది.
నానుండి వీడ్కోలు పలికి
ఆమె సంతలో తిరగ సాగింది.
పిచ్చిగా ఆమేవంకే చూడసాగేను
ఆమె అటూ ఇటూ తిరుగుతుంటే.
ఒక్క చుక్క మిగిలుందనగా
ఇంటిముఖం పట్టింది చివరకి
సెలయేటి అలలలమీద సాయంవేళ
రాజసంగా విహరించే హంసలా.
మనుషులనుకోవడం విన్నాను
ప్రపంచంలో ఏ జంటా లేదు
ఒక్కరికే ఒక దుఃఖం ఉండి
రెండోవారికి చెప్పుకోనిది.
దుస్తులూ, సామాన్లూ కొనుక్కుని
ఆమె వెళుతుంటే చూసి చిరునవ్వు నవ్వేను.
అంతే! అదే ఆఖరుసారి
నా ప్రియురాలిని చూసింది
నిన్న రాత్రి ఆమె నా దగ్గరకి వచ్చింది,
నా దివంగత ప్రేయసి లోనికి వచ్చింది
ఎంత మెత్తగా నడుచుకుంటూ వచ్చిందంటే
ఆమె అడుగులు ఎంతమాత్రం చప్పుడుచెయ్యలేదు.
ఆమె నా తల మీద చెయ్యివేస్తూ
ఆమె ఈ విధంగా నాతో అంది:
“”మరెన్నాళ్ళో లేదు, ప్రియతమా,
మన పెళ్ళిరోజు. అందాకా “
.
పెడ్రాక్ కోలం
(8 December 1881 – 11 January 1972)
ఐరిష్ కవి
మనకంటే, గత రెండు మూడు శతాబ్దులలో, జానపదసాహిత్యాన్ని కాపాడుకోవడంలో, ముఖ్యంగా మౌఖిక సాహిత్యాన్ని కాపాడుకోవడంలో యూరోపియనులు ఇంగ్లండునుండి బాగా నేర్చుకున్నారు. ముఖ్యంగా ఐరిష్, స్కాటిష్ సాహిత్యంలో జానపద సాహిత్యం, మౌఖిక సంప్రదాయం ఒక విశిష్టమైన విభాగం.
మన గాథా సప్తశతిలోలా ఇక్కడకూడా చిన్నకవితల్లో పెద్ద కథ చెప్పబడుతుంది. ఈ కవితలో రోమియో జూలియట్ లో “Till it be morrow” అనిచెప్పుకుంటూ తియ్యనికలలు కంటూ విడలేక విడలేక విడిపోయిన నాయికానాయకుల్లా, ఇందులో కూడా మనపెళ్ళిరోజు ఎంతోదూరం లేదు మళ్ళీ కలుసుకుందాం” అనుకుంటూ శలవు తీసుకున్న ప్రేయసీ ప్రియులు మరి బ్రతికుండగా కలవరు. ఇందులో జాగ్రత్తగా గమనించవలసిన పాదాలు రెండున్నాయి. మొదటిది మనుషులనుకోవడం విన్నాను / ప్రపంచంలో ఏ జంటా లేదు /ఒక్కరికే ఒక దుఃఖం ఉండి /రెండోవారికి చెప్పుకోనిది. అన్వయంలో, నిజమైన జంటలమధ్య దాపరికలూ, రహస్యాలూ ఉండకపోవడమే కాదు, వాళ్ళకి రెండుకష్టాలూ, రెండుసుఖాలూ ఉండవు. కష్టమూ సుఖమూ ఇద్దరికీ ఒక్కటే. అలా లేనివాళ్ళు దంపతులు కాదు… అనిభావము.
రెండోది: ఒక్క చుక్క మిగిలుందనగా / ఇంటిముఖం పట్టింది చివరకి / సెలయేటి అలలలమీద సాయంవేళ /రాజసంగా విహరించే హంసలా. ఈ ఒక్క చుక్క మిగిలి ఉండడం అన్నది అర్థం చేసుకోవాలంటే, ఈ సంత సామాన్యమైన సంత కాదనీ, కార్నివాల్ లాంటిదనీ, అది తెల్లవార్లూ జరుగుతోందనీ, కథానాయిక ఒక్క చుక్క ఉండగా అంటే, సూర్యోదయమవబోయేవరకూ ( తెల్లవారుతుంటే అన్ని చుక్కలూ కనుమరుగైపోతాయి గాని, ఒక్క వేగుచుక్క, లేదా శుక్ర గ్రహం మాత్రం బాగా కాంతివంతమైనదవడం వల్ల సూరునివెలుతురువచ్చేదాకా సుమారుగా కనిపిస్తుంది.) తిరిగి తిరిగి ఇంటిముఖం పట్టిందని అర్థం చేసుకోవాలి. ఆ తిరగడం ఊరికే కాకుండా, Goods and Gear కొనుక్కుంది. అంటే పెళ్ళి దృష్టిలో పెట్టుకుని బట్టలు కొనుక్కుందన్నమాట.
అయితే అన్ని విషాద ప్రేమ గాధల్లాగే, ఏమయిందో తెలీదు. ఆమె చనిపోతుంది. అయినా నాయకుడు మరణశయ్యపై ఉన్నప్పుడు మళ్ళీ కలుస్తుంది. మరుజన్మలో కలుస్తామని. అది ఎంతో దూరం లేదని చెప్పడానికి. ఒక చిన్న కాన్వాసులో పాఠకుడు తనకు తోచింది ఊహించుకుందికి అవకాశమున్న కథ ఇది.
.

.
వ్యాఖ్యానించండి