మీ నాన్న నిండా ఐదు నిలువుల లోతులో ఉన్నాడు
పగడాలు అతని ఎముకలతోనే తయారవుతాయి;
ఆ మెరుస్తున్న ముత్యాలు అతని కన్నులే
అతనికి సంబంధించినవేవీ కళావిహీనమవవు
బదులుగా,ఒక అద్భుతమూ అపురూపమూ
ఐన వస్తువుగా రూపుదాలుస్తాయి;
జలదేవతలు అతని స్మృతిలో గంట గంటకీ
సంగీతం ఆలపిస్తుంటారు.
అదిగో విను!
నాకు వినిపిస్తోంది … గంట గణగణ.
.
షేక్స్ పియర్
విలియం షేక్స్పియర్ అందరికీ ఒక గొప్ప నాటక కర్తగా పరిచయం. ఆ రోజుల్లో కవిత్వ సంప్రదాయం అంతా నాటక బద్ధమే. అంటే కవి తన కవితాప్రతిభని ప్రదర్శించడానికి నాటకమే ఒక మాధ్యమం. షేక్స్పియర్ అందుకే నాటకాలలో ఎక్కడ అవకాశం వచ్చినా విడిచిపెట్టక తన భావుకతని ఉదాత్తమైన ప్రమాణాలకు తీసుకెళ్ళేడు. ఈ కవితలో మొదటి రెండు వర్ణనలూ జాషువాగారి శ్మశానవాటిలో
” … ఒకానొకనా డల కాళిదాస భారవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంతలేసి రేణువులయి మృత్తికన్ గలసెనో గద కుమ్మరివాని సారెపై”
అని ఊహించినంత మధురంగానూ ఉన్నాయి.
అతని సానెట్లు గాని, హామ్లెట్ లో ప్రథానపాత్రద్వారా వేర్వేరు సందర్భాలలో పలికించిన కవిత్వం, వేదాంతంగాని, పొలోనియస్ తనకొడుకు చదువుకు పారిస్ వెళుతున్నప్పుడు ఇచ్చిన హెచ్చరికలు గాని (Polonius’ advice to his son), Merchant of Venice లో పోర్షియా చిత్రాన్ని వెతుక్కునే సందర్భంలో వరులు చేసే విశ్లేషణలుగాని, కోర్టుసీనులో సాటి జీవులపై మనిషి అసలు ఎందుకు కరుణచూపించాలి అని షైలాక్ అడిగినప్రశ్నకి సమాధానంగా చెప్పిన “Quality Of Mercy” (కరుణతత్త్వం) పద్యం గాని, As You Like it లోని All The World is a stage అన్న కవితగాని, ఇలా ఒకటేమిటి ప్రతి నాటకంలోనూ అతని కవిత్వ ప్రతిభ చూపించేడు. నిజానికి ఇలాంటివన్నీ ఒకచోట చేర్చితే, మనిషి తనజీవితంలో అనుభవించే అన్నిరకాల అనుభూతులలో, అవస్థలలో ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా, ఒక రసావిష్కరణ చేసేడని మనకి అర్థం అవుతుంది. సాహిత్యం మనుషులని సంస్కరించలేకపోవచ్చునేమో గాని, వ్యక్తి సంస్కరించబడడానికి అనువైన వాతావరణం సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
.

వ్యాఖ్యానించండి