కరకు నేల ప్రేమ మయమైన హృదయాలను కప్పిపుచ్చడానికి నేనింకా అలవాటు పడలేదు;
కానీ నిన్నా, నేడూ, రేపూ, అనాదినుండీ అలాగే జరుగుతోంది.
పండితులూ, స్ఫురద్రూపులూ చీకట్లో కలిసిపోతారు. పూలహారాలతో
లిల్లీలతో అలంకరింపబడి మరీ వెళతారు; అయినా అంగీకరించబుద్ధి కావటం లేదు.
ప్రేమికులూ, ఆలోచనా పరులూ అంతా నీతోపాటే మట్టిలోకి…
ఏ తేడాలూ తెలియని రసహీనమైన మట్టిలో అంతా ఒకటైపోతారు.
నీకు తెలిసినదీ, నువ్వు అనుభవించినదాంట్లో ఒక లేశం,
ఒక కొండగుర్తు, ఒక పేరు మాత్రం మిగిలి… ఉత్తమమైనది మట్టిపాలౌతుంది.
చటుక్కున వచ్చే సూటి సమాధానాలూ, నిజాయితీ ఐన చూపులూ, ఆ నవ్వూ, ఆ ప్రేమా…
అన్నీ కనుమరుగౌతాయి. అవి గులాబులకు ఎరువవడానికి పోతాయి. అందంగా వంకీలు తిరిగి
విచ్చుకుంటాయి. పువ్వులు సువాసనవేస్తాయి. నాకు తెలుసు. అయినా, అంగీకరించలేను.
ప్రపంచంలోని అన్ని గులాబులకంటే, నీ కంటి లోని వెలుగే మిన్న
ఆ సమాధి చీకటి కుహరంలోనికి లోతుగా, లోలోతుగా
నెమ్మదిగా దిగుతారు… సుందరులూ, సుకుమారులూ, సుమనస్కులూ;
గుట్టుచప్పుడుకాకుండా పోతారు… వివేకులూ, వాక్చతురులూ, వీరులూ.
నాకు తెలుసు. కానీ, నేనంగీకరించలేను. నేనింకా సిద్ధంగా లేను.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు 1950,
అమెరికను కవయిత్రి, నవలా కారిణి.
.

స్పందించండి