దేశపు ఖజానా నిండుకుందని ఎవరన్నారు,
తమకు రావలసిన చెల్లింపులు రావేమోనని ఎవరికి భయం,
ఒకప్పటి మన చారిత్రక సంపద అంతా
ద్రవ్యంగా మార్పిడిచెయ్యడానికి నిశ్చయించుకున్నప్పుడు?
గడ్డురోజులు వచ్చినా, వ్యాపారం మందంగా ఉన్నా,
బొగ్గూ, ప్రత్తీ తమవిలువకోల్పోయినా,
మనకి మారకం చేసుకుందికి ఇంకా మిగిలే ఉంది…
మనకి వారసత్వంగా వచ్చిన గత చరిత్ర.
ఇప్పటికీ ఇంకా ఏ మహారాజుదో, దేశనాయకుడిదో
చివికి, మన్నైన శరీరమున్న సమాధులేన్నో ఉన్నాయి;
అమ్మకానికి పెట్టడానికి షేక్స్పియర్ ఇల్లుంది,
మిల్టను ఇల్లు దానికి తగ్గధర పలుకుతుంది.
క్రాం వెల్ యుద్ధంచేసిన కత్తికి ఎంతచెబుతావేమిటి?
ప్రిన్స్ ఎడ్వర్డ్ యుద్ధచిహ్నాల కోటు ఎంతేమిటి?
మరి సాక్సన్ రాజు ఎడ్వర్డ్ సమాధిసంగతో?
ఇవన్నీ అమ్మకానికే!
ఇప్పటి అవసరానికి పనికిరాని
సమాధులూ, శిలాఫలకాలూ అమ్మేయొచ్చు;
ఎడ్వర్డ్ III విండ్సర్ ఉండనే ఉంది,పాతదన్న ముద్రతో,
థామస్ వోల్సీ భవనానికి తిరుగులేదు.
సెయింట్ క్లెమెన్స్ డేన్స్ చర్చీ, మరో యాభై గుళ్ళూ గోపురాలూ
శిగిలాలూ, ప్రాకారాలూ తో సహా
వీటికి ఎంత ధర చెబుతారో?
దయచేసి వాటి ధర చెప్పరూ?
కానీ, బ్రిటిషుపౌన్లలోనే చెప్పాలి.
*
ఓరి మారుబేరగాళ్లలారా! డబ్బుకొనలేనివి
ఉన్నాయని మీకింకా అవగాహన కాలేదా?
మనం చనిపోయినతర్వాత సమాధిలో
కొయ్యబారి, గుడ్లుతేలేసి పడుక్కోవచ్చుగాక
కానీ మన అంతరాంతరాల్లో ఎక్కడో ఓ మూల
ఈ ద్వీపపు చారిత్రక కథనాల గురించి
ఒకతపన ఉంటుందని తెలుసుకోలేరూ?
మనం మన కృషిని అమ్ముకోవచ్చు,
గతిలేకపోతే జీవితాల్ని అమ్ముకోవచ్చు
కానీ ఎన్నటికీ మన కీర్తిప్రతిష్టలని అమ్ముకోం.
పొండి. చచ్చినగొడ్లను అమ్ముకునే సంతలో
అవసరం తీరిపోయిన గుర్రం ఉంటే అమ్ముకొండి.
కోడెవయసులో మీకు సేవచేసిన వాడు
ఆకలితో అలమటిస్తుంటే వాణ్ణి సమాధికి అంకితం చెయ్యండి!
కానీ, ఈ దేశపు ఆస్థులపై చెయ్యివేసేటప్పుడు
ఉదాత్తంగా ప్రవర్తించండి. ఒళ్ళుదగ్గరపెట్టుకొండి.
నా మాట వినండి! మా నెల్సన్ ఒడని
తిరిగి వెనక్కి తీసుకురండి.
మీకు దాన్ని లంగరువెయ్యడానికి
ఇక్కడా అక్కడా ఏ రేవులోనూ చోటు దొరక్కపోతే,
ఆ మూడంతస్థుల నౌకని తిన్నగా
సముద్ర మధ్యంలోకి తోసుకెళ్ళండి,
అక్కడ దాని బావుటా రెపరెప ఎగురుతుంటే
దానికి లాంఛనంగా వీడ్కోలు పలికి
వేల నిలువులలోతుకి నిలువునా ముంచి
దాన్ని అలా అక్కడే ఉండనీండి.
.
సర్ ఆర్థర్ కానన్ డోయల్
22 May 1859 – 7 July 1930
ఇంగ్లీషు కథారచయిత
.
సర్ ఆర్థర్ కానన్ డోయల్ పేరు చెప్పగానే మనకి గుర్తుకు వచ్చేది షెర్లాక్ హోమ్స్. అతని ఇతర సాహిత్య వ్యవసాయమంతా ఆ పాత్ర ముందు దిగదుడుపు అయిపోయింది. కానీ ఈ కవితమాత్రం కలికితురాయి. (ఈ కవిత అతనిది కాదన్న వాళ్లు ఉన్నారు గాని, ఇప్పటివరకు దానికి తగిన ఆధారాలు దొరకలేదు).
ఏ దేశం అయినా ఆర్థికంగా బీదదవొచ్చునేమో గాని … దాని సాంస్కృతిక చరిత్ర ఎన్నడూ బీదది కాదు. నిజానికి ఎంత అభివృద్ధిచెందిన దేశమైనా దాని చరిత్రగతిలో గొప్పటడుగులతో పాటు తప్పటడుగులు వెయ్యకుండా పైకిరాలేదు. ఆ తప్పటడుగుల్ని సరిదిద్దుకోవడంలోనూ, గొప్పటడుగుల్ని అనుసరించడంలోనే ఆ దేశ ప్రజల నిబద్ధత, అంకితభావం ఆ దేశాన్ని ముందువరుసలో నిలబెడతాయి. తగిన పరిశోధన, పరిశ్రమ చెయ్యాలి గాని, ఆ దేశ చరిత్రను నిలబెట్టే సాక్ష్యాలూ ఎప్ప్పుడూ ఉండనే ఉంటాయి. కాకపోతే అవి తాత్కాలికంగా మేథావుల నిర్లక్ష్యానికి గురికావచ్చు, లేదా కొందరు స్వార్థపరులు వాటిని పైదేశాలకు అమ్మి డబ్బుగా మార్చుకోవచ్చు. ఏ దేశపు చరిత్ర అయినా ఆదేశానికీ ఆ ప్రజలకీ విలువైనదే. అది ఆ దేశపు ప్రకృతివనరు లాంటిది. రాబోయే తరాలకి ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇవ్వగలిగిన జీవనాడి అది. దానిని రాబోయే తరాలకు సవ్యంగా భద్రపరచి అందివ్వాలి తప్ప, తక్షణం లభించే లాభాలకి అమ్ముకుని సొమ్ముచేసుకో కూడదు. అలాంటి చర్యలు ఏ ప్రభుత్వం చేసినా చూసినపుడు కవికి ధర్మాగ్రహం రావాలి.
Horatio Nelson, 1st Viscount Nelson ట్రఫాల్గర్ యుద్ధంలో నాయకత్వం వహించి నడిపిన HMS Foudroyant అన్న నౌకని వెయ్యి పౌండ్లకు జర్మనులకు అమ్మినపుడు, బ్రిటిషు మహరాణీ వారి నావిక సలహాదారులని సంభోదిస్తూ Sir Arthur Conon Doyle చెప్పిన కవిత. ఈ ధర్మాగ్రహం మొతాదుమించని మాటలతో, ఆవేశంతో, ఈ కవితలో చక్కగా చూపెట్టబడింది.
స్విన్ బర్న్ కవికి అనుకరణ అయినప్పటికీ, శ్రీశ్రీగారు “ఏవి తల్లీ నిరుడుకురిసిన హిమసమూహములు” అన్న కవితలో దేశచరిత్రలోని ఒక పార్శ్వాన్ని స్పృశించారు.
ఈ దేశపు భావిపౌరులకి కూడా ఇక్కడి వనరులపై అధికారాలుంటాయనీ, వాటిని ఒక క్రమ పద్ధతిలో వాడుకోవాలి తప్ప ప్రగతి పేరుతో తక్కువ వ్యవధిలోనే కొల్లగొట్టకూడదన్న విషయాన్ని మరిచి, ఈ తరం నాయకత్వాలు అపురూపమైన భౌతికవనరులను తమ తక్షణప్రయోజనాలకు వాడుకోవడం చూస్తున్న ఈ దేశప్రజలకు ఇలాంటి ధర్మాగ్రహం ఎప్పుడు వస్తుందో?

వ్యాఖ్యానించండి