(JS/07/M/378 స్మృతిలో ఈ పాలరాతి విగ్రహం ప్రభుత్వంచే నెలకొల్పబడింది)
.
గణాంకశాఖ సేకరించిన సమాచారం ప్రకారం
ఇతని మీద అధికారికంగా ఏ రకమైన ఫిర్యాదులూ లేవు.
అతని నడవడి గురించి వచ్చిన అన్ని నివేదికలూ అతను
‘ఋషి’ అనే ప్రాచీన శబ్దానికి ఆధునిక నిర్వచనం అంటున్నాయి.
ఎందుకంటే, అతను చేసిన ప్రతీదీ విశాలసమాజానికే అంకితం.
యుద్ధ సమయంలో తప్పితే, అతను పదవీ విరమణచేసే వరకూ
అతనొక కర్మాగారంలో పనిచేశాడు, ఏనాడూ తొలగించబడలేదు.
అతను తన యజమానులు … ‘ఫడ్జ్ మోటార్స్ కంపెనీ’ ని సంతృప్తిపరచేడు.
అలాగని అతను కార్మికసంఘవ్యతిరేకి కాదు, విపరీత భావాలు లేవు;
అతని యూనియన్ నివేదిక ప్రకారం అతను బకాయిలన్నీ చెల్లిస్తున్నాడు
(మా అంచనాలప్రకారం వాళ్ళ కార్మిక సంఘం ఆర్థికంగా బాగానే ఉంది)
మా సామాజిక మనస్తత్త్వ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం
అతనికి సహోద్యోగుల్లో మంచిపేరు ఉంది; కలివిడిగా ఉంటాడు కూడా.
పత్రికారంగం ప్రతిరోజూ పత్రిక కొంటాడని విశ్వసిస్తోంది
ప్రకటనలపట్ల అతని స్పందన ఎలా చూసినా, విపరీతంగా లేదు.
అతనిపేర తీసుకున్న పాలసీలు అతనికి పూర్తి భీమా రక్షణ ఉందని ఋజువుచేస్తునాయి
అతని ఆరోగ్యపత్రం తనొకసారి ఆస్పత్రిపాలై, తగ్గేక ఇంటికెళ్ళేడని చెబుతోంది
ఉత్పత్తిదారుల పరిశోధనలూ, ఉన్నత స్థాయి జీవన సరళీ
అతను వాయిదా చెల్లింపుపథకాల పట్ల బహుజాగరూకుడని తెలియజేస్తున్నాయి
అతనికి ఆధునిక మానవుడికి ఆవశ్యకమైనవన్ని ఉపకరణాలూ ఉన్నాయి:
ఫొనూ, రేడియో, కారూ, ఫ్రిజిడేరూ వగైరా వగైరా.
ప్రజాభిప్రాయాన్ని సేకరించే మా పరిశోధకులు, అతను
కాలానికి తగిన అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు సంతృప్తి ప్రకటిస్తున్నారు;
శాంతి నెలకొన్నప్పుడు అతను దానిపక్షం; యుద్ధం వచ్చినపుడు అటు వెళ్ళేడు;
అతను వివాహం చేసుకుని జనాభాకి ఐదుగురు పిల్లలని జతచేసేడు
అతని తరానికి ఆ సంఖ్య సరియైనదని, మా వంశవృద్ధి శాస్త్రవేత్త అంటున్నాడు.
ఉపాధ్యాయులు అతనెప్పుడూ వాళ్ల బోధనలలో జోక్యం చేసుకోలేదని అంటున్నారు.
అయితే, అతను స్వతంత్రుడా? అతను సుఖపడ్డాడా? అదేమిటి ఆ పిచ్చి ప్రశ్న?
ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మేమీపాటికి విని ఉండే వాళ్లం కాదూ?
.
W H ఆడెన్
21 February 1907 – 29 September 1973),
ఆంగ్ల కవి.
ఈ కవితలో ఉన్నంత పదునైన వ్యంగ్యం చాలా అరుదుగా కవిత్వంలో కనిపిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం పౌరుల్ని మనుషులుగా కాక అంకెలుగానో, ఓట్లుగానో, UID (ఆధార్ కార్డ్) నంబర్లుగానో గణాంకాలలోకి అనువదించి, బాధ్యతగలపౌరుల ప్రవర్తనని కొన్ని ప్రమాణాలలో కుదించి చూస్తుంది అన్న విషయాన్ని కవి చాలా ఘాటుగా చెప్పాడు. ముఖ్యంగా చివరి రెండు వాక్యాలూ గమనించ దగ్గవి. ప్రజల సుఖాన్ని కొలవడానికి గణాంకాలు కావు; గణాంకాలు చెప్పినదే ప్రజల సుఖం. దారిద్య్రరేఖ కిదిగువన ఎక్కువమంది ప్రజలుంటే తమకి అవమానంగా భావించే ప్రభుత్వాలు వారి ఆదాయాన్నీ జీవన ప్రమాణాల్నీ పెంచే దిశలో ప్రయత్నాలు చెయ్యకుండా, దారిద్య్రాన్ని నిర్వచించే అంకెని క్రిందకి తీసుకుపోవడం … అచ్చంగా ఈ కవితలోని ప్రభుత్వాల మనస్థితిని సూచించడం లేదూ? అన్నిటినీ ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వాలు, ప్రభుత్వాన్ని నడపడం కూడా ఎందుకు ప్రైవేటు పరం చెయ్యకూడదు? అతితక్కువ ప్రభుత్వవ్యయంతో ప్రభుత్వాన్ని నడపగల నేతలని మనం ఎంచక్కా ఎన్నుకోవచ్చు.
.

వ్యాఖ్యానించండి