తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన యువకుడు
తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన పిల్లని చూసి
ఎంతో పరవశించాడు.
తనలోతాను నిమగ్నమైపోయిన ఆ అందమైన పిల్ల
తనలోతాను నిమగ్నమైపోయిన,ఈ అందమైన ఈ యువకుడిని చూసి
ఎంతో పరవశించింది.
ఆ పరవశంలో ఇలా అనుకున్నాడు:
నాకంటే కూడా ఎక్కువగా ఆమె తనలో తాను నిమగ్నమై పోయింది.
చూడాలి. ఆమె ఏకాగ్రతని భంగం చేసి
ఆమె నా వంక చూసేలా చెయ్యగలనో లేదో.
ఆ పరవశంలో ఆమె కూడా ఇలా అనుకుంది:
నాకంటే కూడా ఎక్కువగా అతను తనలో తాను నిమగ్నమైపోయాడు.
చూడాలి. అతని ఏకాగ్రతని భగ్నం చేసి
తను నా వంక చూసేలా చెయ్యగలనో లేదో.
అలాగ ఇద్దరూ ఒకరినొకరు ఆరాథనగా చూసుకుంటూ
చివరికి
ఇద్దరూ కలవరంతోనే గడిపేరు. ఎందుకంటే
పరవశించడంలోనూ, స్వప్రయోజనమాశించడంలోనూ ఎవరూ తీసిపోలేదు.
.
డి. హెచ్. లారెన్స్
(11 September 1885 – 2 March 1930)
ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ, వ్యాసకర్తా, నాటకకర్తా, సాహితీ విమర్శకుడూ, చిత్రకారుడూ
ఈ కవితలో సున్నితమైన వ్యంగ్యం ఉంది. ఈ కవితలోని యువతీ యువకులిద్దరూ ఒకరి అందాన్ని ఒకరు గుర్తించి ఆనందించడానికి బదులు, తమ అందం అవతలి వాళ్ళని ఎంతమేరకు లోబరచుకోగలుగుతుందో అంచనా వేసే ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు. అందుకనే వాళ్ళు Restless గా మిగిలిపోయారు. అదే ఒకరి అందాన్ని ఒకరు ఆశ్వాదించగల మానసిక ప్రవృత్తిలో ఉండిఉంటే, ఇద్దరూ సుఖంగా ఉండగలిగే వాళ్ళేమో.
ప్రేమించడంకన్నా, ప్రేమిస్తున్నామన్న భ్రమలో చాలామంది గడుపుతారు. అంతర్లీనంగా తమ ప్రేమ లక్ష్యం అవతలివ్యక్తి కాకుండా, తామే అవడంలోనే ఈ అసంతృప్తికి కారణమవుతుందేమో. దీనినే కవి అచ్చమైన ప్రేమ అన్న మాట ద్వారా ఆక్షేపించదలుచుకున్నాడేమో.
.

Leave a reply to ఏ.సూర్య ప్రకాశ్ స్పందనను రద్దుచేయి