వయసు వాలిన స్త్రీ … సారా టీజ్డేల్, అమెరికను
.
ఆమెని బ్రాడ్వేలో కారులో చూసేను
బహుశా నే నా స్త్రీలా మారుతా నేమో
నా సఖుడు ఆమెవంక చూసి ఎందుకో
అకస్మాత్తుగా నా వంక తిరిగినట్టనిపించింది.
ఆమె తలకట్టు కాంతిలేక కళతప్పి ఉంది
కానీ ఆ రంగు నా జుత్తురంగులాగే ఉంది
చిత్రంగా కళ్ళుకూడా నా కళ్ళలాగే ఉన్నాయి
ఏ నాడూ ప్రేమకినోచుకుని మెరిసినవి కావవి.
ఆమె శరీరం వడలి పుల్లలా అయిపోయింది
బహుశా ఎన్నడూ దొరకని ప్రేమకై తపిస్తూ;
ఆమె మనసు చీకటిలోనే గడ్డకట్టుకుపోయింది
ప్రేమజ్వాల వెచ్చదనం దాన్నెన్నడూ తాకక.
నా సఖుడు ఆమెవంక చూసి ఎందుకో
అకస్మాత్తుగా నా వంక తిరిగినట్టనిపించింది;
అతని కళ్ళలోని ఇంద్రజాలాన్ని ఎదిరించగల
స్త్రీని మాత్రం నే నెన్నడూ కాలేను.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను
.
