1
.
డాక్టరు హెచ్చరించాడు:
“ఈ అలవాటు మీరు మానుకో పోతే,
మీ లివరు చెడిపోతుంది.”
“ఈ పువ్వు ఎప్పుడో రాలిపోయింది డాక్టర్!”
అన్నాను నేను.
“నువ్వీ అలవాటుకి బానిసవైపోతే,
నువ్వు నాకు దక్కవు,” అంటుంది గ్రేసీ.
“ఇప్పటికే నన్ను నే పోగొట్టుకున్నాను,” బదులిస్తాను నేను.
తర్వాతవంతు నా కథక మిత్రుడిది
“నిన్ను నేనొక పొగతాగే పాత్రగా చూడలేనురా!”
“అసలు నాలాంటి హీరోని నీ కథలో
ఉంచకుండా ఉంటే సరిపోయేది కదరా!”
“చూడు, నీ పెదాలు ఎంత నల్లగా అయిపోయాయో,”
ఆమె చెవిలో గుసగుస లాడుతుంది.
“ఏం చెయ్యను? పొగకంపుకొట్టే పెదాలైనా
నన్ను ముద్దుపెట్టుకోడానికి రావు”
“నిన్ను నువ్వెందుకు అలా
నాశనం చేసుకుంటున్నావు?” జినూ ప్రశ్న.
“ఎందుకంటే, ఇతరుల్ని నాశనం చెయ్యడం
ఎలాగో తెలీక.” నా సమాధానం.
“RTC బస్సులు వేళకి రాక నాకీ సిగరెట్టు అలవాటయింది”
ఒక అపరిచితుడి సంజాయిషీ.
నా మొదటి అనుభవం గుర్తొచ్చి వెంటనే అన్నాను:
“మొదటిసారి చీకట్లో వెలుగు కోసం ముట్టించేను.”
మా చెల్లెలు “వాళ్ళంతా నిన్ను చెయిన్ స్మోకర్ వని
ఆడిపోసుకుంటున్నారు,” అని బాధపడుతుంది
“నిప్పులేకుండా పొగరాదమ్మా,”
అని సమాధానపరచడానికి ప్రయత్నిస్తాను నేను.
హాస్పిటలుగదిలో గోడమీద ఇలా రాసుంటుంది:
“ఇక్కడ పొగత్రాగరాదు.”
“అయితే మిగతా పనులన్నీ చెయ్యొచ్చా?”
అడుగుతాను నేను.
“ఈ రకమైన ఆత్మహత్యాసదృశమైన చర్యని
ప్రభువు క్షమించడు,” అంటాడు మా పారిష్ ప్రీస్ట్.
నేనొకటిమాత్రం ఖచ్చితంగా చెప్పగలను:
“మేఘాలు దేముడి సిగరెట్టునుండే సృష్టించబడ్డాయి.”
2
ఏకాంతం మోహరించిన ఈ చీకటిరాత్రి
“ప్రభూ! మనసున్న ఒక సిగరెట్టుని ప్రసాదించు!
నన్ను మేఘాల అంచుల్ని చేరుకోనీ!”
.
మలయాళ మూలం: కుఝుర్ విల్సన్
ఆంగ్లానువాదం: అజు అబ్రహాం.

Image Courtesy: Poetrans.wordpress.com
Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి