The Gold Seekers… Hamlin Garland, American
కలలుగనే ఈ “కలాకారులు” పక్కనుంచి వెళ్ళడం చూశాను
వాళ్ళ అడుగులవెనక కొంత దూరం నడిచాను కూడా
ప్రతి వ్యక్తి చూపులూ నింగి వంకే
ప్రతి వ్యక్తి ముఖంలోనూ ఆశలవెలుగే
నిరాశామయ జీవితాలూ, వేదననుండీ వాళ్ళంతా పరుగు
వాళ్ళకళ్ళల్లో అందమైన భవిష్యత్తూ, బంగారపు వెలుగు
దహించే ఆకలి బాధ కొందరిని ఉన్మత్తులని చేస్తే
బానిస కొలుముల దగ్గర తెల్లారిన బ్రతుకులు కొందరివి.
పనిముట్లకు బానిసలైన వీళ్ళందరూ
వాళ్ళ “బానిసభత్యా”లని వెనక్కి గిరాటువేసారు
వాళ్ళు భవిష్యత్తుని కలగనటం లెదు
మీసం ఉన్న ప్రతి మూతీ ఈ మాటలే వల్లిస్తోంది:
“ఇప్పుడు నేను మళ్ళీ మనిషినయ్యాను. నేను స్వతంత్రుణ్ణి!
ఇప్పుడు గట్టిగా అరవగలను: నేనెవడికీ దాసుడ్ని కాను.
నేను రేపు విఫలమైతే అవొచ్చు. ఏం ఫర్వాలేదు.
ఇవాళ మట్టుకు నేను స్వేచ్ఛాజీవిని!”
సందేహం లేదు… వాళ్ళు వల్లమాలిన పాటు పడాలి
ఆకలికీ, చలికీ, నిరాశకీ కూడా గురవుతారు…
ఎన్ని జాగ్రత్తల్తీసుకున్నా రోగాలనుండి రక్షణ హామీలేదు
వాళ్ళిప్పుడు బంగారం వ్యామోహంలో మునిగి ఉన్నారు.
ఆ కళ్ళలోంచి వెలుగులు తొలగిపోతాయి
ముఖం మీంచి చిరునవ్వు మాయమౌతుంది
వాళ్ళు అధిగమించలేని నింగితాకే కొండల్నీ
మంచుపెల్లలు జాలువారే నేలనీ తిట్టుకుంటారు.
కొందరు సగం దారిలోనే నేలకొరుగుతారు;
మనిషిజాడలెరుగని మంచునేల తనలోపొదువుకుంటుంది
కొందరు పుట్టినప్పుడు ఎలావచ్చేరో,
అవే వొట్టిచేతులతో తమ కాంతలను కలుసుకుంటారు.
ఎన్ని పోయినా చివరకి ఇది మాత్రం మిగులుతుంది:
వాళ్లు జీవించేరు, జీవితంతో పోరాడేరు
పందెం వేసిన బంగారం దొరకకపోవచ్చును గాని
వాళ్ళ పోరాటస్ఫూర్తి వల్ల ఆటదే అంతిమ విజయం.
.
హామ్లిన్ గార్లాండ్
(September 14, 1860 – March 4, 1940)
అమెరికను కవి
.
1896-98 ప్రాంతాలలో కెనడాలోని యూకోన్ నదీ పరీవాహకప్రాంతమైన క్లాండైక్ ప్రాంతంలో బంగారం దొరకడంతో, లక్షలకొద్దీ జనాలు ఎగబడ్డారు అక్కడ గనులలో బంగారం తవ్వుకుందికి. అసలాప్రాంతం అంతా భీకరమైనమంచులో కప్పబడి ఉంటుంది. ఎన్నడూ జనసంచారం ఎరుగని కారణం వల్ల ఒక సరియైన దారీ తెన్నూ లేవు. అగమ్యమైన కొండలూ గుట్టలతో నిండి ఉంటుంది. అయినా లెక్కపెట్టకుండా జీవితం పణంపెట్టిమరీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లక్షలమంది వెళితే ఏ మూడు, నాలుగువేలమందో భాగ్యవంతులయ్యేరనుకొండి. అది వేరే సంగతి. ఈ సందర్భంలోనే “జాక్ లండన్”(Jack London) అన్న రచయిత “Building a Fire” అన్న అపురూపమైన కథ వ్రాసేడు. అతను రాసిన The Love for Life అన్న మరో కథ ఈ కవితలోని ఆఖరు నాలుగు పాదాలతో ప్రారంభం అవుతుంది. ఇదే నేపథ్యంలో Gold Rush అన్న ఛార్లీ చాప్లిన్ హాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది.
అవన్నీ పక్కన బెడితే, మనం అందరమూ అలాంటి పరుగులుపెట్టే వాళ్ళమే … ఏ రకమైన మినహాయింపులూ లేకుండా. చిత్రం ఏమిటంటే, ఈ కవితలో ఉదహరించిన వాళ్ళకి పరుగుపెడుతున్నది దేనికో ఖచ్చితంగా తెలుసు; తెలియని దల్లా అందుకోగలుగుతారా లేదా అన్న ప్రశ్న ఒక్కటే. మనకి అలా కాదు. మనం కనే కలలవెంట నిత్యం పరిగెడుతుంటాం… అవే బంగారం అనుకుని. మనచేతికి అందినప్పటికీ అది బంగారమో కాదో తెలీని స్థితి. ఒక్కోసారి,ఇంతజీవితాన్నీ వెచ్చించింది ఇంత పనికిరాని వస్తువుకోసమా అని వగచినవాళ్ళూ లేకపోలేదు. కనుక మనం పక్కవాళ్ళనిచూసి వాళ్ల జీవితాలు ఎంత నిస్సారంగా గడుస్తున్నాయని జాలిపడనక్కరలేదు… చనిపోయే ముందు మనం జీవితాన్ని నిండుగా జీవించలేకపోయామని బాధపడకుండా ఉండగలిగితే చాలు.
.
- English: Image of American writer Hamlin Garland. From The Writer: A Monthly Magazine to Interest and Help All Literary Workers, vol. v. no. 10, October 1891. (Photo credit: Wikipedia)