.
ఓ ప్రభూ! నన్ను త్వరగా తీసుకుపో!
నాకు వివేకము శూన్యం, మాటలు రావు, కన్నీళ్ళింకిపోయాయి;
నా మనసు శిలగా మారి ఎంత చైతన్యవిహీనమయినదంటే
ఇపుడిక ఏ ఆశలూ, ఏ భయాలూ దాన్ని మేల్కొలపలేవు.
కుడి ఎడమల ఎటుచూసినా తోడులేని ఒంటరి జీవిని;
కళ్ళెత్తి చూతునా, దుఃఖపుపొరతో చూపుమందగిస్తుంది
శాశ్వతమైన ఏ మహోన్నత శృంగాల్నీచూడలేను.
నా జీవితమిపుడు పండుటాకులా రాలిపోతోంది.
.
ఓ ప్రభూ! నాలో నువ్వు తిరిగి ఉదయించు!
నా జీవితం రంగువెలిసిన ఆకు పోలికలోనూ
నా ఫలసాయం ఊకగానూ పరిణమించాయి;
నా జీవితం నిజంగా శూన్యమూ, సంక్షిప్తమూ అయి
ఈ అస్తమయవేళ, ఎంతకీ ముగియక విసిగెత్తుతోంది;
నా బ్రతుకు మంచులో సమాధిచెయ్యబడి ఉంది
ఇక పచ్చగా చిగిర్చి, మొగ్గతొడిగే ఆశలేదు:
ఐతే ఇది వసంతంలో తప్పక పునరుద్భవిస్తుంది.
.
నా జీవితం ఒక బీటవారిన పానపాత్ర…
పిపాసువైన నా హృదయం కోసం
ఒక చుక్క నీటినైనా మిగల్చలేనిదీ
పరీక్షించే చలిలో వెచ్చదనాన్నివ్వలేనిదీ;
శిధిలమైన దీన్ని కొలిమిలోకి విసిరేసి
కరిగించి, తిరిగి భగవంతుని నివేదనానికి
యోగ్యమైన దానిగా తీర్చి దిద్దు.
ప్రభూ! నన్ను నీ సేవకి నియోగించుకో (వూ)!
.
క్రిస్టినా రోజేటి
ఆంగ్ల కవయిత్రి
.

Leave a reply to ఎందుకో ‽ ఏమో ?! స్పందనను రద్దుచేయి