చాలా ఖర్చవుతుందేమో, వద్దులే నాన్నా అని పిల్లలన్నప్పుడు
వారి లేతదయాపూర్ణ హృదయాలు తలచి
అతనికన్నులెందుకు చెమ్మగిల్లుతాయి.
ఎన్నడూ తగినంత మాటలాడని కన్నతండ్రి
అర్థరాత్రి దూరాలు దాటివచ్చిన కొడుకుకోసం
నిద్రమానుకుని ఎదురుచూస్తే,వారి మధ్య
చల్లని గాలితెరలా ఆర్ద్రత ప్రవహిస్తుందెందుకని
అణగారిన మంచినెవరైనా గుర్తించిన ప్రతిసారీ
లేదనుకున్న మంచితనం ఎదురైన ప్రతిసారీ
ఎవరినెవరైనా మంచితనంతో గెలుస్తూ గెలిపించిన ప్రతిసారీ
మనకళ్ళెందుకు చెమరుస్తాయి
మన కంఠాలెందుకు రుద్ధమౌతాయి
మనుషులిద్దరిమధ్య హృదయం ప్రవేశించిన ప్రతిసారీ
తెలివికాని తెలివీ, బలం కాని బలమూ
కన్నీరుగామారి పొరలిపోతాయెందుకని
సారవంతమైన మౌనం పొదువుకుంటుందెందుకని,
జీవితం నెమ్మదిస్తుందెందుకని
బహుశా,అపుడు మనలోపలికి మనం చేరుకొంటామేమో
మాయాలోకాన్ని కడుగుకొనిమనని
మనని మనం నిజంగా చూసుకొంటామేమో
దేవునివంటి మనం దారితప్పిన స్మృతిలోకి మేలుకొంటామేమో. .
స్పందించండి