ఇంకా కోతకొయ్యని వరిచేను గట్టున
చేతిలో కొడవలితో అతను మోకరిల్లి ఉన్నాడు;
అతని ఒంటిమీద బట్టలేదు,
అట్టగట్టిన తల ఇసుకలో కూరుకుని ఉంది.
పదే పది సార్లు కలత నిదుర మగతలో
అతను తన మాతృభూమిని చూశాడు.
.
అతని విశాలమైన కలలప్రపంచంలో
నైగర్ నది విలాసంగా ప్రవహిస్తోంది.
దాని ఒడ్దున మైదానాలలోని తాటిచెట్లక్రింద
మరొకసారి అతను మహరాజులా నడుస్తున్నాడు;
కొండమీదనుండి దిగుతున్న సార్థవాహుల
బండ్ల ఎద్దులమెడగంటలు వినిపిస్తున్నాయి.
.
మరొకసారి తన నీలికన్నుల రాణిని
తన పిల్లలమధ్యలో నిలుచుండగా చూశాడు.
వాళ్ళు తన మెడహత్తుకునీ, బుగ్గలు ముద్దాడుతూ
అతని చేతులుపట్టుకునీ ఉన్నారు…
నిద్రపోతున్న అతని కనులనుండి
ఒక భాష్పకణం ఉబికి ఇసుకలో ఇంకిపోయింది.
.
ఆ నదీ తీరమువెంట అతనపుడు,
చాలా వేగంగా గుర్రాన్ని పరిగెత్తించాడు
అతని చేతిలోనున్న గుర్రపు పగ్గాలు బంగారువి
ప్రతి గుర్రపుదాటుకీ యుధ్ధ చేస్తున్నట్టు
తన ఉక్కుకత్తి ఒర గుర్రపు జీనుని
తాకడం తనకి తెలుస్తూనే ఉంది.
.
ఎర్రజెండాల్లా ఫ్లెమింగోలు అతనికి ముందుగా
తళతళలాడుతూ ఎగురుతున్నాయి.
పొద్దుపొడిచినదగ్గరనుండి పొద్దుపోయేవరకు…
సముద్రం కంటికి ఉవ్వెత్తుగా ఎగసిపడుతూ,
కాఫిరుల గుడిశలు కనిపించేదాకా …
చింతతోపుల ఆ మైదానాలలో వాటిని అనుసరించేడు.
.
రాత్రి వేళ అతను ఒక సింహ గర్జనా
ఒక దుమ్ములగొండి అరుపులూ విన్నాడు;
అతను ఒక చిన్న సెలయేటిపక్కన
రెల్లుపొదలు దొలుస్తుంటే, అతని నిద్దట్లో
ఒక హిప్పో దుందుభులు మ్రోగినట్టు
సాకారమైన అతని కలలా పరిగెత్తింది.
.
అడవులన్నీ తమ వేవేల నాల్కలతో
స్వాతంత్ర్యం కోసం నినదిస్తున్నాయి
ఎడారులలోని వడగాలులుకూడా
ఎంతగట్టిగా, విశృంఖలంగా ఘోషించేయంటే
అతను నిద్రలో ఉలిక్కిపడిలేచి
వాటి అదుపులేని ఆనందాన్నిచూసి సన్నగానవ్వేడు.
.
అతనికిప్పుడు రౌతు చేతిలోని కొరడాగాని
మండిపోతున్న పగటి వేడిమి గాని తెలియడం లేదు
కారణం, మృత్యువతని కలలలోకాన్ని వెలిగించింది
నిర్జీవమైన అతని శరీరమూ, పక్కనే
అతని ఆత్మ … విరిచి విసిరిపారేసిన
ఒక పాడుబడ్డ సంకెలా ఉన్నాయి ఇపుడక్కడ.
.
H W లాంగ్ ఫెలో
February 27, 1807 – March 24, 1882
అమెరికను కవి
.

స్పందించండి