(ఈ మధ్యకాలంలో ఇంత అందమైన కవిత నేను చదవలేదు. అందుకే మీతో పంచుకుందామనిపించింది. అమ్మ మీద, నాన్న మీద మంచి కవిత్వం వచ్చింది గాని, అక్కమీద చాలా తక్కువ కవితలు వచ్చాయి. మూలకవిత అవడానికి మళయాళీకవిత అయినా, విషయం మన తెలుగువాళ్ళకి అనుభవంలో లేనిది కాదు. ఒక వంక అక్కని గుర్తుచేసుకుంటూ, మరొక వంక అంతరించిపోయిన “అటు పల్లే… ఇటు పట్టణమూ”కాని నగరాలలోని దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవిత చిత్రణ ఇందులో కనిపిస్తుంది. నాకు విజయనగరంలో మా చిన్నక్కతో గడిపిన 1960లలోని రోజులు గుర్తుకి వచ్చేయి.)
.
పెద్దక్కయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా
ఇల్లంతా ఒక పిట్టలువాలిన చెట్టులా ఉంటుంది.
ప్రతి గదీ కిలకిలలతో మారుమోగుతుంటుంది.
ఇంట్లోవాళ్లు ఆనందంతో గెంతులేస్తున్నారని
బయటనించి ఇట్టే తెలిసిపోతుంది.
.
ప్రతిరోజూ వంటగదివెనక
అంట్లగిన్నెలు చప్పుడుచేస్తుంటాయి;
కాకులు తమవాటాకోసం కావు కావు మంటుంటాయి;
ఆమె చీపురుతో వాకిలి తుడుస్తున్నప్పుడు
అది చప్పుడుచేస్తూ ఆవరణంతా
అర్థచంద్రుళ్ళని గీస్తూ ఉంటుంది.
.
సూర్యాస్తమయం అయిందంటే, పేలు చూస్తుంది.
సూర్యుడికంటే ముందే అక్క నిద్రలేస్తుంది.
.
గిలక చప్పుడు వినిపిస్తోందంటే
పెద్దక్క అక్కడుందని అర్థంచేసుకోవచ్చు.
నీటిలో బాల్టీ ములుగుతున్న చప్పుడూ
ఆ బొక్కి బాల్టీలోంచి కారిపోతూ
అయిష్టంగా పైకి వస్తున్న నీళ్ళ చప్పుడుకూడా వినొచ్చు.
.
పెద్దక్క ఇంట్లో ఉందంటే ఎప్పుడూ బోలెడు చిక్కు(1)
కాలువకి అడ్దంగా పడుతుంటుంది
అక్క కాటికా బొట్టూ పెట్టుకున్నాక
గోడకి రాసేసిన ఆమె వేలి గుర్తులు
చూడ్డానికి ఒక పూలతోటలా ఉంటాయి.
.
అక్కయ్య వెళ్ళిపోయిందంటే,
ప్రతిగదినీ చీకటి ఆవరిస్తుంది,
నిశ్శబ్దం పెరిగి పెరిగి
పక్షుల కిలకిలల్ని కూడా కబళిస్తుంది.
గాలి చెట్టుకొమ్మల్లో వీయడం మరిచిపోతుంది.
ఉడతలు ఒక కొమ్మమీదనుండి ఇంకొక కొమ్మమీదకి గెంతవు.
పెరటిలోని గులాబీ తోట అడవిలా పెరిగిపోయి
ఒక్క పువ్వూ పుయ్యకుండా, ముళ్ళుమాత్రం చాలా కనిపిస్తాయి.
.
దండెం మీద ఏమీ లేకపోవచ్చు.
కానీ ఆరేసిన పరికిణీ రెప్రెపల్లో గాలి దాగున్నట్టు,
మనుషులు అంతా ఎక్కడో దాంగున్నట్టు
చప్పుడుకూడా ఎక్కడో నక్కి ఉందేమో అనిపిస్తుంది.
దడిమీద పూస్తున్న సన్నజాజి పువ్వులతో
క్యూటిక్యూరా పౌడరూ, చంద్రికా సబ్బూ
ఇప్పుడు తగవులు పెట్టుకోవు.
.
అయినా,బావగారి అనుమతి తీసుకుని
అప్పుడప్పుడు చుట్టంలా ఇంటికి వస్తుంటుంది.
ఆ రోజు, ఆమె చీరకుచ్చెళ్లకి వేలాడుతూ
గాలి మళ్ళీ వీయడం ప్రారంభిస్తుంది.
పక్షులకి పాటమళ్ళీ పలుకుతుంది.
చేతులగాజులచప్పుడు వినగానే
ఉడతలు మళ్ళీ ఆ రోజుకి పరిగెత్తి వస్తాయి.
అద్దమూ స్నానాలగదీ
ఆ రోజుకి, అనసూయా, ప్రియంవదలైపోయి (2)
“ఏమిటి సంగతు”లని అడుగుతాయి.
ఆమె ఊపిరి పసిగట్టిన వంటపొయ్యి
బాగా మండడం ప్రారంభిస్తుంది.
.
ఆమె సాయంకాలం సెలవు తీసుకొగానే
అందరికళ్ళూ చెమ్మగిలుతాయి.
.
విష్ణు ప్రసాద్,
మలయాళీ కవి
ఇంగ్లీషు అనువాదం : వి. మాధవన్ కుట్టీ
(Notes:
(1) చిక్కు: స్త్రీలు తల దువ్వుకుంటున్నప్పుడు పన్నితో వచ్చే ఊడిపోయిన జుత్తుని మా ప్రాంతంలో (North Coastal Andhra)”చిక్కు” అంటారు.
(2) అనసూయా ప్రియంవదలు మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల స్నేహితురాండ్రు.
.

వ్యాఖ్యానించండి