యౌవనం తొలినాళ్ళలో
ఈ విశాలవిశ్వంలో
అన్నిటికంటే ఇష్టమైన ప్రశాంతంగా ఉండే జాగా కోసం
వెతుక్కోవడం నాకో అలవాటుగా ఉండేది.
.
చుట్టూ నల్లని రాళ్లతో,
అంబరాన్ని తాకే పైన్(pine) చెట్లతో
ఈ ప్రకృతిసిధ్ధమైన సరోవరపు ఏకాంతం
ఎంత హాయిగా ఉండేదో చెప్పలేను.
.
కాని, చీకటిపడిన తర్వాత
నిశాసుందరి మనఅందరిమీద కప్పినట్టే
ఈ ప్రదేశం మీద కూడా
తన నల్లని ముసుగుకప్పిన తర్వాత
మార్మికపు పిల్లతెమ్మెర ఏవో రహస్యాలాలపిస్తూ
పక్కనుండి పరిగెత్తుతున్నప్పుడు చూడాలి,
అబ్బ!
ఈ సరోవరపు గభీరత
అప్పుడు తెలిసొస్తుంది నాకు.
.
అలాగని అదేమీ భయపెట్టే గాంభీర్యం కాదు,
చిరు చలిలో వణికేటి, తొణికిసలాడే ఆనందం…
ఆ అనుభూతి ఎన్ని రత్నరాశులిచ్చినా
చెప్పగలిగేదీ, నిర్వచించగలిగేదీ కాదు,
ప్రేమకూడా కాదు, ప్రేమలాంటిజ్వరమైనా.
తన ఒంటరితనపుటాలోచనల్లో
ఈ నిశాపరివ్యాప్తమైన సరస్సునే
స్వర్గధామంగా ఊహించగల వ్యక్తికి
ఆ విషమ నులితరగల్లో మృత్యువు దాగుంది
ఆ అగాధంలోనే శాశ్వతమైన సమాధిశయ్య కూడా.
.

వ్యాఖ్యానించండి