
.
ఓహ్! బోడిగా, గోధుమ రంగులో ఉన్న ఆ బండరాయి,
తన పాదాల చెంత కెరటాలు నృత్యం చేస్తుంటే
చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంది!
ఒకసారి ఓ చిన్న నీటిబుడగ
అలలమీద తేలుతూ బండరాయి పక్కకి వచ్చి,
గట్టిగా అరుస్తోంది:
“ఏయ్ మొద్దూ!
త్వరగా పక్కకి తప్పుకో.
కనిపించటం లే? ఈ అలలమీద తేలియాడే
అందాన్ని నే వస్తుంటే?
చూడు హరివిల్లులాంటి నా ఆహార్యం.
చూడు నా వెలుగు కిరీటాన్ని.
నా మెరిసే సొగసూ,
గాలిలా తేలిపోగలిగే నా ఆకారాన్నీ.
నురగలతో, తుంపరలతో
తీరాన్న నర్తించడానికి
ఈ నీలికెరటాలమీద తేలియాడుతున్నాను.
ఊ! త్వరగా, త్వరగా పక్కకి జరుగు.
కెరటాలు ఉధృతంగా ఉన్నాయి.
వాటి పాదతరంగాలు
నన్ను ఒడ్డుకి త్వరగా తీసుకుపోతాయి.
కాని, ఆ బండరాయి నీటిలో నిటారుగా నిల్చుని
ఒక్కసారి క్రిందకి ఒక్కసారి తీక్షణంగా చూసి,
అంతలో సంబాళించుకుని
చిరునవ్వుతో ఇలా అంది:
“చిన్ని నా మిత్రమా!
నువ్వే మరొక త్రోవ వెతుక్కోవాలి.
నేను ఇక్కడనుండి ఎన్నో ఏళ్ళుగా
కదలకుండా పడి ఉన్నాను
“ఉప్పెనలాంటి కెరటాలు నన్ను తోసాయి,
ఉధృతమైన గాలులూ తాకేయి.
కాని, ఏవీ ఈ ఆకారాన్ని
ఒక్క అడుగుకూడా కదల్చలేకపోయాయి.
“నీటిలోగాని, గాలిలోగాని ఉన్నదేదీ
నన్ను కదల్చ లేదే.
మిత్రమా నీకోసం నేనెలా కదలగలను చెప్పు?”
అది విని కెరటాలన్నీ
సన్నని కంఠస్వరంలో మధురంగా నవ్వేయి.
నీటిపక్షులుకూడా తమ రాతి గూళ్లలోనుండి
విలాసంగా ఉన్న బుడగని ఒకసారి చూసేయి
ఆ బుడగకి అమాంతం కోపంవచ్చి,
బుగ్గలు ఎరుపెక్కి,
మితిమీరిన గర్వంతో ఇలా అంది:
“ఏయ్, వికారపు బండరాయీ!
నువ్వు నాకోసం పక్కకి తప్పుకుంటున్నావు.
తప్పుకోవాలి. అర్థం అయిందా?
“ఓయ్ పక్షులూ!
ఎందుకలా తేరిపారి చూస్తున్నారు?
నిశ్శబ్దంగా ఉండండి.
“అనాగరికపు కెరటాల్లారా!
మీ నవ్వులు కట్టిపెట్టి
నన్ను ముందుకి మోసుకెళ్ళండి.
ఈ సముద్రానికి రారాణిని నేను.
ఈ మొరటు రాళ్ళు నన్ను భయపెట్టలేవు”
కోపంతో పైకిలేచి నిందిస్తూ
ఒక్కసారి రాతిని కొట్టి పగిలిపోయింది
తెలివితక్కువ బుడగ.
బండరాయిమాత్రం
ఎంతమాత్రం కదలలేదు.
అప్పుడు గూళ్ళలోని నీటి పక్షులు
తమ గుండెలమీద పడుక్కున్న
చిన్నారులతో ఇలా అన్నాయి:
మీరు ఆ బుడగలా బుర్ర తిరుగుడుగా,
అహంకారంతో, అసభ్యంగా ఉండకండి.
దౌర్జన్యంగానైనా మీ పనులు
నెరవేర్చుకుందికి ప్రయత్నించకండి
ఆ రాయిలా నిశ్చలంగా,
నిజాయితీగా, ధృడంగా ఉండండి.
తప్పు చేసినవారిపట్ల
ఖచ్చితంగాఉంటూనే,
దయతో, ప్రసన్నతతో ఉండడం
ఎంతమాత్రం మరిచిపోవద్దు.
“చిన్నారులూ,
ఇవాళ మీరు నేర్చుకున్న
ఈ గుణపాఠం శ్రధ్ధగా గుర్తుంచుకుంటే,
మీరు వివేకవంతులౌతారు.
.
లూయిజా మే ఏల్కోట్
(November 29, 1832 – March 6, 1888)
(లూయిజా మే ఏల్కోట్ అనగానే ఛప్పున గుర్తువచ్చేది Little Women అన్న నవల (అమెరికనుసివిల్ వార్ నేపథ్యంలో రాయబడిన ఈ నవల అనంతరం నాటకంగా మలచబడింది. 5సార్లు తెరకెక్కింది. 1949 సినిమాలో ఎలిజబెత్ టేలర్ Amy March గా నటించింది). రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, హెన్రీ డేవిడ్ థొరోల వంటి హేమాహేమీల ప్రభావంతో పెరిగిన అమ్మాయి స్వతంత్రభావాలు లేకుండా ఎలాఉంటుంది? చిన్నప్పటినుండే తన రచనలద్వారా కుటుంబానికి ఆర్థికసహాయం చెయ్యవలసి వచ్చిన ఈమె, బానిసత్వ నిర్మూలనకు వ్యతిరేకంగా తనగొంతు వినిపించింది. )
.

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి