మహానుభావుడు సూర్యుడు ప్రశాంతంగా
సువిశాల శూన్యాకాశంలో విహరిస్తున్నాడు.
వినీలగగనంలో ఈ వేసవి మధ్యాహ్నవేళ
వర్షంకంటే చిక్కనికిరణాలజల్లు కురిపిస్తున్నాడు.
అప్పటికేదగ్గరగా ఉన్నతెరల్ని ఇంకాదగ్గరగాలాగి
గదిని నీడగా, చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం
అయినా ఒకటో రెండో కన్నాలు దొరుకుతూనే ఉన్నాయి
అతనికి తన వేళ్ళు అందులోంచి దూర్చడానికి
సాలీళ్ళుపట్టి దుమ్ముకొట్టుకుపోయిన అటక
చూరుకన్నంలోంచి చొచ్చుకొస్తున్న వెలుతురులో బాగా కనిపిస్తోంది
విరిగిపోయిన పెంకుల కొసలనుండి
నిచ్చెనవేసిన గడ్డివామిని నవ్వుతూ పలకరిస్తున్నాడు
మధ్యమధ్యలో తన బంగారు మోముతో
తోటలోని నేలనంతా పరికించి చూస్తున్నాడు
దట్టమైనబదనికపొదలలోని అట్టడుగుతీగెమీదకూడా
తనచురుకైన వాడి వేడి చూపులను ప్రసరిస్తున్నాడు
కొండలమీదా, సముద్రంపైనా,
నిలకడగా ఉన్న గాలిలోనూ తేలియాడుతూ
పిల్లల్ని సంతోషపరచడానికీ,
గులాబీలకి రంగులద్దడానికీ అదిగో,
ప్రపంచపు తోటమాలి ప్రయాణిస్తూనే ఉన్నాడు.
.
రాబర్ట్ లూయీ స్టీవెన్సన్
(13 November 1850 – 3 December 1894)
స్కాటిష్ కవీ, నవలా రచయితా.
ఇతని పేరు చెప్పగానే చప్పున గుర్తువచ్చేవి ట్రెజర్ ఐలండ్ (Treasure Island) అనే చిన్నపిల్లల అద్భుతమైన నవలా ; డాక్టర్ జెకిల్ & మిస్టర్ హైడ్ (Strange case of Dr. Jekyll and Mr. Hyde) అన్న మనోవైజ్ఞానిక నవలా. తమ జీవితకాలంలోనే పేరుప్రఖ్యాతులు సంపాదించుకోగలిగిన అరుదైన సాహిత్యవేత్తలలో ఇతను ఒకడు.
ఈ కవితలో సౌందర్యమంతా నా మట్టుకు నాకు “ప్రపంచపు తోటమాలి” అని సూర్యుడిగురించి చేసిన ప్రయోగంలో ఉంది. అందుకే దీనిక శీర్షికకూడా అదే ఉంచేను. భాస్కరోసర్వభక్షకః అని ఆర్యోక్తి. సూర్యుడు వేసవిలో తన వాడి వేడి కిరణాలతో పంటపొలాల్ని మాడ్చి, పంటకి హానికలిగించే క్రిమికీటకాలని నశింపజెయ్యకపోతే, తొలకరిజల్లులకి నేల మళ్ళీ వ్యవసాయానికి సిధ్ధంకాదు. అలాగే తోటమాలి కూడ పాదులుతీస్తూ, గొప్పులుతవ్వుతూ, చీడపట్టిన చెట్లని తీసేసి, కొమ్మల్ని త్రుంచేసి, వర్షాకాలానికి తోటని సన్నద్ధం చేస్తాడు.

Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి