(అనంతనైరాశ్యంలో కూడ ఒక వెలుగురేక ఎక్కడనుండో కనిపిస్తుందనీ, ప్రకృతి తనజీవచైతన్యాన్ని ఎట్టిపరిస్థితులలోనూ కోల్పోదనీ సందేశమిచ్చే ఈ అద్భుతమైన కవిత …. థామస్ హార్డీ 173వ పుట్టినరోజు సందర్భముగా)

.
నేను మా తోట వాకిలికి ఆనుకుని చూస్తున్నాను.
కురిసినమంచు దయ్యంలా తెల్లగా ఉంది.
ఈ శీతకాలపు అవశేషాలు
సూర్యుడిని ఇంకా ఏకాకిని చేస్తున్నాయి
చెట్లకు ఎగబాకిన లతలు
తెగినవీణల తీగల్లా ఉన్నయి.
దగ్గరలో మనిషన్నప్రతివాడూ
ఇంటిలోపల చలికాగుతున్నాడు.
ఈ నేల కవళిక ఎటు చూసినా
ఈ శతాబ్దశవపు ఛాయ గోచరిస్తోంది.
ఈ కమ్ముకున్న మబ్బు శవపేటికలాగా,
గాలిరొద శవరోదనలాగా ఉన్నాయి
స్థావరజంగమాలలోని ఆదిమ ప్రాణస్పందన,
లోలోపలికి కుంచించుకుపోయినట్టుంది,
ఈ ప్రకృతిలోని ప్రతిప్రాణీ నాలాగే
ఉత్సాహ విహీనమైనట్టుకనిపిస్తోంది.
కానీ, ఒక్కసారి నా తలమీది
మోడువారిన కొమ్మలలోనుండి,
అవధిలేని ఆనందంతో ఒక గొంతు
సాంధ్యగీతాన్ని ఆలపించడం ప్రారంభించింది
బక్కగా చిక్కి వడిలిపోయిన చిన్న ముసీలి పక్షి,
రొజ్జగాలికి ఈకలు చెదిరినా,
విస్తరిస్తున్న నైరాశ్యాన్ని తన
జీవశక్తితో నింపడానికి నిశ్చయించుకున్నట్టు.
దగ్గరలోగాని, కనుచూపుమేరలోగాని,
భూమిమీద ఏ వస్తువులోనూ
అంత రసవత్తరంగా ఆలపించడానికి
తగిన కారణం కనిపించదు
నేననుకుంటున్నాను:
బహుశా ఈ చక్కని నిశాపవనం లో
నాకు తెలియనిదీ, దానికి తెలిసినదీ
ఏదో ఆశాస్వరూపం కదలాడుతున్నాదేమోనని.
.

వ్యాఖ్యానించండి