చే గెవాడా ని 1967లో CBI బొలీవియాలోని ఒక మారుమూల పల్లెలో కాల్చి చంపిన తర్వాత, అతని దగ్గర దొరికిన వస్తువుల్లో, అంచులు బాగా నలిగిన నోట్సుపుస్తకం దొరికింది. అందులో పావ్లో నెరూడా (చిలీ), నికొలాస్ గిగేన్ (క్యూబా), సిజార్ వలేహో (Peru), లేయాన్ ఫెలీపె(స్పెయిన్)ల 69 కవితలు ‘చే’ స్వదస్తూరీతో వ్రాసినవి ఉన్నాయి. అందులోనిది ఈ కవిత. తక్కిన వివరాలకు: http://www.guardian.co.uk/world/2007/sep/09/books.booksnews చూడండి)
ఈ కవితలో అనుకోకుండా ఎదురైన ఒక భయంకర సంఘటనని, ప్రాణాంతకమయిన సందర్భాన్ని తెలుపుతున్నాడు. ఆ సందర్భం ఎంత అమాయకంగా, తెలియకుండా ఎదురవుతుందంటే, మనం దానికి తయారీగా ఉండలేము. ఒక్కో సారి మనం చేసిన పనులకి విచారణ జరపకుండా, సంజాయిషీ చెప్పుకునే అవకాశం లేకుండా కేవలం నేరారోపణా, శిక్షా వెంటవెంటనే అమలుజరపబడిపోతుంది. యుధ్ధంలోనూ, గెరిల్లా పోరాటాలు చేసేవారికి ఈ సందర్భం మృత్యువుతో Tryst లాంటిది. కవి ఆ సంఘటనని చెబుతున్నాడు.
.
అంత బలమైన దెబ్బలు జీవితంలో తగులుతాయా…
ఏమో! నాకు తెలియదు
అవి ఎలాంటి వంటే, దేముని ఆగ్రహం వల్ల కలిగేటటువంటివి
అవి ఎదుర్కుంటున్నప్పుడు, జీవితంలో అనుభవించిన వేదనంతా
ఒక్కసారి పెల్లుబుకుతుంది…
ఏమో! నేను సరిగా చెప్పలేను.
.
అలాంటి సందర్భాలు అరుదుగా ఉండొచ్చు… కాని
ఎంత భీకరాకారుడికైనా, ధైర్యవంతుడికైనా, వెన్నులో వణుకుపుట్టిస్తాయి…
అవి ‘ఆతిల‘ వంటి ఆటవికుడి కాలాశ్వాలు కావచ్చు…
లేదా, మృత్యువు పంపిన మరణదూతలు కావచ్చు.
.
అవి క్రీస్తువంటి పవిత్రాత్మల పతనాలు
విధి దూషించిన ఒక ఆరాధించవలసిన నమ్మకం
రక్తాలోడుతున్న ఆ ప్రహారాలు
పొయ్యిమీద వ్రేలుతున్న రొట్టెల చప్పుళ్ళు
.
పాపం! ఆ వెర్రిబాగుల మనిషి కళ్ళుతిప్పి అటుచూస్తాడు,
భుజంమీద చరిచి ఎవరో మనల్ని పిలిచినట్టు;
అమాయకంగా అటుచూడగానే, ఆ చూపులో, ఒక్కసారి
జీవితమంతా అపరాధంలా పెల్లుబుకుతుంది.
.
అంత బలమైన దెబ్బలు జీవితంలో తగులుతాయా…
ఏమో! నాకు తెలియదు
.
[ఆతిల: ‘ఆతిల ది హూణ్‘(? … 453) అనబడే హూణ రాజు, పరమ భయంకరుడు, రోమను సామ్రాజ్యానికి పక్కలో బల్లెంలా నిలిచిన వాడు.]
.

వ్యాఖ్యానించండి