
.
తన ప్రకాశానికి తానే మురిసిపోతూ,
సూర్యాస్తమయాల మధ్య… రోజు … ఊగిసలాడుతోంది.
.
ఈ మిట్టమధ్యాహ్న వేళ, ప్రకృతి నిశ్శబ్దంగా
ముందుకీ వెనక్కీ ఊగుతున్నసముద్ర తీరంలా ఉంది.
.
అంతా కనిపిస్తూనే ఉంటుంది… ఏదీ పట్టు చిక్కదు
అంతా దగ్గిరా ఉన్నట్టే ఉంటుంది… ఏదీ చేతికందదు
.
కాగితం, పుస్తకం, పెన్సిలు, గ్లాసు
అన్నీ తమ పేర్ల నీడలో సేదదీరుతున్నాయి
.
నా కణతలదగ్గర కొట్టుకుంటున్న నాడి
ఏ మార్పూలేని రక్తాన్నే మోసుకెళ్తోంది.
.
నిర్లిప్తంగా పడున్న గోడమీద
వెలుతురు క్రీనీడల భూతాల్ని ప్రదర్శిస్తోంది.
.
నా కంటిపాపలో నాకునేనే కనిపిస్తున్నా
దాని శూన్యదృక్కుల్లో నన్నునేను చూసుకుంటూ.
.
ఈ క్షణం చెదిరిపోతుంది.
నేను కదలకుండా కొంతకాలం ఉండి వెళ్ళిపోతాను.
నేనొక విరామ చిహ్నాన్ని.
.
ఆక్టేవియో పాజ్.
(March 31, 1914 – April 19, 1998 )

- Image Courtesy: http://upload.wikimedia.org
వ్యాఖ్యానించండి