రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 3 వ భాగం

అంకం 2  దృశ్యం 3

(త్రిభుల, బాహుదా, కొంత సమయం గడిచిన తర్వాత భద్రద)

త్రి:  తల్లీ! (ఆమెను గుండెకు అదుముకుంటాడు… ఆనందాతిరేకంతో)

ఏవీ! నీ చేతులు నా మెడచుట్టూ వెయ్యి.  దగ్గరగా రా తల్లీ!   అబ్బ! ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. నీ దగ్గర అంతా ఆనందమే! నాకు మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్లుంది.    (త్రిభుల ఆమెను తదేకంగా చూస్తుంటాడు)

రోజురోజుకీ నీ అందం ద్విగుణీకృతం అవుతోంది బాహుదా! అంతా బాగుంది కదా!  నీకు ఏ కష్టం కలగడంలేదు కద? ఏదీ ఒక్కసారి వచ్చి ఒక ముద్దు ఇవ్వు.

బా: నువ్వెంతో మంచి నాన్నవి. (ముద్దు పెట్టుకొనును)

త్రి: నిజంగానే? కాదు.  నువ్వంటే నాకు ప్రేమ.  నువ్వే నాప్రాణం. నా జీవం. బాహుదా! నువ్వుదూరమయిన నాడు- అబ్బా! ఆ ఊహే ప్రాణాంతకంగా ఉంది.
బా: (త్రిభుల నుదిటిమీద చెయ్యి వేస్తూ) ఎందుకంత బరువుగా ఊపిరితీస్తున్నావు నాన్నా? నీ బాధలు నాతో పంచుకోవూ?  అయ్యో! నాకు మన కుటుంబం గురించి ఏమీ తెలియదు.

త్రి: అమ్మలూ! మనకు ఎవ్వరూ లేరు.

బా: పోనీ, నీ పేరయినా చెప్పవచ్చుకదా?

త్రి: పేరు తెలుసుకుని ఏమి చేస్తావు?

బా: నేను “చినవాడ” గ్రామంలో  ఉన్నప్పుడు — నువ్వువచ్చి నన్ను ఇక్కడకు తీసుకునివచ్చేదాకా అందరూ నన్ను అనాధ  అనేవారు.

త్రి: నిన్నక్కడ వదిలేసి ఉంటేనే బాగుండునేమో తల్లీ! కానీ, నేను నా బాధామయ జీవితాన్ని ఇక సహించలేక నిన్ను తీసుకు వచ్చేను.  నీ కోసం పరితపించేను.  నన్ను ప్రేమించే ఒక జీవికోసం తహ తహ లాడిపోయేను.

బా: పోనీ, నీ పేరు చెప్పకపోతే…

త్రి: (ఆమె మాటలు పట్టించుకోకుండా) నువ్వు బయటకు ఎక్కడికీ వెళ్ళడంలేదు గద!

బా: నేనిక్కడకు వచ్చి రెండు నెలలయ్యింది.  ఈ మధ్యకాలంలో చర్చికి మాత్రం  ఏడెనిమిది సార్లు వెళ్ళిఉంటానేమో!
త్రి: మంచిది.

బా: పోనీ ఇప్పుడైనా నా తల్లిగురించి చెబుతావా నాన్నా?

త్రి: వద్దమ్మా, వద్దు.  మళ్ళీ ఆ తీగను మీటకు తల్లే, మీటకు. నేనెంత విలువైన  వస్తువును కోల్పోయానో నాకు మళ్ళీ గుర్తు చెయ్యకు. నువ్వేగాని ఎదురుగుండా లేకపోయుంటే, అదంతా ఒక కలగా భ్రమించి తీసిపారేసేవాడిని.

మిగతా అందరి స్త్రీలకన్న విలక్షణమైనది మీ అమ్మ.  నేను పేదవాడినని, కురూపినని, ఏకాకినని, రోగిష్టినని, తెలిసిమరీ ప్రేమించింది. నా దౌర్భాగ్యాన్ని కూడా.

పోతూ, పోతూ, తనతో పాటే, ఆమె అమరప్రేమ రహస్యాన్ని సమాధిలోకి తీసుకునిపోయింది. మెరుపుకంటే వేగవంతమూ,  క్షణికమూ అయిన ప్రేమ! నరకాన్ని కూడా జేగీయమానం చెయ్యగల ఒక స్వర్లోక ప్రకాశరేఖ.

ఓ పృధ్వీ! ఆ దేవత హృదయంపై తేలికగా నడయాడుమీ!
నా దుఃఖాలనుండీ, నా కష్టాలనుండీ నేను సేదదీరగలిగిన ఏకైక సదనం అదే!
(బాహుదాతో) నువ్వు నాకు మిగిలావు.  భగవంతుడా! అందుకు నేను నీకు సర్వదా కృతజ్ఞూణ్ణి.

(పట్టలేని దుః ఖంతో ఏడ్చును)
బా: అయ్యో! ఎంతహృదయవిదారకమైన రోదన! నాన్నా! నువ్వలా ఏడుస్తుంటే చూడలేకున్నాను. అది నన్ను అశక్తురాలినిచేస్తోంది.

త్రి: నన్ను నవ్వమంటావా తల్లీ!

బా: నన్ను క్షమించు నాన్నా! నీ పేరు చెప్పు. నీ దుఃఖాన్ని నాతో పంచుకో!

త్రి: నేను నీ తండ్రిని. అంతే! అంతకుమించి నన్నేమీ అడగవద్దు తల్లీ! ఈ విశాల విశ్వంలో నన్ను ద్వేషించే వారు కొందరయితే, ఏవగించుకునేవారు కొందరు.  కానీ, కనీసం ఇక్కడైనా- అమాయకత్వం ఉన్న ఈ చోట- నేను తండ్రిగా ప్రేమించబడి, గౌరవించబడతాను.  పిల్లలకు “నాన్న” అన్న మాటకంటే పవిత్రమైనది ఇంకేముంటుంది చెప్పు?

బా: నాన్నా!
త్రి: ఓహ్! ఏ హృదయం నీ మనసులా ప్రతిస్పందిస్తుంది?  ఇతరులని ఎంత తీవ్రంగా ద్వేషిస్తానో, నిన్నంత గాఢంగా ప్రేమిస్తాను. రా! నా దగ్గరగా వచ్చి కూచో! మనిద్దరం మాటాడుకుందాం. నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉందా?

మనిద్దరం   ఇక్కడ కలిసి కూర్చున్నాం కాబట్టి, నీ చిన్ని చేతులు నాచేతుల్లో  ముడిబడి ఉన్నాయికాబట్టి, తల్లీ, నిన్ని తప్పించి ఇంకెవరిగురించో ఎందుకూ మాట్లాడుకోవడం?

భగవంతుడు నాకు ప్రసాదించిన వరం ఏమిటో తెలుసా తల్లీ? ప్రపంచంలో అందరికీ, తల్లిదండ్రులూ, తోబుట్టువులూ, మనవలూ, మునిమనవలూ, స్నేహితులూ, భార్యలూ, ప్రితురాండ్రూ, భర్తలూ, బానిసలూ, సుదీర్ఘమైన వంశపరంపరా, ఇలా ఎన్నెనో. కాని నాకు మాత్రం- నువ్వు ఒకర్తెవే! కొందరే భాగ్యవంతులు. అందులో నేనొకడ్ని. నువ్వే నాసంపద. నా సర్వస్వం.  కొందరు దేవుడ్ని నమ్ముతారు. నే నిన్ను నమ్ముతాను.  నిన్నేనమ్ముతాను. ఇకనాకు వయసుతోకాని, స్త్రీసుఖంతోగాని, పేరుప్రఖ్యాతులతోగాని, గౌరవసత్కారాలూ, ధనధాన్యాలతోగాని  ఏమిపని? ఇవన్నీ అందరూ అర్రులుజాచేవే.  కాని, నువ్వు వీటన్నిటినీ అధిగమిస్తావు.

దేశమైనా, నగరమైనా, కుటుంబమైనా,  నాకు అన్నీ నువ్వే. నా సంపద, నా సుఖం, నా నమ్మకం, ఆశ, ప్రపంచం అన్నీ నీలోనే చూసుకుంటా. నువ్వు తప్ప మిగతా ప్రపంచం అంటే  నా మనసు కుంచించుకుపోతుంది.  నిన్నుగాని కోల్పోయేనా, అది నన్ను భయవిహ్వలుడిని చేసే ఒక ఆలోచన-  అది  ఇంకొక్క క్షణం నన్నంటిపెట్టుకుంటే, నా ప్రాణాలు పోవడం తథ్యం.  ఏది తల్లీ, ఒక్క నవ్వు నవ్వు.  బాహుదా! నీ అందమైన  అమాయకమైన చిరునవ్వు అచ్చం మీ అమ్మనవ్వులాగే ఉంటుంది.  ఆమెకూడా- నిరలంకారమైనదే! నీ నుదురు మీదచెయ్యి వేసి ఒత్తికుంటావు చూడూ, తల్లీ, అది అచ్చం మీ అమ్మ పోలికే! నాహృదయం చిమ్మ చీకటిలో కూడ నీ దగ్గరకే ఉరుకుతుంది.  ఊహించుకోగలను. నువ్వే నాఉషస్సువి .కంటి వెలుగు.  జీవన సర్వస్వం.

బా: నాన్నా! నేను నిన్ను సుఖపెట్టగలిగితే అంతకంటే కావలసినదేముంటుంది?

త్రి: సుఖపెట్టడమా?  బాహుదా! నీ రూపం చాలదూ, నన్ను ఆనంద పారవశ్యంలో ముంచితేల్చడానికి? (ఆమె తల నిమురుతూ, నవ్వుతూ) ఎంత ఒత్తైన కురులు! నాకు బాగా గుర్తు.  ఒకప్పుడు ఇది చాలా పలచగా ఉండేది.  ఎవరునమ్మగలరు, ఇంత దట్టంగా, నల్లగా అవుతాయని?

బా: ఏదో ఒకరోజు, సాయం సంధ్యా రావం వినిపించే లోగా, నగర దర్శనానికి అనుమతిస్తావు గద, నాన్నా!
త్రి: అమ్మో! ఎన్నటికీ ఇవ్వను. నువ్వు ఇప్పటివరకు భద్రదతో తప్ప ఒంటరిగా గుమ్మం కదలడంలేదు కద!

బా: అబ్బే, లేదు.
త్రి: జాగ్రత్త సుమా!
బా: నేను ఒక్క చర్చికి మాత్రమే వెళ్ళివస్తున్నాను.
త్రి: (తనలో) ఆమెను ఎవరైనా చూడవచ్చు. అనుసరించవచ్చు.  నాదగ్గరనుండి లాక్కుని, ఆమెను బలాత్కరించ వచ్చు. అయ్యో! అదేగాని జరిగితే, ఈ దౌర్భాగ్యపు విదూషకుడి కుమార్తెపై ఎవ్వరూ జాలీ, కనికరమూ చూపించరు.
(ప్రకాశంగా) నిన్నువేడుకుంటాను బాహుదా! నువ్వు బయటకు వెళ్ళకు.  ఈ నగర వాతావరణం ఎంత కలుషితమో, ఎంత ప్రాణాంతకమో, నీకు తెలియదు. మరీ ముఖ్యంగా స్త్రీలకు. హృదయం లేని స్త్రీలోలురు రోడ్లమీద విచ్చలవిడిగా తిరుగుతుంటారు. వాళ్ళకంటే నీచులు రాజదర్బారులోని  ప్రతినిధులు.

(తనలో) ఈ ప్రమాదభూయిష్టమైన  ఉచ్చులనుండి నా చిట్టితల్లిని భగవంతుడు సర్వదా కనిపెట్టుకుని రక్షించి, కాపాడుగాక!  నా కుమార్తెతో సరితూగగల అందాలున్న కన్నెమొగ్గలను కేవలం వాళ్ల ఊపిరి తగలగానే భ్రష్టుపట్టించగల విశృంఖలులున్నారిక్కడ.  ఆమె కలలు కూడ పవిత్రంగా ఉండుగాక!  కనీసం ఇక్కడైనా ఈ నిర్భాగ్యుడైన తండ్రి, అశ్రాంతమైన కష్టాలనుండి విశ్రాంతి తీసుకుని, ఈ అమాయకురాలి అనిర్వచనీయమైన  ప్రేమామృతాన్ని  తనివితీరా గ్రోలగలుగుతున్నాడు.
(చేతిలో ముఖందాచుకుని వెక్కి వెక్కి ఏడ్చును)

బా: ఇంకెప్పుడూ బయటకు వెళ్ళడంగురించి ఆలోచించను నాన్నా! ఏడవకు.

త్రి: ఈ కన్నీళ్ళు నాకు ఉపశాంతినిస్తాయి తల్లీ! నిన్న రాత్రి నేను ఎంతగా నవ్వేనో  నాకే తెలీదు.  ఆ! మరిచాను. నేను ద్వేషించే వాళ్ళను మళ్ళీ కలుసుకోవలసిన ఘడియలు సమీపిస్తున్నాయి.  వస్తానమ్మా, బాహుదా!

బా: (కౌగిలించుకుంటూ) మళ్ళీ తొందరలోనే ఇక్కడకు వస్తావు కదూ, నాన్నా?

త్రి: ప్చ్! నేను పరాధీనుణ్ణి తల్లీ!
ఓ, భద్రదా! ( పిలుచును)

(ఒక ముసలి సంరక్షకురాలు ప్రవేశం) నేను లోనకు రావడం ఎవ్వరూ కనిపెట్టలేదు గద!

భద్రద: లేదు. ఎవరూ చూడలేదు. అసలు ఈ వీధే నిర్మానుష్యం, స్వామీ!
(అప్పటికి చీకటి బాగా అలుముకుంటుంది. గోడకు అవతల రాజు ముదురు రంగు బట్టలువేసుకుని  ప్రత్యక్షం అవుతాడు.  ఆ గోడనీ,  మూసి ఉన్న తలుపునీ విసుగుని సూచించే చేష్టలతో పరిశీలిస్తూ, అసహనం ప్రదర్శిస్తాడు.)
త్రి: వస్తాను బాహుదా! ఉంటా!
(భద్రదతో) సముద్రంవైపు  తెరుచుకునే తలుపు ఎప్పుడూ మూసేఉంచుతున్నావు గదా! సెయింట్ జెర్మేన్ చర్చి సమీపంలో ఇంతకంటే నిర్మానుష్యమైన ఇల్లు  చూశాను. దాని సంగతి రేపు ఆలోచిస్తాను.
బా: ఈ డాబా మీదనుండి తోటకనిపిస్తూ చాలా బాగుంది నాన్నా!

త్రి: (గాభరాగా) డాబా మీదకు వెళ్ళవద్దు తల్లీ! (అతను చెవులు రిక్కించి వింటాడు) అదిగో! ఎవరివో అడుగుల చప్పుడు.(అతను ద్వారం తెరిచి, బయటకు తొంగి చూచును.  తలుపుకి దగ్గరగా ఉన్న ఖాళీ జాగాలో రాజు దాక్కొనును. త్రిభుల మళ్ళీ తలుపు పూర్తిగా వేసేలోగా)

బా: (డాబా వైపు చూపిస్తూ) మరి నేను రాత్రిపూటైనా నిర్మలమైన గాలి పీల్చుకోవద్దా, నాన్నా?

త్రి: ఏం చెయ్యను? నువ్వు అందరికీ కనిపిస్తావు.

( అతను వీపుద్వారం వైపు ఉంచి బాహుదాతో మాట్లాడుతుండగా, ఒరవాకిలిగా తెరుచుకుని ఉన్న తలుపు లోంచి ఎవరికీ కనిపించకుండా రాజు లోనకు దూరి ఒక చెట్టువెనుక దాగుంటాడు.)

(భద్రదతో) ఈ చావడిలో ఎక్కడా దీపం వెలిగించవద్దు)
భ: ఏమీ? ఏ మనిషి లోపలికి రాగలడు?

(ఆమె తలతిప్పి  చెట్టువెనక నక్కి ఉన్న రాజును చూసి గట్టిగా అరవబోయేలోగా, రాజు ఆమె వంక  ఒక డబ్బు సంచీ ఊపుతూ అందిస్తాడు. ఆమె దాన్ని చేత్తో సరిచూచుకుని, మౌనంగా ఊరుకుంటుంది.)
బా: (లాంతరుతో డబా నలుమూలలా పరిశీలుస్తున్న త్రిభులతో) ఏమిటి వెతుకుతున్నావు? దేనిగురించి నీ భయం నాన్నా?
త్రి: నాగురించి కాదు.  అంతా నీగురించేనమ్మా!
(అతను ఆమెను దగ్గరకు తీసుకుంటుండగా భద్రద చేతిలోని దీపం వెలుగులు ఒక్క క్షణం వాళ్ళిద్దరిమీద పడతాయి)
రా: ఓహ్! వీడా! త్రిభుల! (నవ్వుతాడు) త్రిభుల కూతురు! అయితేనేం? రసాధిదేవత!

త్రి: (వెనక్కి వస్తూ) ఒక ఆలోచన నన్ను కలవర పెడుతున్నాది. నువ్వు చర్చినుండి వెనుదిరిగి వస్తున్నప్పుడు నిన్నెవరూ అనుసరించలేదు గదా!
(బాహుదా ఏమీ చెప్పలేని స్థితిలో నేలచూపులు చూస్తుంటుంది)

భద్రద: లేదు. ఎన్నడూ లేదు.

త్రి: ఒక వేళ  నిన్ను ఎవరైనా అడ్డగించినా, అత్యాచారం చెయ్యబోయినా గట్టిగా అరిచి కేకలు వెయ్యు. ఏం?

భ: నేను గావుకేకలు వేస్తాను. రక్షక భటుల్ని పిలుస్తాను.

త్రి: తలుపు ఎవరు తట్టినా సరే, మూసే ఉంచు. తెరవ వద్దు.

భ: రాజుగారు వచ్చినా కూడానా?

త్రి: రాజుగారు వస్తే- మరీనూ.

(బాహుదాను మరొకసారి కౌగిలించుకుని- జాగ్రత్తగా తన వెనకే తలుపు మూసి నిష్క్రమించును)

(సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: