రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం, 1వ భాగం
ద్వితీయాంకం దృశ్యం 1
[ బుస్సీ గారి భవంతి. ఎక్కడా జనసంచారం కనిపించదు. ఆ భవంతికి కుడిప్రక్కగా చూడచక్కని ఒక ఇల్లు. పెద్ద ప్రహారీ గోడ. ముందు విశాలమైన ఖాళీ స్థలం. ఖాళీ స్థలంలో రకరకాల వృక్షాలు. కూర్చునేందుకు ఒక నాపరాయి పలక. ప్రహారీ గోడకు వీధిలోకి తెరుచుకుంటూ తలుపు. ప్రహారీ గోడమీదనుండి డాబా- క్రింద అందమైన “ఆర్చ్”లు. మేదమీద గదినుండి డాబా మీదకు తెరురుచుకున్న తలుపు. డాబా నుండి క్రిందకు ఒక ప్రక్కగా మెట్లు. బుస్సీగారి భవంతికి ఎడమప్రక్కగా కాశ్యప భవనం. దానివెనుక దూరంగా చెదురుమదురుగా ఇళ్ళూ, దూరంగా కనిపిస్తున్న సెయింట్ సెవెరిన్ చర్చి (St. Severin Church) గోపురమూ.
ముందుగా త్రిభుల, సుల్తాన్ ప్రవేశం. కొంత సేపు పోయిన తర్వాత పెన్న, గద్దే .
త్రిభుల తలపై ఇప్పుడు విదూషకుడి తలపై ఉండే రంగురంగుల కుచ్చు టొపీ ఉండదు. వేషం మారి, ఇపుడు అతను ముసుగులో ఉంటాడు. ప్రహారీ గోడ తలుపు దగ్గరకు అడుగులో అడుగు వేసుకుంటూ సమీపిస్తుంటాడు. సుల్తాన్ కూడా అతన్ని ముసుగు వేసుకునే అనుసరిస్తుంటాడు. ముసుగులోంచే అతని చేతిలోనున్న ఒక పొడవైన కత్తి తళతళలాడుతూ మెరుస్తుంటుంది.]
త్రి: (విచారంతో) ఆ ముసలివాడు నన్ను శపించాడు!
సుల్తాన్: (అనుసరిస్తూ) అయ్యా!
త్రి: (ఆశ్చర్యంతో వెనుకకు తిరిగి చూసి, జేబులు తడుముకుని- కోపంతో) ఫొ! నీ అవుసరం నాకు లేదు.
సు: అవమానం! నేను మిమ్మల్ని యాచించడానికి రాలేదు.
త్రి: అయితే నన్ను విడిచిపెట్టు.
సు: (వంగి, తన పొడవైన కత్తిని చేతితో తడిమి చూసుకుంటూ) అపచారం చేస్తున్నారు మీరు. నేను కత్తిని నమ్ముకుని బ్రతికే వాణ్ణి.
త్రి: (ఒక్క సారి గక్కురు మని- వెనుకకు అడుగు వేస్తూ) అంటే, గొంతుకోసేవాడివన్నమాట.
(పెన్న గద్దే ఇతరులు ప్రవేశిస్తారు. రంగస్థలం చివరనుండి జరుగుతున్న విషయాలను పరికిస్తుంటారు)
సు: మీ మనసును ఏదో పట్టి పీడిస్తున్నట్టు తోస్తోంది. మీరు ప్రతిరాత్రీ ఈ నిర్జన ప్రదేశానికి క్రమం తప్పకుండా వస్తున్నారు. నిజం చెప్పండి. ఏ స్త్రీ అయినా మీ ప్రేమను చూరగొందా?
త్రి: నాకు మాత్రమే సంబంధించిన విషయాన్ని ఇతరులతో చర్చించను.
సు: కానీ, నేను మీ క్షేమంకోరి చెబుతున్నాను. నే నెవర్నో తెలిస్తే ఇంతకంటే గౌరవంగా చూస్తారు. (గుసగుసలాడుతూ) ఒక వేళ మీ ప్రేయసి ఇంకొకరితో ప్రేమకలాపం వెలగబెడుతున్నాదేమోనని మీకు అనుమానం ఉండిఉండొచ్చు.
త్రి: ఓరి నీ. నిన్ను పిశాచాలు పీక్కుతినా, నీకేం కావాలి?
సు: (చిన్న గొంతుకతో- అర్థమయ్యేలా చెయ్యి చూపిస్తూ) కావాలంటే ఈ చెయ్యి వాడ్ని కైలాసానికి పంపేస్తుంది. కొంచెం ఖర్చవుతుంది. అంతే!
త్రి: (తనలో) హమ్మయ్య! బ్రతికేను. (నిట్టూర్చును).
సు: ఈ సరికి నేనెటువంటి గౌరవప్రదమైన పెద్దమనిషినో మీకు అర్థమయ్యే ఉంటుంది.
త్రి: కనీస అవసరానికైనా పనికి వస్తావని అర్థం అయింది.
సు: (తెచ్చిపెట్టుకున్న వినయంతో)
రాజ్యంలోని స్త్రీల మాన ప్రాణాలకు రక్ష!
త్రి: ఒక శార్గ్జ్ఞవుణ్ణి చంపాలంటే ఏం తీసుకుంటావో చెప్పు?
సు: అది చంపబోయే మనిషిని బట్టీ , దానిలో మేం చూపించే నైపుణ్యాన్నిబట్టీకూడా ఉంటుంది.
త్రి: అదే ఒక రాజవంశీకుడయితే?
సు: ఆరి దేముడో! కత్తితో కడుపులో పొడవాలంటే చాలా “రిస్క్” ఉంది. వాళ్ళందరూ సాధారణంగా సాయుధులై ఉంటారు. వాళ్ళపై ప్రయత్నం అంటే, నా తొక్క నేను తాకట్టు పెట్టినట్లే. రాజవంశీకుడయితే వెల చాలా ఎక్కువ.
త్రి: (నవ్వుతూ) రాజవంశీకుడి ధర అయితే అంత ఎక్కువ అంటున్నావు, మనలో మనమాట. మధ్యతరగతి వాళ్ళు ఏమైనా వాళ్ళని వాళ్ళు నరుక్కుంటారా?
సు: ఆహా! అక్షరాలా! కాని అది చాలా అరుదుగా జరుగుతుంది. కేవలం గొప్పకుటుంబంలో పుట్టిన వాళ్ళకే ఈ క్రీడ. అయినా అక్కడక్కడ కొత్త ముఖలుంటాయి. (బొటకనవేలుతో మధ్యవేలును మీటుతూ) డబ్బు బాగా ఉంటుందనుకొండి. సందేహం లేదు. వాళ్లని చూస్తే నాకు జాలివేస్తుంది. గొప్పవాళ్ళని అనుకరిస్తూ వాళ్ళు నా సేవలు వినియోగించు కుంటారు . సగం ముందు చెల్లిస్తారు. మిగతాది పని పూర్తయేక.
త్రి: అయితే కొరతవేస్తారన్న భయం కూడ లేకుండా దీనికి సిధ్ధపడ్డావన్నమాట.
సు: (తేలికగా తీసిపారేస్తూ): అబ్బే, అదేం కాదు. పోలీసులకి లంచమిస్తాం.
త్రి: తలకి ఇంత అనా?
సు: సరిగ్గా అంతే! అయితే ఒకటి తప్ప. ఏలా చెప్పాలి చెప్మా? ఆ! ఆ వ్యక్తి రాజుగారయితే తప్ప.
త్రి: మరి మీ పని ఎలా కానిస్తారు?
సు: నేనయితే నా పని ఇంట్లోగాని, రోడ్డుమీద గాని పూర్తిచేస్తాను.
త్రి: అంటే ఎలా?
సు: రోడ్డుమీదనయితే- చాలా పదునుగా ఉన్న కత్తిని ఉపయోగిస్తాను. రాత్రి మాటు వేస్తాను.
త్రి: మరి ఇంటిదగ్గరయితేనో?
సు: దానిదేముంది. నా చెల్లెలు మొగలి సహాయం చేస్తుంది. అది చాలా చక్కనైనది. రాత్రివేళ డబ్బుకోసం వీధిలో నాట్యం చేస్తూ, నవ్వుల వల వేసి- మా “లక్ష్యాన్ని” ఇంటిదారి పట్టిస్తుంది. మా యింటికి రాగానే మట్టికరిపిస్తుంది.
త్రి: మరి చప్పుడూ, కేకలూ?
సు: అసలు గుట్టుచప్పుడుకాకుండా అంతాజరిగిపోతుంది… చాకచక్యంగా, ఇంత పిసరు అనుమానం రాకుండా. నా మనవి ఏమిటంటే, నాకేదైనా పనుంటే అప్పగించండి. మీకు సంతృప్తి కలిగేలా చేసిపెడతాను. నాకు దుకాణం లేకపోయినా, కావలిసిన ప్రచారం లేకపోయినా, మిగతా వెధవల్లాగ ఒక ప్రాణం తియ్యడంకోసం ఆపాదమస్తకం తొడుగులు వేసుకుని పదిమంది బయలుదేరే బాపతు కాదు. పిరికి పందలు. వాళ్ళకత్తికన్నా కురచనైన ధైర్యంగలవాళ్ళు. (పొడవైన కత్తి ఒకసారి బయటకు తీస్తూ) ఇదిగో, ఇదే నా ఆయుధం.
(త్రిభుల ఒక సారి నిర్ఘాంతబోతాడు)
సు: (నవ్వుతూ, శిరసు అవనతం చేస్తూ) మీ సేవకుడు.
త్రి: ప్రస్తుతం నీతో నాకు పని లేదు.
సు: అయ్యో! దురదృష్టం. పోనీ లెండి. మీకు గాని పని తగిలితే, “డ్యూక్ ఆఫ్ మెయిన్” భవనం దగ్గర నన్ను కలుసుకోవచ్చు. ప్రతిరోజూ, మధ్యాహ్నం నేనక్కడ తిరగడానికి వస్తాను. నా పేరు సుల్తాన్.
త్రి: దేశద్రిమ్మరివా?
సు: నిషా ఇస్తాను కూడా.
దూరం నుండి గద్దే: (పెన్న తో): ఆణిముత్యంలాంటి మనిషి. వాడి పేరు రాసుకుంటున్నా.
సు: నాగురించి చెడుగా అనుకోవటంలేదు గద!
త్రి: అబ్బే! ఏం? ఎందుకూ? అసలెందుకు తప్పుగా అనుకోవాలి? అందరూ బ్రతకాలి గదా!
సు: నేను బికారినీ, సోమరిపోతునీ, దొంగవెధవనీ కాలేక. నాకు నలుగురు పిల్లలు.
త్రి: వాళ్ళకి తిండిపెట్టకుండా వదలివేయడం అనాగరికం. (అతన్ని వదిలించుకుందికి) వెళ్ళిరా! దేముడు నీకు మేలు చేయుగాక!
(దూరంగా) పెన్న: (గద్దేతో) ఇక్కడ ఇంకా వెలుతురు బాగానే ఉంది. మరికొంచెం చీకటి పడ్డాక వద్దాం పద. (ఇద్దరూ నిష్క్రమిస్తారు)
త్రి: (సుల్తాన్ తో నిర్లక్ష్యంగా) సరే, ఉండు మరి!
సు: వీడు తమ సేవకుడు, మరిచిపోకండి. శలవు. (నిష్క్రమిస్తాడు)
త్రి: (అతను వెళ్ళిన దిక్కునే పరికిస్తూ)
అతని వృత్తికీ నా వృత్తికీ ఎంత సామ్యం ఉంది!
అతని కత్తి వాడియైనదే. కాని అంతకంటే పదునైన మాటలతో
గుండెలు గాయం చెయ్య గలను- అతని కత్తి కంటే లోతుగా.
(సశేషం)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి